పాట్నా: ఎస్ఐఆర్‌పై ప్రతిపక్షాల నిరసనలను తిప్పికొట్టేందుకు బీజేపీ 15 రోజులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ప్రజాస్వామ్యాన్ని ‘కాపాడుదాం- మూకస్వామ్యాన్ని అంతం చేద్దాం’ అంటూ పాట్నాలో గురువారం ప్రారంభించిన ఈ కార్యక్రమం వచ్చే నెల 5 వరకు కొనసాగనుంది. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావగి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీకూభాయ్ దల్సానియా నేతృత్వంలో ర్యాలీలు, పాదయాత్రలు, మీడియా సమావేశాలు, విద్యార్థులు, యువకులతో చర్చలు జరగనున్నాయి.
సంజయ్ సరావగి ఈ ప్రచార కార్యాచరణ గురించి మీడియాకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అమలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాల పారదర్శకతను కాపాడటం, రాజ్యాంగ విలువలను రక్షించడానికి బీజేపీ ప్రజల వద్దకు వెళ్తోందన్నారు. ఈ అంశాలపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయడంతో పాటు, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
‘‘ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా తొలగించిన ఒక్క పేరునైనా చూపించాలని మేము ప్రతిపక్షాలను కోరుతూనే ఉన్నాం. వారు ఒక్క పేరును కూడా చూపించలేకపోయారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.’’ అని బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ డానిష్ ఇక్బాల్ అన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చే చట్టబద్ధమైన ప్రక్రియను, కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని పలువురు సీనియర్ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకోవాల్సిన ప్రతిపక్షాలు ‘మూక స్వామ్యం’లాగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.