A man lost his life after entering a tiger enclosure at Yorkshire Wildlife Park in Britain. 
అంతర్జాతీయం

ఎన్‌క్లోజర్‌లో దూకిన వ్యక్తిపై పులి దాడి

బ్రిటన్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.

Srinivas Rao

యార్క్‌షైర్: బ్రిటన్‌లోని ప్రముఖ యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో గత ఆదివారం విషాధ ఘటన చోటు చేసుకుంది. భద్రతా వలయాలను దాటి పులి బోనులోకి దూరిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అముర్ జాతికి చెందిన 'అల్టై' అనే పులి జరిపిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. మృతుడి వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించనున్నారు.

 భయానక దృశ్యాలు

ఆదివారం మధ్యాహ్నం 1:35 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. నలుపు రంగు దుస్తులు ధరించిన ఆ వ్యక్తి పులి ఎన్‌క్లోజర్‌ లోనికి ప్రవేశించి, గర్జిస్తున్న పులి వైపు వేలు పెట్టి రెచ్చగొట్టాడు. అకస్మాత్తుగా పులి అతడిపైకి దూకి తీవ్రంగా గాయపరిచింది. అత్యవసర వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడలేకపోయామని వైద్యులు తెలపారు.

 పార్క్‌ మూసివేత

ఈ భయానక ఘటనతో పార్క్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సందర్శకులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి పార్క్‌ను మూసివేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే లోపలికి వెళ్లినట్లు తేలింది. పులి దాడిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

 అల్టై పులి రక్షణకై విజ్ఞప్తులు

మనిషిపై దాడి చేసిన కారణంగా మేనీటర్‌గా మారిన పులిని దయచేసి చంపకూడదని జూ యాజమాన్యానికి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో పార్క్ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. పులి పూర్తి ఆరోగ్యంతో సురక్షితంగా ఉందని, దానిపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.