US Labor Department Suspends PERM For 8 Tech Giant Companies 
అంతర్జాతీయం

టెక్ కంపెనీలకు ట్రంప్ షాక్

Srikanth
  • గ్రీన్‌కార్డు దరఖాస్తులపై తాజా ఆంక్షలు

  • పర్మ్ సస్పెన్షన్.. టెక్ ఉద్యోగుల్లో ఆందోళన

  • భారత ఐటీ కంపెనీలకు వైట్‌హౌస్ హెచ్చరిక

  • మరింత కఠినతరంగా వీసా నిబంధనలు

ప్రభాత ఉదయం : అమెరికా గడ్డపై స్థిరపడాలని కలలు కనే వేల మంది విదేశీ ఉద్యోగులకు ట్రంప్ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాదారుల ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు ప్రక్రియలో అత్యంత కీలకమైన ‘పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్’ (పీఈఆర్ఎం) నుంచి ఎనిమిది దిగ్గజ టెక్ కంపెనీలను అమెరికా కార్మిక శాఖ సస్పెండ్ చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌ జెమినీలతో పాటు అమెరికన్ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, అడోబీ కంపెనీలు ఈ సస్పెన్షన్‌కు గురయ్యాయి. హెచ్‌-1బీ వీసాలు, విదేశీ ఉద్యోగుల ఉపాధి నిబంధనలను ఈ కంపెనీలు దుర్వినియోగం చేస్తూ అమెరికన్ల ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయని కార్మిక శాఖ ఆరోపించింది.

పర్మ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాం: సాండర్లింగ్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కార్మిక శాఖ మంత్రి కీథ్‌ సాండర్లింగ్‌ శ్వేతసౌధంలో సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు స్పష్టం చేశారు. ‘‘ఈ ఎనిమిది కంపెనీల నుంచి ఇకపై కొత్తగా ఎలాంటి పర్మ్ దరఖాస్తులను స్వీకరించం. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సైతం ప్రాసెస్ పర్మ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. 2009 నుంచి కేవలం ఈ ఎనిమిది కంపెనీలే సుమారు 30 లక్షల మంది విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తులు చేశాయి. రెండు లక్షల ముప్పై వేలకు పైగా హెచ్-1బీ వీసాలు, లక్షకు పైగా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్లను దక్కించుకున్నాయి’’ అని సాండర్లింగ్ వెల్లడించారు.

మైక్రోసాఫ్ట్ తీరుపై వాన్స్ ఫైర్

మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవహారశైలిపై జేడీ వాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతేడాది ఆరు వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిన కంపెనీ అదే సమయంలో 6,300 హెచ్-1బీ వీసాలను, మూడు వేల గ్రీన్‌కార్డులను పొందిందని వివరించారు. ‘‘అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఒప్పంద ఉద్యోగులను తక్కువ వేతనాలకు నియమించుకునే వీసా మిల్లులలా ఈ కంపెనీలు మారాయి. పత్రికల్లో నామమాత్రపు ప్రకటనలు ఇచ్చి స్థానిక అర్హులు ఎవరూ లేరని నమ్మిస్తూ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి’’ అని వాన్స్ ఆరోపించారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా యేల్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి తొమ్మిది ప్రముఖ విశ్వవిద్యాలయాలు జే-1 వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్న తీరుపై కూడా ప్రత్యేక దర్యాప్తునకు ఆయన ఆదేశించారు.

పర్మ్ అంటే?

ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ‘పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్’ (పీఈఆర్ఎం) ప్రాముఖ్యతే. విదేశీ ఉద్యోగికి శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డు దరఖాస్తు చేయాలంటే కంపెనీలు కచ్చితంగా ఈ లేబర్ సర్టిఫికేషన్‌ను పొందాలి. తమ కంపెనీ కోరుకునే ఉద్యోగం కోసం తగిన అర్హతలు గల అమెరికన్ పౌరులు ఎవరూ అందుబాటులో లేరని, విదేశీయులను తీసుకోవడం వల్ల స్థానిక వేతనాల మీద ఎలాంటి దుష్ప్రభావం పడదని కార్మిక శాఖకు నిరూపించాల్సి ఉంటుంది. ఈ ప్రాథమిక దశ పూర్తయితేనే తదుపరి ఐ-140 పిటిషన్ల ద్వారా గ్రీన్‌కార్డు ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఈ మార్గం మూసుకుపోవడంతో విదేశీ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

హెచ్-1 బీ వీసాలు రద్దు అవుతాయా?

ప్రస్తుతానికి ఈ సస్పెన్షన్ కారణంగా ఉద్యోగుల చేతిలో ఉన్న హెచ్-1బీ వీసాలు రద్దు కావు. ఈ వీసా ఉన్నంత వరకు ఉద్యోగులు అమెరికాలో పనిచేయవచ్చు. అయితే కంపెనీలు కొత్తగా పర్మ్ దరఖాస్తులు చేయలేకపోవడం వల్ల ఆరేళ్ల నిబంధనను సమీపిస్తున్న హెచ్-1బీ విదేశీ ఉద్యోగులకు ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఈబీ-2, ఈబీ-3 కేటగిరీలలో దశాబ్దాల తరబడి వేచి చూస్తున్న భారతీయులకు ఈ సరికొత్త సస్పెన్షన్ భారంగా మారుతుంది.

టెక్ రంగంలో మార్పులు?

ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఐటీ దిగ్గజాలు అమెరికాలో తమ నియామక విధానాలను పూర్తిగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్‌-1ఏ వంటి ప్రత్యామ్నాయ వీసా మార్గాల వైపు మొగ్గు చూపడం లేదా గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌లను గణనీయంగా తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. పర్మ్ ప్రోగ్రామ్‌ను రద్దు చేయడంతో విదేశీ ఉద్యోగులు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడే ఆలోచనను విరమించుకునే అవకాశం లేకపోలేదు. అమెరికన్ కార్మికుల రక్షణే ధ్యేయంగా వైట్‌హౌస్ అమలు చేస్తున్న ఈ కఠిన నిబంధనలు టెక్ రంగంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడతాయో వేచి చూడాలి.