కీలక నిర్ణయాలు తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం
రైతులకు మేలు చేసేలా పథకాల రూపకల్పన
సహకరిస్తామంటున్న కార్పొరేట్ కంపెనీలు
ప్రభాత ఉదయం, బెంగళూరు: విద్యార్థులకు ఏఐ బోధన, రైతులకు మరింత మేలు చేసే పథకాలు, ఇతర అంశాలపై కర్ణాటక ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ట్రైనింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, 6వ తరగతి నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం డీకే శివకుమార్ ఆదేశాలిచ్చారు. వంద రోజుల ప్రభుత్వ పనితీరుపై సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం సీఎంవో ప్రకటన విడుదల చేసింది.
చర్చించిన అంశాలివే..
‘విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇచ్చేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన 941 మంది ఏఐ టీచర్లను ప్రభుత్వం త్వరలోనే నియమించనున్నది. గూగుల్ కూడా శిక్షణ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నది. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 1000 కర్ణాటక పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి కూడా నవంబర్ 14వ తేదీ లోగా పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు కంపెనీలు ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నాయి. ‘సీఎం రైత చైతన్య అగ్రిటెక్ మెషిన్’ పథకానికి సంబంధించి ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు సెల్ఫోన్ ద్వారా మెసేజ్లు వెళ్లాయి. పథకం ఉద్దేశం రైతులకు వివరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘సీఎం నెగిలీ యోగి పథకం’ గురించి కూడా చర్చించారు. కోడిగుడ్ల ఉత్పత్తిపై కూడా సర్కారు మరింతగా దృష్టి సారించింది. సోలార్ పవర్ సిస్టమ్స్ ఇన్స్టలేషన్కు సంబంధించిన 50 శాతం సబ్సిడీతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించారు’ అని సీఎంవో అందులో పేర్కొన్నది.