వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ చేసిన తీవ్ర ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆమె వాంగ్మూలాన్ని మంగళవారం అమెరికా ప్రతినిధుల సభలోని డెమోక్రాట్ల న్యాయవ్యవహారాల కమిటీ విడుదల చేసింది. ఈ వాంగ్మూలం ప్రకారం.. ‘1993 నవంబరులో ట్రంప్ నిర్వహించిన అమెరికన్ డ్రీమ్ అందాల పోటీలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాను. అక్కడ ట్రంప్‌ను కలిశాను. ఆ సమయంలో ఏర్పాటు చేసిన విందులో ఎప్‌స్టీన్ నా దగ్గరకు వచ్చి.. తాను ట్రంప్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడినని పరిచయం చేసుకున్నాడు. తర్వాత ట్రంప్‌తో ఏకాంతంగా మాట్లాడేందుకు ఆయన తరఫున పనిచేసే ఓ వ్యక్తి నన్ను హోటల్‌లోని పై అంతస్తుకు తీసుకెళ్లాడు. అమెరికా వీసా ఇప్పించడంతోపాటు న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అక్కడికి వెళ్లినప్పుడు ట్రంప్ నాపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనలో నా దుస్తులు చిరిగిపోయాయి. శరీరంపై గాయాలై రక్తస్రావమైంది. ఈ విషయం బయటకు చెప్పవద్దని ట్రంప్ నాపై ఒత్తిడి తెచ్చారు. వీసా, విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పిస్తానని మరోసారి హామీ ఇచ్చారు. భయంతోనే అందాల పోటీలో పాల్గొని, అనంతరం స్విట్జర్లాండ్‌కు తిరిగి వెళ్లాను. తర్వాత ట్రంప్ చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాను.’ అని క్యూల్ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఖండించిన వైట్‌హౌస్
ఈ ఆరోపణలను శ్వేతసౌధం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంలో ట్రంప్‌పై ఎలాంటి నేరారోపణలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. డెమోక్రాట్లు ట్రంప్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. కాగా డెమోక్రాట్ల కమిటీ మొత్తం 53 పేజీల నివేదికను విడుదల చేసింది. ట్రంప్‌కు, బాలికలపై లైంగికదాడి కేసులో దోషిగా తేలిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధాలు ఉన్నట్టు ఆరోపించారు. క్యూల్‌తో డెమోక్రాట్లు జరిపిన పలు ఇంటర్వ్యూల వివరాలను నివేదికలో చేర్చారు.
ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు
ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని ఈ నివేదికలో ఆరోపించారు. ‘1990లలో డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ కలిసి పనిచేశారు. యువ మోడళ్లను నియమించే సంస్థలు, అందాల పోటీలు, విందులు కలిసి నిర్వహించేవారు. ఎప్‌స్టీన్‌తో తనకు పెద్దగా సంబంధం లేదని ట్రంప్ చెబుతున్నప్పటికీ అందుబాటులో ఉన్న పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు వారి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు సూచిస్తున్నాయి. 2002లో ఎప్‌స్టీన్‌ను ‘మంచి వ్యక్తి’గా అభివర్ణించిన ట్రంప్, ఆయనతో 15 ఏళ్లుగా పరిచయం ఉందని చెప్పారు. ఎప్‌స్టీన్ కూడా ట్రంప్‌ను పదేళ్లపాటు అత్యంత సన్నిహిత మిత్రుడిగా పేర్కొన్నాడు. 1990లలో ట్రంప్, ఎప్‌స్టీన్ ఒకే విమానంలో కలిసి ప్రయాణించినట్టు రికార్డులు చెబుతున్నాయి. యువతులను అక్రమంగా తరలించి లైంగికదాడి చేసిన ఘటనల్లో ఈ ఇద్దరూ నిందితులు కావొచ్చు.’ అని నివేదిక పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డెమోక్రాట్లు డిమాండ్ చేశారు.