Riley Moore Claims H-1B Visa Holders Are Replacing American CS Graduates With Cheaper Labour 
అంతర్జాతీయం

అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నరు

భారత్, చైనీస్ హెచ్ 1బీ వీసాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి కామెంట్స్

Boddupalli Naresh

వాషింగ్టన్: అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్‌ ఉద్యోగాలను భారత్‌, చైనాలకు చెందిన విదేశీ నిపుణులు దక్కించుకుంటున్నారని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రైలీ మూర్‌ ఆరోపించారు. తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా యువతకు ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ది స్కాట్‌ జెన్నింగ్స్‌ షో’లో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్‌ను శనివారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

హెచ్ 1 బీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కార్యక్రమాలను ఆయన ‘మోసపూరితం‘గా అభివర్ణించారు. ‘కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్ సంబంధిత కోర్సుల్లో 6.50లక్షల మంది అమెరికన్ యువత గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే సుమారు 5లక్షలకు పైగా హెచ్ 1 బీ వీసాలు జారీ అయ్యాయి. ఈ వీసాల్లో ఎక్కువగా భారత్, చైనాలకే దక్కాయి’ అని ఆరోపించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులను అమెరికాకు తీసుకురావడమే హెచ్ 1 బీ ముఖ్యోద్దేశం. కానీ వాస్తవంగా తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులను తీసుకుస్తున్నారు. దీంతో కంప్యూటర్ సైన్స్, అకౌంటింగ్ తదితర రంగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన అమెరికా యువత అవకాశాలు దెబ్బతింటున్నాయి’ అని మూర్ కామెంట్ చేశారు. దీంతోపాటు హెచ్ 1 బీ వీసాదారులు తమ కుటుంబసభ్యులను కూడా అమెరికా తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీనిని ‘చైన్ మైగ్రేషన్’తో పోల్చారు. కాగా అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌-1బీ వీసా లబ్ధిదారుల్లో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీసా విధానంపై అమెరికాలో జరుగుతున్న చర్చలు భారతీయ నిపుణుల్లోనూ ఆసక్తి నెలకొంది.

 హెచ్‌-1బీ వీసాల పొడిగింపునకు కొత్త ప్రతిపాదనలు

హెచ్‌-1బీ, ఎల్‌-1 వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాల పొడిగింపు దరఖాస్తుల పరిశీలనను కఠినతరం చేసేలా అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఇది అమల్లోకి వస్తే, గతంలో ఆమోదించిన దరఖాస్తులోని పరిస్థితులు మారనప్పటికీ, వీసాదారుల అర్హతలను మరోసారి పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, ఒకే సంస్థ, ఉద్యోగి, ప్రాథమిక వాస్తవాలతో వీసా పొడిగింపు కోరినప్పుడు, గతంలో ఇచ్చిన ఆమోదానికి ప్రాధాన్యమివ్వాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను డీహెచ్‌ఎస్‌ కోరుతోంది.