Knight Frank Wealth Report 2026 
అంతర్జాతీయం

రోజుకు 89 మంది కొత్త కోటీశ్వరులు : నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక

ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.285.67 కోట్లు) పైగా ఆస్తులున్న ‘అల్ట్రా హై నెట్‌వర్త్‌’ సంపన్నుల జాబితాలోకి రోజుకు సగటున 89 మంది కొత్తగా చేరుతున్నారు.

Srinivas Rao

లండన్: ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.285.67 కోట్లు) పైగా ఆస్తులున్న ‘అల్ట్రా హై నెట్‌వర్త్‌’ సంపన్నుల జాబితాలోకి రోజుకు సగటున 89 మంది కొత్తగా చేరుతున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ విడుదల చేసిన ‘ది వెల్త్‌ రిపోర్ట్‌ 2026’ 20వ ఎడిషన్‌ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ‘‘అల్ట్రా-హై-నెట్-వర్థ్’’ సంపన్నుల సంఖ్య 2026 నాటికి 7,13,626కి చేరింది. భౌగోళిక వాటాల పరంగా చూస్తే అమెరికా 35 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, చైనా 17 శాతం, భారత్ 2.8 శాతంతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాబోయే 5 సంవత్సరాలలో ఇండోనేషియా, సౌదీ అరేబియా, పోలాండ్ దేశాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంపద కేంద్రాలుగా అవతరించనున్నాయని ఆధ్యయనకర్తలు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీ ఆఫీసులు సుమారు 10,000కి చేరాయని, ఇవి ప్రధానంగా డేటా సెంటర్లు, స్టూడెంట్ హౌసింగ్, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టి సారిస్తున్నాయని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో వస్తున్న మార్పులను, అంతర్జాతీయంగా సంపద పెరుగుదల, లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లు, నూతన పెట్టుబడుల సరళిపై ఈ నివేదిక సమగ్ర సమాచారాన్ని అందించింది.

 లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో టోక్యో నంబర్ వన్

ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలు సగటున 3.2 శాతం మేర వృద్ధి చెందాయి. నగరాల వారీగా చూస్తే జపాన్ రాజధాని టోక్యో అత్యధికంగా 58.5 శాతం వృద్ధితో ప్రథమ స్థానంలో నిలవగా, దుబాయ్ 25.1 శాతంతో రెండో స్థానంలో ఉంది. అయితే లండన్ నగరంలో మాత్రం లగ్జరీ ఇళ్ల ధరలు 4.7 శాతం క్షీణించాయి. సంపన్నులు ఇప్పుడు కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పలు నివాసాలను ఒక గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లా భావిస్తూ 'పోర్ట్‌ఫోలియో ఆఫ్ హోమ్స్' ట్రెండ్‌ను అనుసరిస్తున్నట్లు అధ్యయనం. ఈ సరికొత్త ధోరణి అంతర్జాతీయ ప్రాపర్టీ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్‌ను ప్రవేశపెట్టి ముందుకు సాగుతోంది.

 భారతదేశంలో రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాల ప్రగతి

భారత్‌లో 2026 మొదటి అర్ధభాగంలో (H1) రెసిడెన్షియల్ మార్కెట్ అత్యుత్తమ ఫలితాలను సాధించింది. ఈ కాలంలో 1,71,471 నివాసాలు అమ్ముడవగా, 1,87,350 కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. అమ్ముడుపోని ఇన్వెంటరీ 5,25,695 యూనిట్లుగా నమోదైంది. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో 5 శాతం, చెన్నైలో 3 శాతం, అహ్మదాబాద్‌లో 2 శాతం చొప్పున విక్రయాలు వృద్ధి చెందాయి. ఇక కమర్షియల్ ఆఫీస్ లీజింగ్ రంగం 4.80 బిలియన్ చదరపు అడుగులకు చేరుకోగా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీఎస్) ఈ వృద్ధికి ప్రధాన కారణమని విశ్లేషకులు తెలిపారు.

 సమగ్ర విశ్లేషణ.. మార్కెట్ తీరుతెన్నులు

నైట్ ఫ్రాంక్ నివేదికపై భిన్న రంగాలకు చెందిన నిపుణులు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, పెట్టుబడిదారులకు మాత్రం ఇది అత్యంత మార్గదర్శకంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత ఊపందుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. వాణిజ్య భవనాల లీజింగ్ విషయంలో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు రావడం పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తానికి భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం మరింత లాభాల బాట పట్టే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషించారు. మొత్తంమీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నట్లు ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.