లైఫ్ చాలా బిజీబిజీగా గడుస్తుందా? ఏం చేసినా, ఏం తిన్నా, ఏం కొన్నా.... ఇంకా ఏదో మిస్ అవుతున్నామన్న భావన కలుగుతుందా! డోంట్ వర్రీ. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ చిన్న ఓ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. కొత్త ప్లేసెస్‌కి వెళ్లి అక్కడి మట్టి పరిమళాన్ని, సంస్కృతిని, నాగరికతని, కళలను, జీవనవిధానాన్ని ఆస్వాదించండి. ఎగిరే తుమ్మెదకే తేనె దొరుకుతుంది కదా! దాంతో లైఫ్ మళ్లీ రిఫ్రెష్, రీచార్జ్ అవ్వడం పక్కా..
ఇంటర్నెట్లో కొత్త ప్లేసెస్ చూసినా, కొత్త సంగీతం విన్నా వెంటనే దాని గురించి సెర్చ్ చేయడం మొదలెడుతాం. సెర్చ్ చేయడమే కాదు, దాని గురించి తెలుసుకుంటాం కూడా! అలాంటి ఒక ప్రశాంతమైన, చారిత్రాత్మక నగరమే జపాన్ సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన క్యోటో. జపాన్ దేశంలోనే అత్యంత అందమైన నగరం క్యోటో. నిశబ్దమైన వీధులు, శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయాలు, సంప్రదాయ టీ హౌస్‌లు... వీటన్నింటినీ కలియతిరుగుతూ నగరాన్ని తనివితీరా చూడొచ్చు. సంప్రదాయ చెక్క ఇళ్లు, దీపాలతో అలంకరించిన సన్నని వీధులు, ప్రవేశద్వారాల వెనుక దాగి ఉన్న చిన్న తోటలు దర్శనమిస్తాయి.
సంస్కృతి భద్రం
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6-7.5 కోట్ల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ఓ అంచనా. ఈ యుద్ధంలో మరణించిన వారిలో ఎక్కువ మంది పౌరులే. సుమారు 5 కోట్లు మంది పౌరులు హత్యలు, ఆకలి, అంటువ్యాధులు, హోలోకాస్ట్ వంటి దుర్ఘటనల వల్ల ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది తమ ఇళ్లను కోల్పోయి శరణార్థులుగా మారారు. ఇది ఏమాత్రం ఊహకందని విపత్తు. ఈ భీకరమైన యుద్ధం నుంచి క్యోటో మాత్రం తృటిలో తప్పించుకుంది. దీనివల్ల క్యోటోలో శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడాలు ఏమాత్రం దెబ్బతినకుండా సురక్షితంగా మిగిలాయి. జపాన్ సాంప్రదాయక సంస్కృతిని, బౌద్ధమత మూలాలను తెలుసుకోవడానికి మిగిలిన ప్రధాన కేంద్రంగా మారింది.
దేశానికి మూలవిరాట్టు
క్యోటో నగరం ఇంకా పరిసర ప్రాంతాలలో 17 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. నగరంలో సుమారు 1,600 బౌద్ధ దేవాలయాలు, 400 షింటో పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిలో ‘ఫుషిమి ఇనారి తైషా’ ఒకటి. ఇది కొండపైకి వెళ్లే దారి పొడవునా వేలాది ఎరుపు రంగు పూలతో కప్పబడి ఉంటుంది. 'గోల్డెన్ పెవిలియన్’ అని పిలుచుకునే మరో బౌద్ధ దేవాలయంపై రెండు అంతస్తులు పూర్తిగా బంగారు లేపనంతో కప్పబడి ఉంటాయి. అలాగే ‘కియోమిజు-దెరా’ ఒక్క మేకు కూడా వాడకుండా, కేవలం చెక్కతో పర్వత అంచున నిర్మించిన అద్భుతమైన చారిత్రక కట్టడం. ‘అరాషియామా’ ఒక వెదురు అడవి. ఇది ఆకాశాన్ని తాకేలా పొడవుగా పెరిగిన వెదురు చెట్ల మధ్య నడక టూరిస్టులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
జీవితకాలపు అనుభవం
క్యోటో నగరం సంప్రదాయాలు, గీషా సంస్కృతి స్పెషల్ అట్రాక్షన్. క్యోటోలోని 'గియాన్' జిల్లాలో కనిపించే జపనీస్ కళలు, నృత్యాలు 'గీషా' సంస్కృతికి నిలయం. ఇక్కడి పురాతన చెక్క ఇళ్ళు, వీధులు పర్యటకులను పాతకాలపు జపాన్లోకి తీసుకెళ్తాయి. జపనీస్ సంప్రదాయ తేనీటి విందు, కిమోనో డ్రెస్ స్టయిల్, నిషికి మార్కెట్ లో దొరికే క్యోటో ప్రత్యేక వంటకాలు నగర విశిష్టతను మరింత పెంచుతాయి. జపనీస్ ప్రజలు, ఆ మాటకు వస్తే ప్రపంచ యాత్రికులు తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని కోరుకునే పవిత్రమైన నగరం క్యోటో.