ఇటీవల ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘‘ నా కథ చెప్పడానికి ఇతరులు దశాబ్దాలు వెచ్చించారు. ఇప్పుడు నా కథ నేనే చెప్పుకునే సమయం వచ్చింది’’ అని అన్నారు. మీ కథను చెప్పే ప్రయత్నం చేస్తూ 75 పుస్తకాల వరకు వచ్చాయి. ఆ పుస్తకాలేవైనా చదివారా?మీ కథ రాసే ప్రయత్నం చేసిన ఏ పుస్తకం పైన గానీ, రచయిత పైన గానీ ఎటువంటి కోపం గానీ, చిరాకు గానీ మీకు కలగలేదని మీ ఎక్స్ పోస్టు ద్వారా అనుకోవచ్చా?
అన్ని పుస్తకాలు ఉన్నాయనే తెలీదు నాకు. నా గురించి రాసిన పుస్తకాలు చదవాలని నాకెప్పుడూ అనిపించలేదు. చాలాకాలం క్రితమే, మా గురించి వచ్చే కథలు, కథనాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను, రాజీవ్ కలిసి నిర్ణయించుకున్నాం. కానీ, పుస్తకంలో చెప్పినట్టు, ఒకానొక సమయంలో నా కథ నేనే చెప్పుకోవాలనే భావన కలిగింది. దాని ఫలితమే ఈ బిలాంగింగ్.
మీకు బాగా దగ్గరైన, వాస్తవకథను రాయడమనేది మీ లోపల నుంచి వచ్చిన నిర్ణయమా? లేదా మీ చుట్టూ అందరూ అడుగుతున్నారని రాసినదా? లేక రెండింటీ మూలంగా రాయడానికి పూనుకున్నారా?
పదేళ్ల క్రితమే నేను ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. గత ఐదేళ్ల నుండే పూర్తిస్థాయిలో దృష్టి సారించి రాశా. మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి.
ఈ బిలాంగింగ్ పుస్తకం రాజకీయ నేపథ్యం గల వ్యక్తిగత జ్ఞాపకాల సమాహారమని చెప్పుకొచ్చారు. కానీ, ఈ కథ మూలంలో మీకు, రాజీవ్‌కు మధ్య గల అద్భుతమైన ప్రేమకథ దాగుంది. ఆ ప్రేమ కథే మిమ్మల్ని రాజకీయంలోకి, ప్రజాజీవితంలోకి తీసుకొచ్చి, క్రమంగా దేశంలోనే ప్రముఖ రాజకీయ నాయకురాలిగా నిలబెట్టింది. ఇదంతా కల్పిత కథ కన్నా చిత్రంగా ఉంది కదా? మీరేమంటారు?
అవును, ఇది మా ఇద్దరి మధ్య ప్రేమకథ మాత్రమే కాదు, ఇది రాజీవ్ కుటుంబానికి, ఇంకా మొత్తం దేశానికి నాకు మధ్యగల ప్రేమకథ. మా ప్రేమ నన్ను ప్రజా జీవితంలోకి ఎలా తీసుకొచ్చిందనే కథ.
ఆర్.కె. నారాయణ్ ఒకసారి మాట్లాడుతూ కాలం మారినా, వయసు పెరిగినా, లోపలున్న మనిషి మాత్రం అలానే ఉంటారని చెప్పారు. మీరు ఇటలీలోని చిన్న కుటుంబంలో నుంచి వచ్చి ఇంత విస్తృతమైన ప్రపంచంలోకి ప్రవేశించారు. మరి అప్పటి ఇటలీ యువతి మీలో ఇంకా ఉందంటారా?
ఎదుగుతున్న వయసులో నేను నేర్చుకున్న విలువలన్నీ అలానే సజీవంగా ఉన్నాయి. కుటుంబానికి విధేయంగా ఉండటం, నిజాయితీ, ఇతరుల గురించి స్పందించడం, బాధ్యాతాయుతంగా వ్యవహరించడం, ఇవన్నింటికీ వీలైనంతగా కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేశాను. రాజీవ్ 60 ఏళ్ల క్రితం కలిసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నా. కాకపోతే అప్పుడు కొంచెం ఎక్కువ నవ్వేదాన్ని.
మీకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న మీ జీవిత భాగస్వామి రాజీవ్ గాంధీ, అత్త ఇంధిరా గాంధీ మీ కథలో ప్రధానపాత్ర పోషించారు. వెనక్కి తిరిగి చూసుకుంటే, వారు మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేశారు?
నేను కొత్తగా పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినపుడు, ఇండియా గురించి ఏమీ తెలియదు. నాకు ఇప్పుడు తెలిసింది మొత్తం వాళ్ల నుంచి నేర్చుకున్నదే. వారి ధైర్యం, సానుభూతీ, సెక్యులర్, ప్రజాస్వామ్య భారతదేశం కోసం వారి నిబద్ధత నన్ను ఎంతగానో ప్రేరేపించాయి.
ఎమర్జెన్సీ అనగానే అందరికీ సంజయ్ గాంధీ గుర్తొస్తారని మీరు పుస్తకంలో ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో రాజీవ్ గాంధీ తను విన్న ఫిర్యాదులను, అభిప్రాయాలను తల్లికి చెప్పినా పెద్దగా వినలేదని కూడా చెప్పారు. ఇందిరా గాంధీ తన పెద్ద కొడుకు, నిజాయతీగా పరిస్థితిని చెప్పిన ఇతరుల మాట వినుంటే ఎమర్జెన్సీ తీవ్రత తక్కువ ఉండేదని అనుకుంటున్నారా?
ఎమర్జెన్సీ మొత్తం సంజయ్ ఒక్కడే ఎక్కువగా కనిపించినా, అత్తగారి పైన ఆ సమయంలో ఇతర సీనియర్ నాయకుల ఒత్తిడి కూడా చాలానే ఉంది. రాజీవ్‌కున్న అభిప్రాయంతో ఏకీభవించేవారు ఆమె చుట్టూ కొద్దిమందే ఉండేవారు. క్రమంగా ఆమెనే సొంత వివేకంతో పరిస్థితిని అర్థం చేసుకుని, పరిష్కార చర్యలు తీసుకున్నారు.
ఎమర్జెన్సీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో నిస్సందేహంగా ఒక చీకటి అధ్యాయం. అదృష్టం కొద్దీ, అనేక కారణాల వల్ల అది ఎక్కువ కాలం కొనసాగలేదు. మీ పుస్తకంలో ఎమర్జెన్సీ గురించి ఆసక్తికరంగా రాశారు. ఆ సమయంలో జరిగిన అనేక పరిణామాలను మీరు కూడా రాజీవ్‌లాగే వ్యతిరేకించారని స్పష్టమవుతోంది. అయితే, దానిని నియంతృత్వ ధోరణులు కలిగిన చీకటి అధ్యాయంగా గుర్తించడం సరైనదా, లేకా కేవలం అధికార కేంద్రీకరణ చర్యగా చూడాలంటారా?
ఎమర్జెన్సీ ముగిసిన తర్వాతే, ఆ సమయంలో అసలు ఏం జరిగిందో, దాని తీవ్రత ఎంతటిదో నాకు పూర్తిగా అర్థమైంది. అవును, ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేశారు. హెబియస్ కార్పస్ కూడా నిలిపివేశారు. అయితే, ఇవన్నీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే జరిగాయి. నేను ఆ కాలాన్ని మళ్లీ గుర్తు చేసుకుంటే, అప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఇందిరా గాంధీ వ్యవహరించినట్లుగా అనిపిస్తుంది. అందుకే 1977 మార్చిలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో కొన్ని చర్యలు హద్దులు దాటాయని ఆమె బహిరంగంగానే అంగీకరిస్తూ, వాటికి క్షమాపణ కూడా చెప్పారని అందరికీ తెలుసు.
మీ పుస్తకంలో అత్యంత ఆసక్తికరంగా, లోతుగా చర్చించిన అంశాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ్ పరివార్ గురించి చేసిన విశ్లేషణ కూడా ఒకటి. ముఖ్యంగా భారత సమాజం, రాజకీయ వ్యవస్థపై, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలపై అవి చూపించే ప్రభావం, వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి మీరు ప్రస్తావించారు.ఈ ప్రాథమిక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా ప్రస్తుత కాలంలో కూడా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని హిందుత్వ శక్తులకు భిన్నంగా తన వైఖరిని సమర్థవంతంగా చాటుతున్నారని మీరు భావిస్తున్నారా?
లౌకికవాదం విషయంలో మనం ఇంత కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని అనుకునేవారు పార్టీలో చాలా మందే ఉన్నారు. అయితే అది పార్టీ దృక్పథం మాత్రం కాదు. మా విధానాలలో, ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కులకు మేము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఎలాంటి భయం లేకుండా తమ మతవిశ్వాసాలను అనుసరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని నమ్ముతున్నాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మీరు రాస్తూ, మీ ఇద్దరివీ భిన్నమైన సైద్ధాంతిక నేపథ్యాలని, భారతదేశం గురించి మీ ఆలోచనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే, అధికార వర్గాల పట్ల ఆయనకు కూడా కొంత ఇబ్బంది ఉందనే విషయాన్ని మీరు గుర్తించారు. పుస్తకంలో ఒకచోట మీరు ఢిల్లీలోని సంపన్నుల ఇళ్లలో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు మీకు కలిగిన అసౌకర్యాన్ని గుర్తుచేసుకున్నారు. అక్కడ చర్చించే రాజకీయ అభిప్రాయాలు భారతదేశ వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నట్లు మీకు అనిపించేదని రాశారు. మీరు మీ నియోజకవర్గంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ చూసిన పేదరికం, ప్రజల కష్టాలు, బతుకుదెరువు కోసం వారు పడుతున్న పోరాటం ఆ సంపన్న వర్గానికి ఊహకు కూడా అందనివిగా ఉండేవి.మోదీ సాధారణ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చారన్న విషయాన్ని ఆయన ప్రచార బృందం కొంత అతిశయోక్తిగా ప్రచారం చేసి ఉండవచ్చని మీరు అభిప్రాయపడినప్పటికీ, “సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చి, ఆర్ఎస్ఎస్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటూ రాజకీయంగా ఎదిగారు” అని కూడా మీరు పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోదీ రాజకీయ ప్రస్థానం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?
నిజమే, ఆయన పూర్తిగా భిన్నమైన సైద్ధాంతిక నేపథ్యం నుంచి వచ్చారు. అయితే రాజకీయాల్లో విజయం సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదని నేను భావిస్తున్నాను.
కాంగ్రెస్ నాయకులు శరద్ పవార్, పి.ఏ. సంగ్మా, తారిఖ్ అన్వర్ మీ విదేశీ మూలాలను ప్రస్తావిస్తూ, మీరు భారతదేశంలో ఉన్నత పదవులు చేపట్టడానికి అర్హులు కారని ప్రశ్నించినప్పుడు మీకు కలిగిన బాధను పుస్తకంలో ప్రస్తావించారు.“నా కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆ సమావేశం నుంచి బయటకు వచ్చేశాను. పదవులు, అధికారం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి రావాలని నన్ను ప్రోత్సహించిన కొందరు సహచరులే ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్నారు. నన్ను బాధించింది పదవి చేపట్టే అవకాశం గురించి కాదు. నా దేశభక్తి, భారతదేశం పట్ల నాకున్న విధేయతను ప్రశ్నించడమే నన్ను తీవ్రంగా కలచివేసింది.” అని అన్నారు. ఆ తర్వాత మీరు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్టీ నాయకులు మిమ్మల్ని కొనసాగాలని ఒప్పించారు. ఈ సంఘటన తర్వాత, భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ఆ పదవిని అంగీకరించకూడదనే నిర్ణయానికి మీరు మరింత గట్టిగా కట్టుబడ్డారా?
నాకు చాలా బాధ కలిగింది. వారంతా నా సహచరులు. వారిపై నాకు నమ్మకం ఉండేది. కానీ చివరకు వారికి నాపై నమ్మకం లేదని అర్థమైంది. వారు ఇప్పటికీ నన్ను బయటి వ్యక్తిగానే చూస్తున్నారన్న విషయం నాకు పెద్ద షాక్ ఇచ్చింది.ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, వారికి కూడా వారి సొంత కారణాలు ఉండొచ్చని అనిపిస్తుంది. అయితే, అది నా రాజకీయ జీవితంలో మొదట్లో జరిగిన సంఘటన. అప్పటికి ప్రధానమంత్రి పదవి గురించి ఆలోచన కూడా నాకు లేదు. అవును, నేను రాజీనామా చేశాను. కానీ, ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత, నా వ్యక్తిగత బాధను కారణంగా చూపి, నేను చేపట్టిన పెద్ద లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోకూడదని గ్రహించాను. అందుకే రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నాను.
రాజకీయంగా చూస్తే మీ పుస్తకంలోని 30వ చాప్టర్ అత్యంత ఆసక్తికరమైన అధ్యాయాల్లో ఒకటి. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, దాదాపు అందరూ మీరు ప్రధానమంత్రి అవుతారని భావించారు. కానీ మీరు ఆ పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కొత్త విషయాలను ఈ అధ్యాయం వెల్లడిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందే, కాంగ్రెస్ విజయం సాధిస్తే మీరు ప్రధానమంత్రి పదవిని చేపడతారా? అని మీ పిల్లల్లో ఒకరు అడిగినప్పుడు, మీరు “కచ్చితంగా చేపట్టను” అని సమాధానమిచ్చారు. మీ అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యలు వారి మనసుల్లో బలమైన భయాన్ని నింపాయి. ప్రధానమంత్రి పదవి అత్యంత ప్రమాదకరమైనదని భావించిన రాహుల్, ప్రియాంక ఇద్దరూ మీరు ఆ పదవిని చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, పార్టీ నాయకులంతా మీరు ప్రధానమంత్రి కావాలని ఒత్తిడి చేయడంతో కొంత నాటకీయ పరిస్థితి నెలకొంది. చివరకు మీరు ‘సరే’ అని అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. చివరికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. ఒకవేళ మీరు ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఉంటే, యూపీఏ ప్రభుత్వ విధానాలు, కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలు భిన్నంగా ఉండేవని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో పాటు అప్పట్లోనూ, ఇప్పుడూ కాంగ్రెస్‌లోని చాలా మంది నాయకుల కంటే మీరు సామాజిక ప్రజాస్వామ్య భావాలు ఎక్కువగా ఉన్న నాయకురాలిగా గుర్తింపు పొందారు.
లేదు, అలాంటి ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. మా అనుభవం మొత్తంగా చూస్తే చాలా సానుకూలంగా ఉంది. మేము ఒక బృందంగా కలిసి పనిచేశాం. మా ఇద్దరి బాధ్యతలు వేర్వేరుగా ఉండేవి. ఆయన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తే, నేను పార్టీకి నాయకత్వం వహించాను.
మీ పుస్తకంలోని ముగింపు అధ్యాయంలో, ఇటలీ నుంచి భారత్‌కు వచ్చి, మీరు వివాహం చేసుకున్న టుంబంతో ఇక్కడే జీవితాన్ని కొనసాగించడంపై వ్యక్తిగతంగా మీకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టంగా చెప్పారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మీలో మీకే తెలియని కొత్త సామర్థ్యాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. “జీవితం మనకు ఊహించని బాధ్యతలను అప్పగించినప్పుడు, వాటిని నిర్వర్తించడానికి మనలోనే తెలియని శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అర్థమవుతుంది” అని రాశారు. అయితే, రాజకీయంగా కొన్ని రాజీలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం మీరు అంతర్మథనానికి గురయ్యారని పేర్కొన్నారు.“ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ రాజీల వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరిందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ప్రతిసారీ అలా జరగలేదు. కొన్ని సందర్భాల్లో అవి పార్టీకి మేలు చేసినట్లు కనిపించినప్పటికీ, నాకు సంతోషం కలగలేదు. ఆ రాజీల విషయంలో ఇప్పటికీ నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది” అని రాశారు.అసలు మీరు చేసుకున్న ఆ రాజకీయ రాజీలు ఏమిటి? వాటికి రెండు ఉదాహరణలు చెప్పగలరా?
వాస్తవికంగా ఆలోచిస్తే, రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో రాజీలు తప్పనిసరి అవుతాయి. కొన్నిసార్లు కఠినమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మా రాజకీయ సిద్ధాంతాలతో ఏకీభవించని కొన్ని పార్టీలతో కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం నాకు ఎప్పుడూ సులువుగా అనిపించలేదు. అయినప్పటికీ, ఒక విషయంలో మాత్రం నాకు పూర్తి స్పష్టత ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో మేము ఎప్పుడూ ఎలాంటి రాజీ చేసుకోలేదు. భవిష్యత్తులో కూడా చేసుకోము.
గత పదేళ్లుగా నడుస్తోన్నరాజకీయంలో చట్టసభల్లో కానీ, ప్రజాజీవితంలో కానీ, మర్యాద, సభ్యత లేకుండా పోయాయని మీరు చింతిస్తూ వ్యాఖ్యానించారు. ‘‘వారితో విభేదించేవిరిని కించపరుస్తూ, వేధిస్తూ అమానవీయంగా ప్రవర్తించేవి నిరంకుశ ప్రభుత్వాలు’’ అని బీజేపీని విమర్శిస్తూ చెప్పారు. ఒకవేళ బీజేపీ 2029 ఎన్నికల్లో ఒడిపోతే తిరిగి రాజకీయాలు మీరు అనుకున్నట్టుగా మారుతాయా?
గత పన్నెండేళ్లలో దేశ నిర్మాణానికి, మన ప్రజాస్వామ్యానికి, మన ప్రభుత్వ సంస్థలకు భారీ నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం దిగిపోయినా కూడా, వ్యవస్థను పునరుద్ధరించడానికి రాజకీయ పార్టీల నుంచి శ్రమ, ఎంతో సమయం అవసరం పడుతుంది. దేశానికి జరిగిన నష్టాన్ని ప్రజలు ప్రస్తుతం గుర్తిస్తున్నారు. త్వరలోనే భారత ప్రజలు సరైన పాలనను ఎంచుకుంటారు.
భారతదేశంలో కాంగ్రెస్‌కు రాజకీయంగా తమ ఆధిపత్యం, ప్రాబల్యం తగ్గిందనేది వాస్తవం. గత మూడు దశాబ్దాలుగా హిందుత్వ శక్తుల ఎదుగుదలని ఎదుర్కొనడంలో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోంది. 2004 నుంచి 2014 మధ్య కాస్త పుంజుకున్నట్టు కనిపించినా, అది పార్టీ ఆధిపత్యాన్ని నిలపడానికి సరిపోలేదని విమర్శకులు చెప్తున్నారు. మీరు పుస్తకంలో కాంగ్రెస్ గురించి విస్తారంగా రాసారు. మీ ప్రకారం, పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ అవకాశాల గురించి మీ అభిప్రాయం?
నేను ఆశావాదిని. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు న్యాయమైన పోటీనే జరగలేదని గుర్తించాలి. ఎన్నికల సంఘాన్ని, ఇతర ప్రభుత్వ సంస్థలను, మీడియాను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది. ధనబలంతో,మత విద్వేషాలతో రాజకీయాలు చేస్తున్నారు. అయినా అన్నింటినీ ఎదుర్కొని కాంగ్రెస్ పోరాడుతూ ముందుకు సాగుతుంది. ఇంకా చెప్పాలంటే, దేశంపై జరుగుతున్న దాడిని తట్టుకొని, నిలబడి పోరాడుతుంది కాంగ్రెస్ మాత్రమే. మా నాయకులు, కార్యకర్తలు ఎంతో ధైర్యవంతులు. ప్రతీ జిల్లాలో, ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని రకాల వేధింపులు తట్టుకొని, రాజ్యంగంలో పొందుపరిచిన విలువల కోసం పోరాడుతున్నారు. ఇటీవలే ఎన్నికలన్నీ ఓట్ల చోరీతో గెలిచినవేనని నిరూపితం అవుతున్నది. ప్రజలు కూడా ఈ వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ తమ ఆలోచనలతో సరిపోయే పార్టీలతో కలిసి పనిచేసి, క్రమక్రమంగా అవకాశాలు మెరుగుపరుచుకుంటుంది.
భారత్‌తో పాటు విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో పాఠకులను ఆకర్షించే అవకాశం ఉన్న, ఇంతటి వ్యక్తిగత, రాజకీయ ప్రాధాన్యం ఉన్న పుస్తకం ప్రచురణకు కొన్ని నెలల ముందు ప్రచురణ సంస్థను మార్చుకోవడం అసాధారణం. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఈ 2026 ఆగస్టు చివరిలో ఇకపై Belonging: A Journey of Love పుస్తకాన్ని ప్రచురించట్లేదని అన్నట్టు తెలిసింది. సెప్టెంబర్ ప్రారంభంలో హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ పుస్తకాన్ని నవంబర్ 10న ప్రచురించనున్నట్లు ప్రకటించింది.ఈ మార్పు అనేక ఊహాగానాలకు దారితీసింది. నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, మతపరమైన ఉద్రిక్తతలు, మైనారిటీలు, గాల్వాన్ సహా చైనాతో భారత్‌కు ఉన్న ఘర్షణ వంటి అంశాలపై పుస్తకంలోని కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తాయని ఒక వార్తాపత్రిక కథనం పేర్కొంది.మనుస్క్రిప్ట్ విషయంలో విభేదాలు రావడంతో, మీ బృందమే పుస్తక ప్రచురణను కొనసాగించకూడదని నిర్ణయించుకుందని పెంగ్విన్ సంస్థ తెలిపింది.ఈ వార్తల్లో వచ్చిన వివరాలు నిజమేనా? ఈ వివాదం పుస్తకంలోని విషయాలకు సంబంధించినదా? లేక రచయిత భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన విస్తృతమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయా?
ఈ వివాదాల్లో భాగం కావడం నాకు ఇష్టం లేదు.
(అనువాదం : జే గౌతం, జీ భువన చంద్ర)