ఈ100, ఈ85 ఇంధనాల వినియోగానికి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల కోసం నిబంధనలను సవరించిన కేంద్ర ప్రభుత్వం. 
జాతీయ వార్తలు

ఇకనుంచి కార్లలో పెట్రోల్‌కు బదులు ఈ100 ఇంధనం వాడాలి.. రీజన్ ఇదే

ముడి చమురు దిగుమతులు, వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ100, ఈ85 ఇంధనాలను మోటరు వాహన నిబంధనల్లో చేర్చగా, వీటిని ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల్లో మాత్రమే వినియోగించాలని పేర్కొంది.

Madhu

న్యూఢిల్లీ: పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ముడి చమురు దిగుమతులు, వాహన కాలుష్యాన్ని నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌-1989లో సవరణలు చేసింది. ఈ నెల 23న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ85తోపాటు ఈ100 ఇంధనాన్ని కూడా సంబంధిత వాహన ఉద్గార ప్రమాణాలు, ఇంధన స్పెసిఫికేషన్లు, పరీక్షల నిబంధనల్లో చేర్చింది. ఈ మార్పులు సోమవారం అధికారికంగా వెల్లడయ్యాయి. అయితే, ఈ100 ఇంధనాన్ని అన్ని వాహనాల్లో వినియోగించడానికి కేంద్రం అనుమతించలేదు. వాహన తయారీ సంస్థలు ప్రత్యేకంగా రూపొందించి, ధ్రువీకరించిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల్లో మాత్రమే ఈ100, ఈ85 ఇంధనాలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. వాహన బరువు పరిమితిలోనూ మార్పు ఈ100 ఇంధనానికి సంబంధించిన నిబంధనలతోపాటు, కొన్ని వాహనాల ఉద్గార ప్రమాణాల పట్టికల్లో స్థూల వాహన బరువు పరిమితిని 3,000 కిలోల నుంచి 3,500 కిలోలకు పెంచింది. ఇంధన వర్గీకరణలు, పరీక్షల విధానాలకు సంబంధించిన మరికొన్ని సాంకేతిక మార్పులను కూడా ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఈ100 ఇంధనం అంటే ఏమిటి?

ఈ100 అనేది దాదాపు పూర్తిగా ఇథనాల్‌తో తయారయ్యే ఇంధనం. సాధారణ పెట్రోల్‌లో ఇథనాల్‌ను నిర్దిష్ఠ శాతంలో కలుపుతారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఈ20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌, 80 శాతం పెట్రోల్‌ ఉంటుంది. కానీ, ఈ100లో మాత్రం దాదాపు 100 శాతం ఇథనాలే ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించడం ద్వారా దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

సాధారణ పెట్రోల్‌ కార్లలో వాడొచ్చా?

ప్రస్తుతం సాధారణ పెట్రోల్‌తో లేదా ఈ20 ఇంధనంతో నడిచే వాహనాల్లో నేరుగా ఈ100 వినియోగించకూడదని కేంద్రం పేర్కొంది. ఇథనాల్‌ శాతం అధికంగా ఉన్న ఇంధనాలకు అనుగుణంగా ఇంజిన్‌, ఇంధన సరఫరా వ్యవస్థ, ఇతర భాగాలు ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుందని, లేదంటే వాహన పనితీరు, విడిభాగాల మన్నికపై ప్రభావం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.