అబుధాబి (యూఏఈ): ఐఫోన్ కొనాలంటే వేలల్లో కాదు.. లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి రావొచ్చు. లేదంటే నెలల తరబడి ఈఎంఐలు చెల్లించాలి. అలాంటిది ఖరీదైన ఐఫోన్లే సముద్రంలో తేలుతూ కనిపిస్తే? ఇప్పుడు ఇదే ఆసక్తికర ఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఖరీదైన వేలాది ఐఫోన్లు, పర్ఫ్యూమ్ బాటిళ్లు సముద్రంలో కుప్పలుతెప్పలుగా తేలాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా ? అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధానికి కేంద్ర బిందువుగా మారిన హర్మూజ్ జలసంధిలో!
సింగపూర్ దేశానికి చెందిన జీఎఫ్ఎస్ ప్రైడ్ కార్గో నౌక హర్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మందుపాతర తాకడంతో అగ్నిప్రమాదానికి గురై బుధవారం (అక్టోబరు 14న) మునిగిపోయింది. దుబాయ్ నుంచి దాదాపు 2,500 కంటైనర్లలో ఐఫోన్లు, పర్ఫ్యూమ్ బాటిళ్లు సహా వివిధ విలాసవంతమైన వస్తువులను తీసుకెళ్తుండగా ఈ నౌక ప్రమాదానికి గురైంది. దీంతో ఇందులోని ఐఫోన్ బాక్సులు, పర్ఫ్యూమ్ సీసాలు హర్మూజ్‌లోని సముద్ర జలాలపై కుప్పలుతెప్పలుగా తేలాయి. స్థానికంగా చిన్న పడవలు నడిపేవారు, మత్స్యకారులు వీటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. ఇక జీఎఫ్ఎస్ ప్రైడ్ షిప్‌లోని 21 మంది సిబ్బందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి.
ఈ నౌక సింగపూర్ రిజిస్ట్రేషన్‌ను కలిగి ఉన్నప్పటికీ, దీన్ని నిర్వహించే జీఎఫ్ఎస్ సంస్థ యూఏఈ కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులోని సరుకు పలువురు దుబాయ్ ఎగుమతిదారులకు, అంతర్జాతీయ కొనుగోలుదారులకు చెందినదై ఉండొచ్చని భావిస్తున్నారు.
అది నిషేధిత మార్గం : ఇరాన్
హర్మూజ్ జలసంధిలో తాము నిషేధించిన మార్గంలో ప్రయాణించినందు వల్లే ఆ నౌక మందుపాతర బారినపడిందని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. ఏదో ఒక క్షిపణి లేదా డ్రోన్ వంటిది తాకినందు వల్లే ప్రమాదానికి గురై ఉండొచ్చని సింగపూర్ మారిటైమ్ అథారిటీ అంచనా వేసింది. బ్రిటీష్ నావికాదళానికి అనుబంధంగా పని చేసే అంతర్జాతీయ నౌకాయాన పర్యవేక్షణ సంస్థ యూకేఎంటీఓ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.