Slow Jogging Trend Wikimedia Commons
అంతర్జాతీయం

స్లో జాగింగే సో బెటరు!

జపాన్, దక్షిణ కొరియాలో సరికొత్త ట్రెండ్

Surya

‘వాకింగ్ బెటరా? రన్నింగ్ బెటరా?’.. వ్యాయామం చేసేవాళ్లకు తరచూ వచ్చే కామన్ డౌట్ ఇది. అయితే, వీటికంటే ‘స్లో జాగింగ్ బెటర్’ అంటున్నారు జపాన్, దక్షిణ కొరియా ప్రజలు. అనడమే కాదు ఫాలో అవుతున్నారు కూడా. అందుకే ఇప్పుడిది సోషల్ మీడియాలో సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్ గానూ మారిందక్కడ. అంతేకాదు, మెల్లమెల్లగా ప్రపంచం మొత్తం పాకుతోంది.

ఇంతకీ ఏమిటీ స్లో జాగింగ్? దీని ప్రయోజనాలేంటి? ఎక్స్ పర్ట్స్ ఏమంటున్నారు?

నికో నికో..

ఇటు వాకింగ్‌కు అటు రన్నింగ్‌కు మధ్యస్థంగా ఉండేదే స్లో జాగింగ్. అంటే.. నడకలో కాస్త వేగం పెంచడం, పరుగులో కాస్త వేగం తగ్గించడం అన్నమాట. అచ్చ తెలుగులో చెప్పాలంటే ‘పరుగులాంటి నడక’. ఈ స్లో జాగింగ్ మొదట జపాన్‌లో ప్రారంభమైంది. దీన్నిఅక్కడ ‘నికో నికో రన్నింగ్’ అంటారు. జపనీస్‌లో ‘నికో’ అంటే చిరునవ్వు. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా, మాట్లాడుకుంటూ లేదా పాడుకుంటూ చిరునవ్వుతో ఈ జాగింగ్ చేయొచ్చని చెబుతూ జపనీస్ ఫిజియాలజిస్ట్ డాక్టర్ హిరోకీ తనక ఈ విధానం కనిపెట్టాడు.    

బెనిఫిట్స్ బోలెడు..   

స్లో జాగింగ్.. జోన్ 2 కేటగిరీకి చెందిన వ్యాయామం. దీంతో బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు డాక్టర్లు, ఫిట్నెస్ నిపుణులు. అవేంటంటే..

1. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుంది. అంతేకాదు! ఇది హృదయ స్పందన వేగాన్నిస్వల్పంగా పెంచే మితమైన తీవ్రత కలిగిన ఎక్సర్ సైజ్ కాబట్టి, దీని వల్ల గుండెపై ఎక్కువ భారం పడదు.

2. కొవ్వును కరిగించడంలో సాయపడుతుంది. దీనికోసం కార్బోహైడ్రేట్లు లేదా ప్రొటీన్‌ను ఉపయోగించే అవసరం లేకుండా శరీరానికి తోడ్పడుతుంది. షుగర్ అదుపులో ఉండేలా చేస్తుంది.     

3. భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఆలోచన సామర్థ్యం పెంచుతుంది. ఇటీవల ఇమేజింగ్ న్యూరోసైన్స్‌లో పబ్లిష్ అయిన ఓ ఆర్టికల్ ఇదే విషయం స్పష్టం చేస్తోంది. 

4. అలసటను దరి చేరనివ్వదు. ఓర్పును పెంచుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. పరుగును మెరుగుపరుస్తుంది. పరుగు వల్ల వచ్చే ప్రభావానికి కీళ్లు, ఎముకలు, లిగమెంట్స్, టెండన్స్ అలవాటు పడేలా చేస్తుంది. దీని వల్ల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే వ్యాయామాలూ చేసే వీలుంటుంది.

పద్ధతులు ముఖ్యం.. : 

‘కాస్త వేగంగా నడిస్తే చాలు, లేదా పరుగు వేగాన్నికొంచెం తగ్గిస్తే చాలు అదే స్లో జాగింగ్ అవుతుంది’ అనుకుంటున్నారా? నిజమే. కాకపోతే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు కదా. అందువల్ల స్లో జాగింగ్ చేయడానికీ కొన్ని పద్ధతులు చెబుతున్నారు నిపుణులు.

1. వాకింగ్‌కు, రన్నింగ్‌కు మధ్య మధ్యలో కాసేపు స్లో జాగింగ్ ప్రయత్నించాలి. అలాగే దూరం క్రమక్రమంగా పెంచుకోవాలి.

2. మాట్లాడుతూ స్లో జాగింగ్ చేయగలగాలి. దీని వల్ల శ్వాస మీద నియంత్రణ వస్తుంది. మొదట చిన్న చిన్నపదాలతో సంభాషణలు మొదట పెట్టాలి. ఆ తర్వాత వేగం పెంచాలి. ఇది జ్ఞాపక శక్తికీ, బ్రీత్‌ కంట్రోల్‌కూ ఉపయోగపడుతుంది.

3. స్లో జాగింగ్‌ను ఇంతే వేగంతో చేయాలనే రూలేమీ లేదు. ఎవరికి తగినట్లు వాళ్లు తమకు కంఫర్టబుల్‌గా అనిపించే స్పీడుతో చేయొచ్చు. అలాగే స్లో జాగింగ్‌ను ఒకే వేగంతో చేయాలనే నియమమూ లేదు.

4.శరీరం ఎలా స్పందిస్తోందో గమనించుకోవాలి. ముఖ్యంగా కండరాలు, కీళ్లు ఇబ్బంది పడుతున్నట్లయితే, నొప్పి కలుగుతున్నట్లయితే బ్రేక్ తీసుకోవచ్చు.

‘శరీరాన్నిఅధికంగా శ్రమకు గురిచేసే వ్యాయామం (HIIT-High intensity interval training) మంచి ఫలితాలను ఇస్తుందనే ఆలోచన ప్రజల్లో ఉంది. ఉదాహరణకు వేగంగా పరిగెత్తడం, లేదా వర్కవుట్‌ను తొందరగా పూర్తి చేయడం వంటివి. ఇది తప్పు. క్రమపద్ధతిలో శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా, నిదానంగా చేసే వ్యాయామమైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. దీనికి స్లో జాగింగ్ మంచి ఉదాహరణ‘ అంటున్నారు అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న ఏపీటీ క్లినిక్ థెరపీ వైస్ ప్రెసిడెంట్, ఫిజికల్ థెరపిస్ట్ థామస్ డెనింగర్.

బాటమ్ లైన్ :

నిజానికి మనదేశంలో రన్నింగ్ చేస్తూ మాట్లాడుకోవడం తక్కువేమో కానీ, వాకింగ్‌లో మాత్రం పొరుగింటి పుల్లగూర నుంచి కొంపలు ముంచే ట్రంప్ చేష్టల వరకు అన్నీమాట్లాడుకోగలరు. ఇక ‘స్లో జాగింగ్‘లోనూ ఈ ఫెసిలిటీ ఉంటే ఆగుతారా! పైగా ఆరోగ్య ప్రయోజనాలు అదనం!!. అందుకే మనమూ ‘స్లో జాగింగే సో బెటరూ..‘ అనేద్దాం. రంగంలోకి దూకేద్దాం.