న్యూఢిల్లీ: ‘వన్ – చైనా’ పాలసీకి వత్తాసు పలుకుతూ, తమ గగనతలం మీదుగా తైవాన్ విమానాలు రాకపోకలు సాగించకుండా పాకిస్థాన్ నిషేధాన్ని ప్రకటించింది. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒకవేళ భారత్ – తైవాన్ మధ్య నేరుగా విమాన సర్వీసులుంటే, అవి ఖచ్చితంగా నడిచి తీరుతాయి” అని ఆయన స్పష్టం చేశారు. చైనా ఒత్తిడి వల్లే తైవాన్ విమాన సర్వీసులను తమ గగనతలంలో బ్యాన్ చేయాలని పాక్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ, భారత్ అలా చేయదని, స్వతంత్రంగానే నిర్ణయాలను తీసుకుంటుందనే సంకేతాలిచ్చేలా రణధీర్ జైస్వాల్ కామెంట్స్ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
అక్టోబర్ 24 నుంచే రూట్ మారింది
గతంలో తైవాన్‌కు చెందిన ‘చైనా ఎయిర్‌లైన్స్’ విమానాలు భారత్, పాకిస్థాన్, తుర్క్మెనిస్తాన్ మీదుగా ఆసియా, ఐరోపా దేశాలకు రాకపోకలు సాగించేవి. అయితే, గగనతలాన్ని పాక్ బ్యాన్ చేయడంతో అక్టోబర్ 24 నుంచి తైవాన్ ఫ్లైట్స్ అన్నీ రష్యా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. తైవాన్ విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయాన్ని బుధవారం పాక్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ సైతం ధ్రువీకరించారు. వన్ చైనా విధానాన్ని తమ విమానయాన విభాగం అనుసరించి తీరుతుందని ఆయన తేల్చి చెప్పారు. చైనాకు చెందిన విమానాలకే పాక్‌లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.