అంతర్జాతీయం

అమెరికా అణుదాడి చేస్తే 24 గంటల పాటు బయటకు రావద్దు.. ప్రజలకు ఇరాన్ మార్గదర్శకాలు

అమెరికా దాడి ఆందోళనల నేపథ్యంలో అణు విస్ఫోటనం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇరాన్ ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

Phaneendra

టెహరాన్ : అమెరికా దాడి చేయవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వం ప్రజలకు అరుదైన అణు దాడి రక్షణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అణు విస్ఫోటనం జరిగితే ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో వివరించింది. భవనాల బేస్‌మెంట్లు, కిటికీలు లేని లోపలి గదుల్లో ఆశ్రయం పొందాలని, తలుపులు, కిటికీలు మూసివేయాలని సూచించింది. పికాక్స్‌ మౌంటెయిన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య ఈ సూచనలు వెలువడ్డాయి. బయట గాలిని లోపలికి తీసుకొచ్చే ఏసీలు, వెంటిలేషన్‌ వ్యవస్థలను నిలిపివేయాలని తెలిపింది. దాడి తర్వాత కనీసం 24 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని, ప్యాక్‌ చేసిన ఆహారం, సీసాల్లోని నీటిని మాత్రమే వినియోగించాలని హెచ్చరించింది. ఈ మార్గదర్శకాలను ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ అక్టోబర్ 29న ప్రచురించింది. ఒకవేళ అణు విస్ఫోటనం సమయంలో ఎవరైనా బయట ఉంటే.. పేలుడు వెలుగును నేరుగా చూడొద్దని, నేలపై పడుకుని తల, ముఖాన్ని కాపాడుకోవాలని సూచించింది. ఇస్ఫహాన్‌ ప్రావిన్స్‌ అత్యవసర సేవల విభాగం రూపొందించిన ఈ వీడియో వెలువడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రేడియోధార్మిక ధూళి శరీరంపై పడితే బయట దుస్తులను జాగ్రత్తగా తొలగించి, మూసిన సంచిలో ఉంచాలని, చర్మం, జుట్టును సబ్బు, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని సూచించింది. అధికారిక సమాచారం కోసం బ్యాటరీతో పనిచేసే రేడియోలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది.