Houthi Attack On Riyadh Airport 
అంతర్జాతీయం

రియాద్ ఎయిర్‌‌పోర్ట్‌పై హౌతీల క్షిపణి దాడి

రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీల క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Aravind Reddy

రియాద్‌: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్నది. తాజాగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి చేశారు. ఈ దాడిలో ఎయిర్‌‌లైన్స్‌ ఉద్యోగి సహా ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. దాడి ప్రభావంతో విమానాశ్రయ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. సౌదీ ఎయిర్‌‌లైన్స్‌కు చెందిన ఓ విమానం దెబ్బతిన్నది. పలు విమానయాన సంస్థలు రియాద్‌కు తమ సర్వీసులను రద్దు చేశాయి.

సౌదీ ప్రతిదాడి
హౌతీల దాడులకు ప్రతిగా యెమెన్‌ రాజధాని సనాపై సౌదీ అరేబియా ప్రతిదాడులు చేసింది. హౌతీలకు చెందిన మూడు క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసినట్టు సౌదీ అధికారులు ప్రకటించారు. పౌరులపై దాడులను సహించబోమని, వాటికి దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. మరోవైపు యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన తర్వాత ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హౌతీలు ఎర్ర సముద్రం, దాని దక్షిణ ద్వారమైన బాబ్‌ అల్‌ మందెబ్‌ జలసంధిలో నౌకలపై దాడులు చేస్తున్నారు. దీనికి తోడు సౌదీ అరేబియాపై క్షిపణి దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌ ఆంక్షలతో గల్ఫ్‌ ప్రాంతం నుంచి చమురు సరఫరాపైనా ఒత్తిడి పెరుగుతున్నది.