France students protests over education funding 
అంతర్జాతీయం

ఫ్రాన్స్​లో మళ్లీ నిరసనల హోరు.. కారణాలివీ

విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటూ ఫ్రాన్స్‌ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం నిరసనలతో హోరెత్తింది. ప్యారిస్‌లో జరిగిన ర్యాలీలో గ్రెటా థన్‌బర్గ్ పాల్గొన్నారు.

Haji Pasha

ప్యారిస్​ (ఫ్రాన్స్​): ఫ్రాన్స్ మరోసారి నిరసనలతో హోరెత్తింది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటూ విద్యార్థులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతుగా మంగళవారం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. వామపక్ష పార్టీ ఫ్రాన్స్​ అన్​బోవ్డ్​, పలు ప్రజా సంఘాలు కలిసి మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని నగరం ప్యారిస్​ సహా దేశంలోని అన్ని నగరాల్లో ఏకకాలంలో నిరసన ర్యాలీలను నిర్వహించాయి. తాజాగా ప్యారిస్​ శివారులోని సెయింట్​ – డెనిస్ ఏరియాలో ఉన్న ప్రభుత్వ హైస్కూలులో జరిగిన విద్యార్థుల నిరసనల్లో ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్​బర్గ్ పాల్గొన్నారు. ​వారి ఉద్యమానికి ఆమె సంఘీభావం తెలిపారు. ఈ నిరసనలకు కొనసాగింపుగా అక్టోబరు 17న(శనివారం) మరో కీలకమైన ర్యాలీ జరగబోతోంది. నిత్యావసరాల ధరల మంటను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఎల్లో వెస్ట్స్ ఉద్యమకారులు కలిసి ఆ రోజున దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

స్కూలులో తుపాకీతో బాలుడి కాల్పులు

సోమవారం (అక్టోబరు 12న) కూడా పలుచోట్ల విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆ రోజున మార్సెయిల్​ నగరంలో 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. వేట తుపాకీతో కాల్పులు జరిపి స్కూలు హెడ్​ మాస్టర్​, టీచర్​లను గాయపరిచాడనే అభియోగాలను అతడిపై నమోదు చేశారు. అక్టోబరు 12న ప్యారిస్​ ప్రాంతం, బోర్​డ్యూక్స్​, లియాన్​లలో జరిగిన విద్యార్థి నిరసనల్లో దాదాపు 8 మంది బోధనా సిబ్బంది గాయపడ్డారని స్వయంగా దేశ విద్యాశాఖ వెల్లడించింది.  బాలుడు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనను ఇందులో కలపకపోవడం గమనార్హం.

హింస పెరిగిందన్న విద్యాశాఖ.. సమయం కావాలన్న మాక్రాన్​

‘‘విద్యార్థుల నిరసనలు తగ్గుముఖం పట్టాయి. వీటి ప్రభావంతో మూతపడిన  స్కూళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. దేశంలోని 3,700 హైస్కూళ్లు, ఇంటర్​ కాలేజీలలో 130 మాత్రమే అక్టోబరు 12న తెరుచుకోలేదు. కానీ విద్యార్థుల నిరసనల కారణంగా జరుగుతున్న హింస తీవ్రరూపు దాలుస్తోంది” అని విద్యాశాఖ ప్రకటించడం పరిస్థితి తీవ్రతను అద్దంపడుతోంది. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమాన్యుయేల్​ మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ‘‘విద్యార్థుల వినతుల పరిష్కారానికి తగినంత సమయం అవసరం. అప్పటివరకు వాళ్లు సంయమనంతో వ్యవహరించాలి. ఈ సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలు, గౌరవం అవసరం’’​ అని ఆయన వెల్లడించారు.

ఉద్యమం వేదికగా పాలిటిక్స్​

ఫ్రాన్స్​లో వచ్చే ఏడాది (2027) ఏప్రిల్​, మే నెలల్లో రెండు విడతల్లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్​ మాక్రాన్ ఇప్పటికే రెండుసార్లు అధ్యక్షుడయ్యారు. దీంతో మరోసారి ఆయన పోటీ చేయడానికి వీలుండదు. ఈ తరుణంలో విద్యార్థుల నిరసన ఉద్యమాన్ని దేశాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఇతర అభ్యర్థులు వేదికగా వాడుకుంటున్నారు. వామపక్ష పార్టీల తరఫున దేశాధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న జీన్ ల్యూక్​ మెలెంఛాన్ విద్యార్థులకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. స్టూడెంట్స్​పై పోలీసుల బలప్రయోగాన్ని ఆయన ఖండించారు. వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ​ఆదివారం రోజు నిరసన కార్యక్రమం నిర్వహించిన వేదికపైకి విద్యార్థి ఉద్యమకారులను ఆహ్వానించారు. ఓటుహక్కుకు సంబంధించిన అర్హత వయసును 16 ఏళ్లకు తగ్గిస్తామని, విశ్వవిద్యాలయాల అడ్మిషన్లలో అసమానత్వాన్ని పారదోలుతామని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. మరోవైపు తీవ్ర జాతీయవాద పార్టీ తరఫున దేశాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మారైన్​ లే పెన్​ పోలీసులకు మరిన్ని అధికారాలివ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ పార్టీ నుంచే దేశాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ప్రధానమంత్రి ఎడ్వర్డ్​ ఫిలిప్​ కూడా ఇదేవిధమైన వైఖరిని వెలిబుచ్చారు.

నిరసనలకు అసలు కారణాలివీ

ఫ్రాన్స్ ప్రభుత్వం 2027 బడ్జెట్‌లో పొదుపు చర్యలకు పెద్దపీట వేసింది. అనవసర ఖర్చులను తగ్గించుకొని సుమారు రూ.6 లక్షల కోట్లు (60 బిలియన్ యూరోలు) పొదుపు చేయాలని నిర్ణయించింది. ఈ కారణం వల్లే ప్రభుత్వ విద్యా రంగానికి నిధులు తగ్గిపోతాయనే భయం దేశ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో మొదలైంది. టీచర్లు సరిపడా సంఖ్యలో లేకపోవడంతో ఇప్పటికే దేశంలోని అనేక ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 10 శాతం విద్యా గంటలు వినియోగంలోకి రావడం లేదు. ప్రతి క్లాస్‌రూమ్‌లో 32 నుంచి 35 మంది విద్యార్థులను కూర్చోబెడుతుండటంతో చదువుకోవడం ఇబ్బందిగా మారింది. వడగాలులు వీచే సీజన్​లలోనూ క్లాస్‌రూమ్‌లలో ఏసీ, ఇన్సులేషన్ వసతులు ఏర్పాటు చేయడం లేదు. చాలా స్కూల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

సెప్టెంబరు మూడో వారంలో తొలి నిరసన

సెప్టెంబర్ 18-21 తేదీల్లో ప్యారిస్​ శివారులోని సెయింట్-డెనిస్‌లో ఉన్న సెయింట్-ఎక్జుపెరీ హైస్కూల్‌లో టీచర్ల కొరతకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి తొలి నిరసన ప్రదర్శన ప్రారంభించారు. ఇది వేగంగా ఇతర నగరాలకూ పాకింది. సెప్టెంబర్ 28 - అక్టోబర్ 2 మధ్యకాలంలో ఈ ఉద్యమం సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించింది. అక్టోబర్ 1న ఒక్కరోజే ఫ్రాన్స్ అంతటా సుమారు 1,949 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరాల్లో ఘర్షణలు, చెత్త డబ్బాలను తగలబెట్టడం వంటి హింసాత్మక ఘటనలు జరిగాయి. అక్టోబరు 6న విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల పిలుపుతో దేశవ్యాప్తంగా అత్యంత భారీ నిరసన జరిగింది.  దాదాపు 4,50,000 మంది వీధుల్లోకి వచ్చారు. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో కొందరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

అక్టోబరు 8న.. ​71,500 మందికిపైగా రోడ్లపైకి

వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నుంచే ఫ్రాన్స్​లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. కనీసం అక్టోబరు 17 నుంచి నవంబరు 2 వరకున్న హాఫ్​ టర్మ్​ సెలవుల సీజన్​లోనైనా నిరసనకారులు శాంతిస్తారని ప్రభుత్వవర్గాలు భావించాయి. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు పూర్తిభిన్నంగా ఉంది. అంతకుముందు అక్టోబరు 8న సైతం ఫ్రాన్స్​ వ్యాప్తంగా ​71,500 మందికిపైగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. వీరిలో అత్యధికులు హైస్కూల్ (లైసీ), యూనివర్సిటీ విద్యార్థులే. ఆ రోజు దాదాపు 55,000 మంది విద్యార్థులు తమ పాఠశాలల ముందే రోడ్లను దిగ్బంధించి నిరసన తెలపగా, మిగిలిన వారు ప్రధాన నగరాల వీధుల్లో ర్యాలీలు చేశారు. ఆ ప్రదర్శనల సమయంలో కొన్ని చోట్ల పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరగడంతో భద్రతా దళాలు 500 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశాయి. ప్రభుత్వ స్కూళ్లలోని అధ్వాన్నమైన పరిస్థితులపై కోపంతో ఉన్న కొందరు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, విపక్ష పార్టీలు కూడా వీరికి మద్దతుగా ఈ ర్యాలీలలో పాల్గొన్నాయి.

కొండంత అడిగితే, రవ్వంత ఇస్తారా ?

అక్టోబరు 8న జరిగిన నిరసనల ప్రభావంతో, 114 హైస్కూళ్లలో 3వేల మంది తాత్కాలిక ఉపాధ్యాయులను నియమిస్తామని ఫ్రాన్స్​ సర్కారు ప్రకటించింది. ఈ భర్తీ ప్రక్రియ మొదలైందని తాజాగా అక్టోబరు 12న(సోమవారం) ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఈ ప్రకటనపై జాతీయ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొండంత అడిగితే, రవ్వంత చేసే ప్రయత్నంలో మాక్రాన్​ ప్రభుత్వం ఉందని మండిపడ్డాయి. ప్రభుత్వ హైస్కూళ్లను తీర్చిదిద్దేందుకు రూ.1 లక్ష కోట్లు (11 బిలియన్​ డాలర్లు) విడుదల చేయాలని డిమాండ్​ చేశాయి.

గతంలోనూ ఫ్రాన్స్​లో నిరసనలు

1789 నాటి ఫ్రెంచ్ విప్లవానికి వేదికైన ఫ్రాన్స్​ దేశంలో ప్రజలు తమ నిరసనలను, సమస్యలను వీధుల్లోకి తీసుకురావడం పెద్ద వింతేమీ కాదు. గతంలోకి వెళితే, 1968లో భారీ విద్యార్థుల నిరసనలు జరిగాయి. 2005లో కొన్ని వారాల పాటు ప్యారిస్​లోని శివారు ప్రాంతాలలో అశాంతి చెలరేగింది. 2018-2019 కాలో ఎల్లో వెస్ట్ నిరసనలతో ఫ్రాన్స్​ అట్టుడికింది. 2023లో పదవీ విరమణ వయస్సును పెంచడానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరిగాయి.

పొరుగుదేశాల్లోనూ నిరసనలు

ఫ్రాన్స్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల ప్రభావంతో బెల్జియంలోని లీజ్ నగరంలో 2026 అక్టోబరు మొదటివారంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. పాఠశాలలను మూసివేశారు. గత వారం ఇటలీలోని పలు నగరాల్లోనూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. అయితే, ఇవి ఫ్రాన్స్‌తో పోలిస్తే చిన్న స్థాయిలో జరిగాయి.