పోర్చుగల్: పోర్చుగల్‌లో ఇళ్ల అద్దెలు, ధరలు పెరగడంతో ప్రజల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రాజధాని లిస్బన్‌తో పాటు పోర్టో నగరాల్లో నిరసనకారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను పోలీసులు అర్ధరాత్రి వేళ తొలగించారు. 200కు పైగా టెంట్లను స్వాధీనం చేసుకోగా.. ఘర్షణల్లో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. సుమారు 55 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల చర్యలపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు ధ్వంసం కావడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
రోడ్లపైనే రాత్రి బస..
పోలీసులు టెంట్లను తొలగించినప్పటికీ.. లిస్బన్‌లోని రోసియో స్క్వేర్ వద్ద నిరసనకారులు రాత్రి బహిరంగంగానే గడిపారు. పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, కొనుగోలు ధరలతో సామాన్యులు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. స్పెయిన్, ఫ్రాన్స్, అల్బేనియా దేశాల్లో జరిగిన నిరసనల స్ఫూర్తితో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. వచ్చే శనివారం లిస్బన్‌లో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.