కీవ్: ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికా.. సాంకేతిక సేవలను కూడా తన ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నదా? యుద్ధంలో తమకు అవసరమైనప్పుడు ఒక దేశానికి సాయం చేసి, ప్రయోజనాలు మారినప్పుడు అదే సాయంపై పరిమితులు విధిస్తున్నదా? ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలపై ఇటీవల పరిమితులు విధించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు కీలకంగా మారాయి. కాగా ఇటీవల వాటి వినియోగంపై వచ్చిన ఆంక్షలు డ్రోన్ దాడులు, గగనతల రక్షణ కార్యకలాపాలకు ఆటంకం కలిగించాయని ఆ దేశ అధికారులు ఆరోపించారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 9న రష్యా నుంచి డీజిల్ సరఫరాలపై ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే స్టార్ లింక్ సేవలపై పరిమితులు విధించడం గమనార్హం.
యుద్ధం మొదలైన నాటి నుంచి
2022 ఫిబ్రవరి 24న రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడిని ప్రారంభించింది. యుద్ధం మొదలైన కొద్ది రోజులకే ఉక్రెయిన్ ప్రభుత్వం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ను సంప్రదించింది. ఫిబ్రవరి 26న మస్క్ ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. సైనిక విభాగాల మధ్య సమాచార మార్పిడి, దళాల సమన్వయం, డ్రోన్ల నియంత్రణ వంటి అవసరాలకు ఈ సేవలను ఉక్రెయిన్ ఉపయోగించుకున్నది. 2023 జూన్1న అమెరికా రక్షణశాఖ ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌తో అధికారిక ఒప్పందం కుదుర్చుకున్నది. కాగా ఇటీవల ఉక్రెయిన్ కు పరిమితులు విధించింది స్టార్ లింక్ కాదని.. స్టార్ షీల్డ్ అని ఎలన్ మస్క్ పేర్కొన్నారు.
‘స్టార్‌లింక్ వాణిజ్య సేవలను స్పేస్‌ఎక్స్ నిర్వహిస్తుంది. స్టార్‌షీల్డ్ అమెరికా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వాటి వేగం, వినియోగంపై పరిమితులను అమెరికా సైన్యం నిర్ణయిస్తుంది. అమెరికా అధ్యక్షుడిదే నిర్ణయాధికారం. ఇటీవల ఉక్రెయిన్‌కు పరిమితి విధించింది స్టార్ షీల్డ్ సేవల్లోనే’ అని మస్క్ వివరణ ఇచ్చారు.
స్టార్‌లింక్, స్టార్‌షీల్డ్.. తేడా ఏమిటి?
స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందించే వాణిజ్య సేవ. భూమిపై ఉన్న టెర్మినల్ అనే పరికరం ఉపగ్రహంతో అనుసంధానమై సమాచారాన్ని పంపుతుంది, స్వీకరిస్తుంది. స్టార్‌షీల్డ్ మాత్రం అమెరికా ప్రభుత్వ సైనిక, నిఘా అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వ్యవస్థ. ఇందులో సురక్షిత సమాచార మార్పిడి, సైనిక అవసరాలకు అనువైన ఉపగ్రహ సామర్థ్యాలు ఉంటాయి. ఈ రెండు సేవలు వేర్వేరు అయినప్పటికీ, వాటి వెనుక ఉన్న ఉపగ్రహ సాంకేతికతలో భాగస్వామ్యం ఉందని నిపుణులు అంటున్నారు.
ఒక దేశం తన సైనిక కార్యకలాపాల కోసం విదేశీ సంస్థ అందించే సాంకేతిక సేవలపై ఆధారపడితే, ఆ సేవలను నియంత్రించే సంస్థ లేదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దాని యుద్ధ సామర్థ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయుధాలు చేతిలో ఉన్నా వాటిని సమర్థంగా ఉపయోగించేందుకు అవసరమైన సమాచార వ్యవస్థపై నియంత్రణ లేకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
ఉక్రెయిన్ ఆరోపణ ఏమిటి?
అక్టోబర్ 13, 14 తేదీల్లో తమ దేశంలో గంటకు 160 కిలోమీటర్లకు మించి వేగంతో కదిలే కొన్ని స్టార్‌లింక్ టెర్మినళ్ల కనెక్టివిటీపై పరిమితులు విధించారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. తమ సైన్యానికి ముందస్తు హెచ్చరిక ఇవ్వకపోవడంతో కొన్ని డ్రోన్ మిషన్లకు అంతరాయం కలిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు సెర్హీ బెస్క్రెస్నోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్.. రష్యా దళాలపై దాడులు చేయడానికి, రష్యా ప్రయోగించే డ్రోన్లను అడ్డుకోవడానికి వివిధ రకాల డ్రోన్లను ప్రయోగిస్తున్నది. వాటిలో కొన్ని వేగంగా ప్రయాణించే పరికరాలకు నిరంతర సమాచార అనుసంధానం అవసరం. కనెక్టివిటీ తెగిపోతే వాటిని నియంత్రించడం, లక్ష్యాల దిశగా నడిపించడం కష్టమవుతుంది.
భారత్‌లో స్టార్‌లింక్ సేవలపై అనుమానాలు
ఇటీవల భారత్ కు స్టార్ లింక్ సేవలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పరిణామం నేపథ్యంలో భారత్‌లోనూ స్టార్ లింక్ సేవలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్‌లింక్ సేవలను దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తే.. అమెరికా తన ప్రయోజనాల కోసం వాటిపై పరిమితులు విధిస్తే పరిస్థితి ఏమిటి? అన్న చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి భారత్‌లో స్టార్‌లింక్ వాణిజ్య సేవలు ప్రారంభం కాలేదు. ఉద్దేశపూర్వకంగా తమకు అనుమతులు ఇవ్వడం లేదని మస్క్ ఆరోపిస్తున్నారు. భారత్‌లో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందించాలనుకునే సంస్థలు దేశీయ చట్టాలు, భద్రతా నిబంధనలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.