లక్నో : ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానించి, బయోమెట్రిక్ ధ్రువీకరణను అమలు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో భారీ అక్రమాలకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన, పార్టీ శ్రేణులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంగళవారం లక్నోలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై అఖిలేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఎలక్షన్ కమిషన్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో, బ్యాలెట్ బాక్సుల్లో ఉండాల్సిన పత్రాలు బయట ఎలా ప్రత్యక్షమయ్యాయి?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కొందరు అధికారులపై ఎన్నికల సంఘం చిన్నచిన్న చర్యలు తీసుకున్నంత మాత్రాన తమకు భరోసా కలగదని, వాటి వెనుక బయటకు కనిపించని పెద్ద కుట్ర ఏదైనా ఉండొచ్చని అఖిలేశ్ అనుమానం వ్యక్తం చేశారు.
పేర్ల తొలగింపుపై ఆందోళన
ఓటరు జాబితాల సవరణలో అర్హులైన ఓటర్ల పేర్లను, ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల పేర్లను లక్ష్యంగా చేసుకుని తొలగించారని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. 2019లో ఓటు వేసిన కొందరి పేర్లు 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి జాబితాలో కనిపించలేదని పేర్కొన్నారు. చొరబాటుదారుల అంశాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు. ఇప్పుడు యూపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. చొరబాటుదారులెవరు? వారిని ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారో బీజేపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభావంతో పనిచేస్తున్నట్లు భావిస్తున్న చిన్న పార్టీలు, వాటి నాయకుల తీరుపైనా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొన్ని పార్టీల నిర్ణయాలు, నాయకులకు అందుతున్న ఆదేశాలు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆరోపిస్తూ.. వాటిని ‘ప్రీపెయిడ్ పార్టీలు’గా అభివర్ణించారు.