జైపూర్: ఎయిరిండియా విమానం అత్యవసరంగా జైపూర్ విమానాశ్రయంలో ల్యాండయ్యింది. డీజీసీఏ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఎయిరిండియాకు చెందిన ఏఐ-2030 విమానం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వస్తున్న క్రమంలో హైజాక్ అయినట్లు ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కు పైలెట్ సమాచారం చేరవేశాడు. దీంతో అధికారులు అలెర్టై ఆ విమానాన్ని జైపూర్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. వెంటనే భద్రతా బలగాలు విమానంలో తనిఖీలు నిర్వహించి, క్షుణ్ణంగా పరిశీలించాయి. అనంతరం ప్రయాణికులను విమానంలోంచి విడతల వారీగా కిందకు దించారు. ఈ మేరకు ఎయిరిండియా విమానయాన సంస్థ ప్రకటన చేసింది. తమ విమానం జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండవ్వాల్సి వచ్చిందని తెలిపింది. ఈ ఆందోళనకర సంఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని స్పష్టం చేసింది. కాగా, మరికొద్దిసేపట్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటామనుకున్న సమయంలో ఒక్కసారిగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.