Bombay High Court Orders 20 Lakh rupees Interim Compensation for Goa Nightclub Fire Victims 
జాతీయ వార్తలు

బాధిత కుటుంబాలకు 20 లక్షల పరిహారం

‘బిర్చ్ బైరోమియో లేన్’ నైట్ క్లబ్‌లో గతేడాది డిసెంబర్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో బాంబే హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది.

Sathyam

 పనాజీ: నార్త్ గోవా ప్రాంతంలోని ‘బిర్చ్ బైరోమియో లేన్’ నైట్ క్లబ్‌లో గతేడాది డిసెంబర్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో బాంబే హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. 25మంది బాధిత కుటుంబాలకు మధ్యంతర పరిహారంగా ఒక్కొక్కరికి రూ. 20లక్షల చొప్పున చెల్లించాలని క్లబ్ యజమానులు సౌరభ్ లుథ్రా, గౌరవ్ లుథ్రాలను ఆదేశించింది. బాధితులకు నష్టపరిహారానికి సంబంధించిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ వాల్మీకి మెనెజెస్, జస్టిస్ అమిత్ జామ్‌సాండేకర్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఈ మొత్తాన్ని మధ్యంతర పరిహారంగా మాత్రమే పరిగణించాలని పేర్కొంది. బాధితుల తరఫున న్యాయవాది ప్రాచీ సావంత్ మాట్లాడుతూ బాధితులు రూ. 50లక్షలు పరిహారంగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. కానీ నైట్ క్లబ్ యజమానులు రూ. 25లక్షలు పరిహారంగా చెల్లిస్తామని తెలిపినట్లు చెప్పారు.

మధ్యంతర పరిహారంగా..

ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుతం రూ. 20లక్షలు మధ్యంతర పరిహారంగా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణలోగా ఇరుపక్షాలు పరిహారంపై ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురి కుటుంబాలు హర్యానాలోకి వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేసినట్లు ఈ సందర్భంగా బాధితుల తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.  కాగా ప్రతిపాదించిన పరిహారంపై బాధిత కుటుంబాల నుంచి నిర్ణయాన్ని సేకరించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆయా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలతో పూర్తి జాబితాను సిద్ధం చేయాలని ఈ వ్యవహారంలో కోర్టు నియమించిన అమికస్ క్యూరీని ఆదేశించింది. మధ్యంతర పరిహారం ప్రతిపాదనపై చర్చించి కోర్టుకు ఈనెల 21లోగా తెలియజేయాలని ఇరువర్గాలకు సూచించింది. తదుపరి విచారణ కూడా అదే తేదీకి వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే..

గతేడాది డిసెంబర్ 6న నార్త్ గోవాలని ఆర్పోరా గ్రామంలో ఉన్న ‘బిర్చ్ బైరోమియో లేన్’ నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 25మంది మృతి చెందగా, 50మంది వరకు గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే క్లబ్ యజమానులు లుథ్రా సోదరులు థాయ్‌లాండ్‌కు వెళ్లిపోయారు. ఆ దేశం నుంచి వారిని డిసెంబర్ 17న భారత్‌కు రప్పించారు. ప్రస్తుతం సోదరులిద్దరూ నార్త్ గోవాలోని కొల్వాలే సెంట్రల్ జైలులో ఖైదీలుగా ఉన్నారు.