Amit shah 
జాతీయ వార్తలు

నిరసనలతో సాధించేదేమీ లేదు

విపక్షాల నిరసనలతో ప్రయోజనం లేదన్న అమిత్ షా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్, ఆప్‌లకు సూచించారు.

S. Pavan

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విపక్షాలు ఇటీవల చేపట్టిన నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు, నిరసనలతో సాధించేదేమీ లేదన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తున్నదని, ఆ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాకపోవడానికి ఇదే కారణమని అన్నారు. గురువారం ఔటర్ ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన, కాంగ్రెస్, ఆప్ సహా విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఢిల్లీలో బీజేపీ గెలుపుతో ఒక కొత్త ఆటను విపక్షాలు మొదలుపెట్టాయి. ఓటు చోరీతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తున్నదని ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఓట్ల దొంగతనం ఆరోపణలు చేయడం ద్వారా మీరు చొరబాటుదారుల ఓట్లను కాపాడాలని చూస్తున్నారు’ అని అన్నారు. ‘సర్’లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్‌, ఆప్‌ ఆరోపణలు చేయటం, ప్రజల తీర్పును సవాలు చేయడమేనని పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు కూడా కాంగ్రెస్‌ను ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తిరస్కరించారని అన్నారు. కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణలో ప్రతిపక్షాలు గెలిచినప్పుడు అదే ఈవీఎం, అదే ఎన్నికల సంఘం ఉన్న సంగతిని అమిత్ షా గుర్తుచేశారు.

‘కాంగ్రెస్ ఓడిపోయిన ప్రతిసారీ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నది. కోర్టులు మీకు అనుకూలంగా తీర్పు ఇస్తే అవి మంచివి. లేదంటే చెడ్డవి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆందోళనలు, నిరసనలతో సాధించేదేమీ లేదు. ఎక్కడ అధికారంలో ఉన్నారో అక్కడ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయండి. లేదంటే అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోతారు’ అని హెచ్చరించారు. ఇక్కడే పుట్టా, ఇక్కడే చస్తా, కానీ రాహుల్‌గాంధీలా ప్రతి ఆరు నెలలకు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్‌, ఆప్‌ ప్రభుత్వాలే ఢిల్లీలో పర్యావరణ సమస్యలకు కారణమని ఆరోపించారు. పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను నియంత్రించడంలో ఆప్‌ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.