ఇస్తాంబుల్: తుర్కియే దేశంలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వరద ముంచెత్తిందని, ఈ విపత్తులో నలుగురు మృతి చెందినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్టీ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన సారియెర్లో పర్యటించిన మంత్రి సిఫ్టీ మాట్లాడుతూ.. ప్రజలకు సహాయం చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ‘1942 తర్వాత ఇంతటి భారీ వరద విపత్తును ఇప్పుడు ఎదుర్కొంటున్నాం’ అని పేర్కొన్నారు. వరదల కారణంగా నష్టం, ఇతర సమస్యలకు సంబంధించి మొత్తం 9,850 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు, ప్రజలకు సాయం అందించేందుకు ఇస్తాంబుల్‌లో 46 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పర్యావరణం, పట్టణీకరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి మురాత్ కురుమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వచ్చే నెల తుర్కియేలోని అంటాల్యా నగరంలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు (COP31)కు అధ్యక్షత వహించనున్న కురుమ్.. ఈ వరదలకు వాతావరణ మార్పుల ప్రభావం కూడా కారణమన్నారు. ‘వాతావరణ మార్పులను ఎదుర్కోవడం అనేది మన ఇష్టం మీద ఆధారపడిన విషయం కాదు, అది తప్పనిసరి అవసరం’ అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు నగరం మొత్తం జలమయమైంది. గురువారం ఉదయానికి ముందు 48 గంటల వ్యవధిలో కురిసిన వర్షపాతం.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సాధారణంగా నమోదయ్యే చారిత్రక సగటు వర్షపాతాన్ని మించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనడోలు వార్తా సంస్థ వెల్లడించింది.