హాస్టల్లో గుట్టు చప్పుడు కాకుండా అండాల అక్రమ రవాణా 
జాతీయ వార్తలు

ఆపరేషన్ ఎగ్ హంట్!

హైదరాబాద్‌లోని హాస్టల్ పేరుతో కొత్త దందా.. అమ్మాయిల అండాలు, అబ్బాయిల వీర్యకణాలతో అక్రమ వ్యాపారం!

S. Rupa

ఇప్పటిదాకా కిడ్నీ రాకెట్లు, ఉమెన్ ట్రాఫికింగ్‌లే చూశాం. కానీ హైదరాబాద్‌లో అంతకుమించిన దారుణం బయటపడింది! గర్ల్స్ హాస్టల్ ముసుగులో యువతులను బంధించి, హార్మోన్ ఇంజెక్షన్లతో ప్రయోగాలు చేస్తూ, IVF కేంద్రాలకు అండాలు, వీర్యకణాలు అక్రమంగా అమ్ముతున్న అంతర్రాష్ట్ర మెడికల్ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు! ఈ రక్తపు దందా వెనుక ఉన్న మెడికల్ మాఫియా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ శరవేగంగా దర్యాప్తు చేస్తోంది.

 బయటకు చూస్తే అది ఓ సాధారణ గర్ల్స్ హాస్టల్! లోపలికి వెళ్తే ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన యువతులు. కానీ ఆ గోడల మధ్య ఏం జరుగుతోంది? అక్కడ కనిపించిన సిరంజీలు, హార్మోన్ ఇంజెక్షన్లు, మందుల వెనుక ఉన్న అసలు కథేంటి? ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిలు అనూహ్యంగా వైద్య ప్రక్రియల్లోకి ఎలా నెట్టబడ్డారు? వారి శరీరాల నుంచి సేకరించిన అండాలు ఎక్కడికి చేరుతున్నాయి? వాటి వెనుక ఎవరున్నారు? బయటకు పొక్కకుండా సాగుతున్న ఈ వ్యవహారం వెనుక భారీ నెట్‌వర్క్ ఉందా? హైదరాబాద్‌లో తాజాగా వెలుగుచూసిన ఈ ఉదంతం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. గర్ల్స్ హాస్టల్ ముసుగులో సాగుతోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘హ్యూమన్ ఓవా ట్రేడింగ్’ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ప్రకాశ్ నగర్‌ ప్రాంతంలోని అమినీత గర్ల్స్ హాస్టల్

ఉద్యోగం పేరుతో మొదలైన వేట?

బేగంపేట ప్రకాశ్ నగర్‌లోని ఓ గర్ల్స్ హాస్టల్. బయట 'అమీ నీతా గర్ల్స్ హాస్టల్' అనే బోర్డు. లోపల మాత్రం అనుమానాస్పద కార్యకలాపాలు! పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం..  బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చే యువతులే ఈ వ్యవహారంలో లక్ష్యంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల ద్వారా ఉద్యోగాల ఆశ చూపించి నగరానికి రప్పించడం.. ఆ తర్వాత హాస్టల్‌లో ఉంచడం.. చివరకు వారి అండాలను సేకరించే ప్రక్రియలోకి నెట్టడం.. ఇదే ఈ వ్యవహారంలో బయటపడుతున్న అనుమానాస్పద కోణం.

అయితే యువతులకు మొదట ఏం చెప్పారు? ఈ ప్రక్రియకు వారి సమ్మతి ఉందా? వైద్యపరమైన ప్రమాదాల గురించి వివరించారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

 హాస్టల్ గదుల్లో?

మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసుల దాడితో కథ కొత్త మలుపు తిరిగింది. హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు భారీ సంఖ్యలో సిరంజీలు, హార్మోన్ ఇంజెక్షన్లు, గర్భనిరోధక మాత్రలు లభించినట్లు సమాచారం. సాధారణంగా మహిళల ఆరోగ్యానికి సంబంధించిన వైద్య ప్రక్రియలు ప్రత్యేక అనుమతులు, వైద్య పర్యవేక్షణ, నిర్దిష్ట భద్రతా ప్రమాణాలతో జరగాలి. కానీ హాస్టల్ గదుల్లో ఇలాంటి వైద్య సామగ్రి ఎందుకు ఉంది? అక్కడ ఎలాంటి వైద్య ప్రక్రియలు నిర్వహించారు? ఎవరి పర్యవేక్షణలో ఈ వ్యవహారం సాగింది?

ఈ ప్రశ్నలే ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి.

పోలీసుల అనుమానం ప్రకారం యువతులకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాల ఉత్పత్తిని ప్రేరేపించే ప్రక్రియ చేపట్టి ఉండొచ్చని తెలుస్తోంది. అనంతరం అండాలను సేకరించి ఇతర అవసరాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సుమారు పది మంది యువతులను పోలీసులు గుర్తించి రక్షించినట్లు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడైంది.

హాస్టల్లో కాలిపోయిన సిరంజీలు, హార్మోన్ ఇంజెక్షన్లు, గర్భనిరోధక మాత్రలు

తెర వెనుక ఐవీఎఫ్ కేంద్రాలేనా?

ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది!

యువతుల నుంచి అండాలు సేకరించడమే ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు లక్ష్యమా? లేక దీని వెనుక మరింత విస్తృతమైన వ్యాపార నెట్‌వర్క్ ఉందా?

పోలీసుల ప్రాథమిక విచారణలో కొందరు పురుషుల నుంచి వీర్య నమూనాలు కూడా సేకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అండాలు, వీర్యకణాలను సంతాన సాఫల్య చికిత్సల అవసరాల కోసం అక్రమంగా సరఫరా చేశారా? నగరంలోని కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలున్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.

అయితే ఈ ఆరోపణలకు సంబంధించి నిర్దిష్ట కేంద్రాల ప్రమేయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఎవరు సేకరించారు? ఎవరికి సరఫరా చేశారు? ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే అసలు నెట్‌వర్క్ స్వరూపం బయటపడనుంది.

ఈ వ్యవహారంలో ఓ మహిళా నిర్వాహకురాలి పాత్రపై కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

 సరూర్‌నగర్ లింక్.. మరో ముఠా కథ కూడా ఇదేనా?

హైదరాబాద్‌లో మరోవైపు సరూర్‌నగర్ పరిధిలోనూ అక్రమ అండాల సేకరణకు సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన ముఠా 18 మంది యువతులతో అక్రమంగా అండాలు సేకరించినట్లు వచ్చిన ఆరోపణలు ఈ వ్యవహారంలో మరో కీలక కోణాన్ని తెరపైకి తెచ్చాయి. ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధాలున్నాయా? ఒకే తరహా ఏజెంట్లు పనిచేస్తున్నారా? యువతులను ఒకే నెట్‌వర్క్ ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నారా? లేక వేర్వేరు ముఠాలు ఇదే తరహా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయా? ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సిన అంశాలు.

పోలీసుల నిఘా.. హాస్టళ్లకు కొత్త నిబంధనలు!

ఈ ఘటనల నేపథ్యంలో ప్రైవేట్ వర్కింగ్ ఉమెన్, స్టూడెంట్ హాస్టళ్ల నిర్వహణపై పోలీసులు మరింత నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. హాస్టళ్లలో అనుమతులు, నివాసితుల వివరాలు, భద్రతా ఏర్పాట్లపై తనిఖీలు కీలకంగా మారాయి.

అనుమతులు: సంబంధిత ట్రేడ్ లైసెన్సులు, పోలీసు శాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

నివాసితుల వివరాలు: ఆధార్, స్వస్థలం, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు నమోదు చేయాలి.

సీసీటీవీ: ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, కారిడార్లలో కెమెరాలు ఏర్పాటు చేయాలి.

భద్రత: హాస్టళ్లలోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించాలి.

ఐవీఎఫ్ బేబీ

ఈ దందా వెనుక అసలు బాస్ ఎవరు?

ఇప్పటివరకు బయటపడింది కేవలం ఓ హాస్టల్ కథ మాత్రమేనా? లేక హైదరాబాద్‌లో విస్తరించిన పెద్ద నెట్‌వర్క్‌లో ఇది ఒక చిన్న భాగమా? ఉద్యోగాల పేరుతో నగరానికి వచ్చిన యువతులే ఎందుకు లక్ష్యంగా మారారు? అండాల సేకరణ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు ఎక్కడికి చేరాయి? ఈ వ్యవహారంలో వైద్యుల పాత్ర ఉందా? ఫెర్టిలిటీ కేంద్రాలకు సంబంధాలున్నాయా? తెరవెనుక ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్న కీలక వ్యక్తులు ఎవరు?

ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతోంది. బాధితుల వైద్య నివేదికలు, స్వాధీనం చేసుకున్న సామగ్రి, అనుమానితుల విచారణలో బయటపడే వివరాలు ఈ కేసులో కీలకం కానున్నాయి.

హాస్టల్ గోడల మధ్య మొదలైన ఈ మిస్టరీ.. చివరకు ఎవరెవరి ముసుగులు తొలగించనుంది? అసలు ఓవా ట్రేడింగ్ వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎంత పెద్దది? పోలీసుల తదుపరి దర్యాప్తులోనే ఈ చీకటి వ్యవహారం పూర్తి స్వరూపం బయటపడనుంది!