అంతర్జాతీయం

ట్రంప్​ యూటర్న్..  డీజిల్​ కోసం రష్యాతో డీల్

48 లక్షల టన్నుల ఇంధనం కొనుగోలుకు ఒప్పందం అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపించిన వేళ కీలక పరిణామం దేశంలో ఇంధన ధరలు తగ్గించేందుకే: ట్రంప్​ అమెరికా నిర్ణయంపై మండిపడ్డ ఉక్రెయిన్

Haji Pasha

వాషింగ్టన్​ (అమెరికా): రష్యా నుంచి చమురు కొనే దేశాలపై భారీ సుంకాలు బాదుతానని తీవ్ర హెచ్చరికలు చేస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. బద్ధ విరోధి అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో డీజిల్ కొనుగోళ్లకు శుక్రవారం (అక్టోబరు 9న) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులపై విధించిన ఆంక్షలను 2027 ఏప్రిల్ వరకు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పుతిన్​తో ఫోన్​లో చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ దాకా డీజిల్​ను సరఫరా చేసేందుకు రష్యాకు అమెరికా ఆర్థికశాఖ అక్టోబరు 9నే హుటాహుటిన తాత్కాలిక లైసెన్సును జారీ చేయడం గమనార్హం.

ట్రంప్​ యూటర్న్​కు తక్షణ కారణమిదీ

అమెరికాలో గ్యాసోలిన్​, డీజిల్​ ధరలు రాకెట్​ వేగంతో పెరుగుతున్నాయి. నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుండటంతో ట్రంప్ ప్రస్తుతానికి వైఖరిని మార్చుకున్నారు. రష్యా ఇంధన వనరుల సప్లయ్​లను అడ్డుకోవాలనే ఏకపక్ష వైఖరిని ఆయన వీడారు. ప్రజా వ్యతిరేకత పెరుగుతూపోతే రాబోయే మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్​ పార్టీ అమెరికన్​ కాంగ్రెస్​పై పట్టును కోల్పోయే ముప్పు ఉంది. ఎలాగైనా అమెరికన్​ కాంగ్రెస్​పై పట్టును నిలుపుకునేందుకు, ఓటర్లలో ఏర్పడిన ప్రతికూల భావనను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరుగుతూపోతున్న గ్యాసోలిన్​, డీజిల్​ ధరలకు సత్వరం కళ్లెం వేసి ప్రజలను శాంతింప చేసేందుకే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.

రష్యా నుంచి తక్షణమే డీజిల్​ సరఫరా

‘‘శుక్రవారం రోజు నేను ఫోన్​ కాల్​లో పుతిన్​తో మాట్లాడాను. 3 లక్షల టన్నులకుపైగా డీజిల్​ను అమెరికాకు, అంతర్జాతీయ మార్కెట్​కు రష్యా తక్షణమే సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నవంబరులో మరో 5 లక్షల టన్నుల డీజిల్​ను రష్యా సరఫరా చేస్తుంది. ఆ తర్వాత వెంటనే అదనంగా ఇంకో 10 లక్షల టన్నుల డీజిల్​ను అందిస్తుంది. తదుపరిగా రష్యాలోని ​ రిఫైనరీల పరిస్థితులను బట్టి తక్కువ వ్యవధిలోనే మరో 30 లక్షల టన్నుల వరకు డీజిల్​ను అమెరికాకు సరఫరా చేసే అవకాశం ఉంది. అమెరికన్లకు చౌకగా డీజిల్​ను అందించాలనేది నా లక్ష్యం. దేశంలోని రైతులు, డ్రైవర్లు, సామాన్యులకే నేను తొలి ప్రాధాన్యత ఇస్తాను” అని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ట్రంప్​ పోస్టు చేశారు.

రష్యా సానుకూలం.. ఉక్రెయిన్​ మండిపాటు

ట్రంప్​ నిర్ణయంపై రష్యా సైతం సానుకూల ప్రకటన విడుదల చేసింది. ‘‘అమెరికా సహా ప్రపంచ మార్కెట్లకు చమురు, చమురు ఉత్పత్తులను సరఫరా చేసేందుకు మేం సిద్ధం” అని రష్యా సర్కారు వెల్లడించింది. ఇక ట్రంప్​ నిర్ణయాన్ని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ తప్పుపట్టారు. ‘‘ఇది బలహీనమైన నిర్ణయం. దీన్ని నిజాయితీతో తీసుకోలేదు. దీని వల్ల అమెరికా, ఉక్రెయిన్​ భాగస్వామ్య సంబంధాలకు ట్రంప్​ విలువ లేకుండా చేశారు” అని విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

భారత్​కో న్యాయం.. అమెరికాకో న్యాయమా ?

తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా మొండి వైఖరితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు.​ తనకో న్యాయం, ఇతరులకో న్యాయం అన్నట్టుగా ఏకపక్షంగా ప్రపంచ దేశాలపై సుంకాలను బాదుతున్నారు. రష్యా నుంచి చమురును కొంటున్నందుకుగానూ భారత్​పై అదనపు సుంకాలను విధిస్తూ 2025 ఆగస్టు 6న ట్రంప్ ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. భారత్ నుంచి అమెరికా మార్కెట్​లోకి వచ్చే దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాన్ని విధించారు. రష్యా నుంచి చమురును కొంటే, ఉక్రెయిన్​పై యుద్ధం చేసేందుకు రష్యాకు నిధులిచ్చినట్లు అవుతుందని ఆనాడు అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్​ వాదించారు. ఇప్పుడేమో తానే రష్యా డీజిల్​ కోసం పాకులాడుతుండటం గమనార్హం. అవసరం అనేది ఎంతటి వాళ్లలోనైనా మార్పును తీసుకొస్తుంది అనేందుకు ఈ పరిణామమే నిలువెత్తు నిదర్శనం.