న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారతీయ ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త వెలువడింది. వచ్చే సంవత్సరంలో దేశంలోని వివిధ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను సగటున 9.1 శాతం మేర పెంచే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ‘ఏయాన్’ (ఏఓఎన్) నిర్వహించిన సర్వేలో తేలింది. సంస్థలు తమ వృద్ధి లక్ష్యాలను సాధిస్తూనే, నిపుణుల కోసం జరిగే పోటీని తట్టుకునేందుకు వేతన బడ్జెట్ను స్థిరంగా ఉంచుకుంటున్నాయని నివేదిక పేర్కొంది.
రంగాల వారీగా వేతన పెంపు అంచనాలు
ఈ సర్వే, దేశంలోని 45 రంగాలకు చెందిన 1,200కు పైగా సంస్థల డేటాను విశ్లేషించి రూపొందించారు. దేశంలో బలమైన దేశీయ వినియోగం, నిరంతర పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధి.. వ్యాపార విశ్వాసాన్ని పెంచుతున్నాయని, దీనివల్ల కంపెనీలు ఖర్చులను నియంత్రిస్తూనే ప్రతిభపై పెట్టుబడులు పెట్టగలుగుతున్నాయని నివేదిక వివరించింది. ఆర్థిక రంగంలో వృద్ధికి అనుగుణంగా వివిధ రంగాల్లో జీతాల పెంపు భిన్నంగా ఉండనుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) 10.1 శాతం వృద్ధితో జీతాల పెంపులో ముందుండే అవకాశం ఉంది. ఇంధన రంగంలో 9.9 శాతం, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 9.8 శాతం మేర వేతనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
సీనియారిటీ ఒక్కటే సరిపోదు నైపుణ్యం పెంచుకోవాలి
ఈ సందర్భంగా ఏయాన్ సంస్థకు చెందిన టాలెంట్ సొల్యూషన్స్ ఇండియా భాగస్వామి రూపంక్ చౌదరి మాట్లాడారు. ‘‘ కంపెనీలు పరిహారం చెల్లింపులో మరింత నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తున్నాయి. తయారీ, సాంకేతిక రంగాలలో అరుదైన నైపుణ్యాలు కలిగిన వారికి తగిన గుర్తింపు లభిస్తుంది’’ అని ఆయన తెలిపారు.
నిపుణులను కాపాడుకోవడంలో పెరుగుతున్న సవాళ్లు
మరోవైపు టాలెంట్ కలిగిన ఉద్యోగులను నిలుపుకోవడం కంపెనీలకు సవాలుగా మారుతోంది. 2025లో 16.2 శాతంగా ఉన్న ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 2026 నాటికి 18 శాతానికి పెరిగింది. అదే సమయంలో కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వేగంగా తమ కార్యకలాపాలలోకి చొప్పిస్తున్నాయి. 2025లో 46.1 శాతంగా ఉన్న ఏఐ ఉత్పాదక సాధనాల వినియోగం 2026 నాటికి 56 శాతానికి చేరుకున్నట్లు సర్వే స్పష్టం చేసింది.
ఉద్యోగులపై పడే ఖర్చుల భారాన్ని అంచనా వేయాలి
ఏయాన్ ఇండియా టాలెంట్ సొల్యూషన్స్ అసోసియేట్ పార్ట్నర్ అమిత్ కుమార్ ఓత్వాని మాట్లాడుతూ, ‘‘ కంపెనీలు కేవలం నియమాలు నిబంధనలు పాటిస్తే సరిపోదని, యాజమాన్యాలు వేతన కోడ్ తాలూకు విస్తృత ప్రభావాలను, ఉద్యోగులపై పడే ఖర్చుల భారాన్ని అంచనా వేయాలి. అదే సమయంలో ఉద్యోగులతో సమర్థవంతమైన సమాచార మార్పిడిని నిర్ధారించుకోవాలి’’ అని తెలిపారు
ఉద్యోగుల జీతం పెరగాలంటే?
ప్రపంచం వేగంగా మారుతోంది. ఉద్యోగులు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్పొరేట్ వ్యూహాలకు అనుగుణంగా ఉద్యోగులు తమను తాము అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని నివేదిక సూచిస్తోంది. మెరుగైన జీతం పొందాలంటే కేవలం సీనియారిటీ మీద కాకుండా, కొత్త టెక్నాలజీలు, మార్కెట్ డిమాండ్ ఉన్న నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే 9.1 శాతం కంటే ఎక్కువ పెంపును దక్కించుకోవడం సాధ్యమవుతుంది.