వాషింగ్టన్: దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశం అందిన 96 గంటల్లోగా ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టేందుకు అమెరికా సైన్యం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈసారి ఇరాన్ ఇంధన మౌలిక వసతులు, సైనిక స్థావరాలు, అణు కర్మాగారాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ‘‘దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపిన వెంటనే ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలయ్యే అవకాశం ఉంది” అని ఇద్దరు అధికారులు చెప్పారంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే దాడులను తిరిగి ప్రారంభించే అంశంపై ఇప్పటివరకు ట్రంప్ ఒక నిర్ణయానికి రాలేదని పేర్కొంది.
ఇరాన్ ప్రతిదాడుల పరిధి పెరగొచ్చు
అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబరు 3న జరగనున్నాయి. వీటి తుది ఫలితాలు డిసెంబరు రెండోవారంకల్లా వస్తాయి. ఈ రిజల్ట్స్ వచ్చే వరకు ట్రంప్ వేచి చూసే అవకాశం ఉందని అమెరికా సైనిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. గతంలోనూ దాడులకు రెడీ అన్న ట్రంప్, చివరి నిమిషంలో నిర్ణయాలను మార్చుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈసారి అమెరికా– ఇజ్రాయెల్ దాడులు చేస్తే, ఇరాన్, యెమన్ హూతీల ప్రతిదాడుల పరిధి పశ్చిమాసియా అవతలి దాకా విస్తరించే అవకాశం ఉంటుందని అమెరికా నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
నెతన్యాహు ప్రతిపాదనకు ట్రంప్ నో
అమెరికా, ఇజ్రాయెల్‌లలో ఎన్నికలకు ముందే ఇరాన్‌పై ఉమ్మడి దాడులు చేయాలని ఇటీవలే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదించగా, ట్రంప్ నో చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇరాన్‌పై ఇప్పుడే దాడులు చేస్తే, తమ దేశ ఎన్నికలను వాయిదా వేయాల్సి వస్తుందని ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ ఇయల్ జమీర్ ట్రంప్‌ను హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈ కారణం వల్లే నెతన్యాహు ప్రతిపాదనకు ట్రంప్ పచ్చజెండా ఊపలేదని, ఎన్నికల తర్వాతే ఉమ్మడి దాడులు చేద్దామని తేల్చి చెప్పారని పేర్కొన్నారు.
అరబ్ దేశాల్లో అలర్ట్
అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిశాక ఇరాన్‌పై దాడులను మొదలుపెట్టే అవకాశం ఉందని అరబ్ దేశాలకు అమెరికా సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉన్నందున, పలు అరబ్ దేశాల్లోని బలహీనమైన సైనిక స్థావరాల నుంచి అమెరికా సైనికులను, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు సమాచారం.