ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వందేళ్లుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అమెరికా సంస్థ టొరానీ 
అంతర్జాతీయం

101 ఏళ్లలో ఒక్క ఉద్యోగినీ తొలగించని కంపెనీ!

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు లేఆఫ్స్‌ కొనసాగుతున్న వేళ.. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఓ సంస్థ మాత్రం ఒక్క ఉద్యోగినీ తొలగించకుండా విజయవంతంగా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.

Phaneendra

ఇటలీ నుంచి అమెరికాకు.. సిరప్‌ల వ్యాపారంలోకి!

రినాల్డో, ఎజిల్డా దంపతులు ఇటలీలోని 'లుక్కా' (Lucca) ప్రాంతం నుంచి  అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు వలస వచ్చి 1925లో టొరానీ సంస్థను స్థాపించారు. ఇటలీ నుంచి తమతో పాటు తెచ్చుకున్న కుటుంబ సంప్రదాయ వంటకాల ఆధారంగా చేతితో రకరకాల ఫ్లేవర్డ్‌ సిరప్‌లను తయారు చేయడం ప్రారంభించారు. తర్వాత తమ సిరప్‌లను సోడా వాటర్‌తో కలిపి స్థానిక కేఫ్‌లలో ‘ఇటాలియన్ సోడా’గా విక్రయించడం ద్వారా ప్రాచుర్యం పొందారు. నేడు టొరానీ కాఫీ, లాటే, సోడా వంటి ఇతర పానీయాల్లో ఉపయోగించే వివిధ రకాల సిరప్‌లను ఉత్పత్తి చేస్తోంది.

 కరోనా సంక్షోభంలోనూ  కోత లేదు!

2020లో వ్యాపార విస్తరణలో భాగంగా కాలిఫోర్నియాలో నూతన తయారీ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీగా రుణాలు తీసుకుంది. అదే సమయంలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. కాఫీ షాపులు, రెస్టారెంట్లు మూతపడటంతో ఆ ఏడాది ఏప్రిల్‌లో టొరానీ ఆదాయం 20 శాతం తగ్గింది. అయినప్పటికీ ఉద్యోగులను తొలగించాలని యాజమాన్యం భావించలేదు. దానికి బదులుగా ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టింది. మార్కెటింగ్‌, ప్రకటనల బడ్జెట్లను తగ్గించింది. వ్యాపార పర్యటనలను రద్దు చేసింది. కాఫీ షాపులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఆన్‌లైన్‌ విక్రయాలు, కిరాణా దుకాణాల ద్వారా అమ్మకాలను పెంచే ప్రయత్నం చేసింది. దీంతో మే నెల నుంచే వ్యాపారం కోలుకోవడం ప్రారంభమైంది. 2020లో సంస్థ వార్షిక ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగింది.ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌ సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా సంస్థను వీడే అవకాశం కల్పిస్తూ ఎగ్జిట్‌ ఆఫర్‌ ప్రకటించింది.  దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు లేఆఫ్స్ పరంపర నిరాటంకంగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వందేళ్ల చరిత్ర ఉన్న ఒక సంస్థ ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే ఒక్క ఉద్యోగిని లేఆఫ్ చేయకుండానే విజయవంతంగా వ్యాపారాన్ని కొనసాగిస్తుందంటే ఆతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ  ఇది 100 శాతం నిజం. ఆ సంస్థే అమెరికాకు చెందిన టొరానీ (Torani). తన 101 ఏళ్ల చరిత్రలో ఒక్క ఉద్యోగినీ లేఆఫ్‌ చేయకపోడం టొరానీ విశిష్టత. ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా ఉద్యోగులను తొలగించకుండా వ్యాపారాన్ని ఎలా నడిపించవచ్చో చూపిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా వంటి అత్యంత వ్యయభరిత ప్రాంతంలోనూ టొరానీ 94.8 శాతం ఎంప్లాయీ రిటెన్షన్ రేటును కొనసాగిస్తోంది.

ఉద్యోగుల ఇళ్లను బట్టి ఫ్యాక్టరీ మార్పు!

ఉద్యోగుల పట్ల తన నిబద్ధతను టొరానీ మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించింది. 2020లో శాన్‌ లియాండ్రోకు తయారీ కేంద్రాన్ని తరలించే సమయంలో ఉద్యోగుల నివాస ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంది. వారి ఇళ్ల జిప్‌కోడ్‌లను మ్యాప్ చేసింది. దీని ఆధారంగా ఉద్యోగులురోజూ విధులకు వచ్చి వెళ్లేందుకు సౌకర్యంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. అంతేకాదు.. అదే ఏడాది మరో 40 మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది.

ఏఐతో పనితీరు పెంపు.. ఉద్యోగులకు భరోసా!

ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేళ.. టొరానీ మాత్రం సాంకేతికతను పనితీరు మెరుగుపర్చుకునేందుకు ఉపయోగిస్తోంది. మార్కెట్‌ పరిశోధన, అమ్మకాల అంచనాలు వంటి విభాగాల్లో ఏఐ సాయాన్ని తీసుకుంటోంది. ఉద్యోగుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టడం కంటే.. వారి పనిని సులభతరం చేయడం, సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తోంది.

 ఉద్యోగులే సంస్థకు అసలైన బలం!

గత 35 ఏళ్లుగా ఏటా సగటున 20 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తూ దూసుకుపోతున్న టొరానీ.. 2026లో 800 మిలియన్‌ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాగుతోంది. కంపెనీ లాభాల్లో  ఏటా ఉద్యోగులందరికీ వాటా ఇస్తోంది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఎదురైన ప్రతిసారీ ఉద్యోగులను తొలగించకుండానే వ్యాపారాన్ని విస్తరించవచ్చని, సంస్థ విజయానికి సిబ్బందే అసలైన బలమని చాటుతోంది.

టొరానీ ఒక్కటే కాదు..మరికొన్ని!

ఉద్యోగుల తొలగింపులే ఖర్చుల తగ్గింపునకు మార్గం అనుకుంటున్న కంపెనీలకు భిన్నంగా ఆలోచించే సంస్థలూ ఉన్నాయి. అమెరికాకు చెందిన ఉక్కు తయారీ సంస్థ న్యూకోర్‌ (Nucor) పనిభారం తగ్గినప్పుడు ఉద్యోగులను తొలగించకుండా పని వారాన్ని కుదించే విధానానికి ప్రాధాన్యం ఇస్తోంది. పని లేకపోవడాన్ని కారణంగా చూపి ఉద్యోగులను తొలగించకూడదన్నది ఈ సంస్థ దీర్ఘకాలిక విధానం.

అమెరికాకు చెందిన కుటుంబ యాజమాన్య సంస్థ ది గండ్‌ కంపెనీ (The Gund Company). 1951లో ప్రారంభమైన ఈ పారిశ్రామిక తయారీ సంస్థ తన 75 ఏళ్ల చరిత్రలో ఉద్యోగులను లేఆఫ్‌ చేయలేదు. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, సంస్థ ఆర్థిక పరిస్థితులపై పారదర్శకత, లాభాల్లో భాగస్వామ్యం వంటి విధానాలకు ఇది ప్రాధాన్యం ఇస్తోంది.