ప్రపంచ టెక్‌ రంగంలో ఉద్యోగ కోతలు 
అంతర్జాతీయం

ఏఐ ప్రభావం.. ఖర్చుల కోత : ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌ల కలకలం!

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. 2026లో టెక్‌ రంగంలో ఉద్యోగ కోతలు, భారత్‌లో ఐటీ ఉద్యోగులపై ప్రభావం, నియామకాలపై పూర్తి వివరాలు.

Phaneendra

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతల పరంపర  కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో గ్లోబల్ దిగ్గజ సంస్థలు ప్రకటిస్తున్న లేఆఫ్‌లు అంతర్జాతీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ఊహించని రీతిలో పెరగడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనే తీవ్ర ఒత్తిడి, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ  వంటి కారణాలతో హెడ్‌కౌంట్‌ను తగ్గించుకునేందుకు కంపెనీలు అనుసరిస్తున్న వ్యూహాత్మక ప్రణాళికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను, ఉద్యోగ భద్రతపై ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

గతేడాది కంటే 31 శాతం పెరిగే అవకాశం!

Layoffs.fyi ట్రాకర్‌ ప్రకారం, 2026 అక్టోబర్‌ చివరి నాటికి ప్రపంచ టెక్‌ రంగంలో నమోదైన ఉద్యోగ కోతలు 1.31 లక్షలు దాటాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనూ నెలకు సగటున 10,000–12,000 చొప్పున కోతలు నమోదైతే.. ఏడాది చివరికి ఈ సంఖ్య 1.50 నుంచి 1.55 లక్షలకు చేరే అవకాశం ఉంది. సాధారణంగా ఏడాది చివర్లో కంపెనీలు బడ్జెట్‌ సమీక్షలు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బిగ్‌టెక్‌ సంస్థలు మరిన్ని కోతలు ప్రకటిస్తే.. మొత్తం సంఖ్య 1.60 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదు. అదే కనుక జరిగితే, 2025లో నమోదైన 1,22,606 ఉద్యోగ కోతలతో పోలిస్తే ఈ ఏడాది లేఆఫ్‌ల సంఖ్య దాదాపు 31 శాతం మేర గణనీయంగా పెరిగినట్లవుతుంది.

 బిగ్ టెక్ దిగ్గజాల్లోనూ విరుచుకుపడిన కోతలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై బడ్జెట్‌ను మళ్లించడం, ఆటోమేషన్ ద్వారా ఉత్పాదకతను పెంచడం, విభాగాల పునర్వ్యవస్థీకరణ కారణాలతో టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగ కోతలు చేపట్టాయి. ఒరాకిల్‌లో సుమారు 21,000, అమెజాన్‌లో 17,000కు పైగా, డెల్‌లో 11,000, మెటాలో 10,400, మైక్రోసాఫ్ట్‌లో 4,800–5,300, బ్లాక్‌, సిస్కోలో చెరో 4,000, పేపాల్‌లో 4,760, ఉబర్‌లో 3,300, ఇంట్యూట్‌లో 3,000, వైజ్‌టెక్‌ గ్లోబల్‌లో 2,000, అట్లాసియన్‌లో 1,600 ఉద్యోగ కోతలు నమోదైనట్లు సమాచారం. ఇటీవల మైక్రోసాఫ్ట్‌  భారత్‌, అమెరికా, బ్రిటన్‌, కెనడా దేశాల్లోని ఎంపిక చేసిన విభాగాల్లో సుమారు 60,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ పథకం (VEO) ప్రకటించింది.

 టెక్‌కే కాదు.. నాన్-టెక్ రంగాలకూ తాకిన సెగ

టెక్‌ రంగానికే కాకుండా ఇతర పరిశ్రమల్లోనూ భారీగా ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నాయి. అమెరికాకు చెందిన అంతర్జాతీయ లాజిస్టిక్స్‌, కొరియర్‌ సంస్థ యూపీఎస్‌ 30,000 వరకు ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించగా, బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకోలో సుమారు 9,000, బార్క్లేస్‌లో 5,000 ఉద్యోగ కోతలు నమోదైనట్లు నివేదికలు తెలిపాయి. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లో 3,000–4,000 వరకు కోతలు ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి. వీసాలో సుమారు 2,600, వోల్వో కార్స్‌లో 2,500 ఉద్యోగాల కోతలు నమోదయ్యాయి. ఈబే అక్టోబరులో సుమారు 1,000, ఫిబ్రవరిలో 800 ఉద్యోగాల కోతలను ప్రకటించగా, నైక్‌ జనవరిలో 775 ఉద్యోగాలను తగ్గించింది.

భారత్‌పైనా ప్రభావం

ప్రపంచ టెక్‌ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్‌ల సునామీ ప్రభావం భారతదేశంపైనా తీవ్రంగా పడుతుండటంతో వేలాది మంది టెక్ నిపుణులు ఉపాధి కోల్పోతున్నారు. ఒరాకిల్ భారత్ విభాగంలో దాదాపు 12,000 నుంచి 15,000 మంది, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కేంద్రాల్లోని అమెజాన్, మైక్రోసాఫ్ట్ సేల్స్, కార్పొరేట్, డెవలప్‌మెంట్ టీమ్‌లలో సుమారు 3,000 నుండి 4,000 మందికి పైగా ఉద్యోగులు పింక్ స్లిప్‌లు అందుకున్నారు. అలాగే పేపాల్ సంస్థలో 220 నుండి 600 మంది, ఇంటెల్‌లో 1,500 మందికి పైగా, శాంసంగ్‌లో సుమారు 80–100 మంది, జొమాటాలో సుమారు 250 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు.  Layoffs.fyi, దేశీయ ట్రాకర్ల గణాంకాల ప్రకారం.. లివ్‌స్పేస్, ఓలా ఎలక్ట్రిక్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, గేమ్స్24x7, కొరోహెల్త్ వంటి భారతీయ స్టార్టప్‌లు, టెక్ కంపెనీలలో 2026 సెప్టెంబర్ నాటికే సుమారు 4,700కి పైగా ప్రత్యక్ష లేఆఫ్‌లు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే 2026లో ఇప్పటివరకు భారత్‌లో సుమారు 25,000 నుంచి 35,000 మందికి పైగా టెక్ ఉద్యోగులు లేఆఫ్‌ల బారిన పడినట్లు అంచనా.

 అనిశ్చితిలో ఐటీ భవిష్యత్తు

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లేఆఫ్‌ల ప్రభావం ఉద్యోగాల కోతకే పరిమితం కావడం లేదు. భారత ఐటీ రంగంలో నియామకాలు, వేతనాలు, ఉద్యోగ భద్రతపైనా ప్రభావం చూపుతోంది.  ప్రాజెక్ట్‌లు లేని బెంచ్ ఉద్యోగులను తొలగించడం,  కఠినమైన పెర్ఫార్మెన్స్ రివ్యూల ద్వారా హెడ్‌కౌంట్‌ను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ అందుబాటులోకి రావడంతో ప్రాథమిక స్థాయి కోడింగ్, టెస్టింగ్, హెచ్‌ఆర్ వంటి సాధారణ (రోటీన్) పనులు చేసే జూనియర్ ఉద్యోగులు, ఫ్రెషర్ల నియామకాలు నిలిచిపోయాయి. ఉద్యోగం కోల్పోయిన వారికి తక్షణమే మరో అవకాశం దొరకడం లేదు. ఒకవేళ కొత్త ఉద్యోగం లభించినా.. గతంలో అందుకున్నంత వేతనం దక్కడం  లేదు. దీంతో ఐటీ ఉద్యోగులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

2027 ఎలా ఉండబోతోంది?

2027లోనూ ఐటీ రంగంలో భారీ స్థాయిలో నియామకాల కంటే అవసరమైన నైపుణ్యాలున్నవారిని ఎంపిక చేసుకునే ధోరణి కొనసాగవచ్చు. గార్ట్‌నర్‌ సర్వే ప్రకారం, సంస్థల్లో ఐటీ విభాగాలకు నాయకత్వం వహించే ఉన్నతాధికారుల్లో 40 శాతం మంది 2027లో సిబ్బందిని పెంచుకోవాలని భావిస్తుండగా, 37 శాతం మంది సిబ్బంది సంఖ్యలో మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో నియామకాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి.  హాన్‌ డిజిటల్‌ అంచనాల ప్రకారం, భారత ఐటీ–బీపీఎం రంగంలో ఫ్రెషర్ల నియామకాలు 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.75 లక్షలు ఉంటే 2026–27లో 2.1 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, నాస్కామ్‌ అంచనాల ప్రకారం.. భారత్‌లో ఏఐ నిపుణుల అవసరం 2027 నాటికి 12.5 లక్షలకు పైగా చేరవచ్చు. అంటే ఏఐ వల్ల కొన్ని సంప్రదాయ ఉద్యోగాలపై ఒత్తిడి పెరిగినా..  డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ,  ఏఐ ఆధారిత నూతన సాంకేతిక రంగాలలో కొత్త ఉద్యోగావకాశాలు భారీగా అందుబాటులోకి రానున్నాయి.