Air India Saudi Arabia flight cancellations till October 24 
జాతీయ వార్తలు

సౌదీకి విమానాలు బంద్‌.. అక్టోబర్ 24 వరకు పొడిగింపు

సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు అక్టోబర్ 24 వరకు పొడిగించాయి.

Aravind Reddy

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు అక్టోబర్ 24 వరకు పొడిగించాయి. జెడ్డా, రియాద్‌, దమ్మామ్‌ నగరాలకు వెళ్లే విమానాలతో పాటు అక్కడి నుంచి భారత్‌కు వచ్చే సర్వీసులను కూడా నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణికులకు వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

వాస్తవానికి విమాన సర్వీసులను అక్టోబర్ 20 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా గతంలో ప్రకటించింది. తాజాగా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో ఈ గడువును మరో నాలుగు రోజులు పొడిగించింది. సౌదీ అరేబియాలోని కీలక మౌలిక సదుపాయాలు, రియాద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులపై ఆంక్షలను కొనసాగిస్తున్నాయి.