భారత పైలట్ స్మిత్ మచార్‌కు యూఏఈ అధ్యక్షుడు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారాన్ని అందించారు 
అంతర్జాతీయం

కెప్టెన్ మచార్‌కు యూఏఈ అత్యున్నత పురస్కారం

ఫ్లై దుబాయ్ విమానంలో ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచార్‌కు యూఏఈ అధ్యక్షుడు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారాన్ని అందించారు.

Srinivas Rao

అబుదాబీ : ఫ్లై దుబాయ్ విమానంలో సహ పైలట్ చేసిన దాడిని ఎదుర్కొంటూనే ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచార్‌ను యూఏఈ ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్-2’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ సమక్షంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో మచార్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. గాయాల తీవ్రత కారణంగా ఎడమ చేతికి కట్టుతోనే ఆయన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రయాణీకులను కాపాడటంలో కెప్టెన్ స్మిత్ చూపిన కర్తవ్యనిష్ఠ దేశానికే గర్వకారణమని యూఏఈ నాయకత్వం కొనియాడింది. ఈ అంశంపై యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్పందిస్తూ, "ప్రయాణికుల భద్రతను కాపాడటంలో సిబ్బంది చూపిన ధైర్యం, బాధ్యత అభినందనీయం" అని తెలిపారు.