Centre plans Civil Defence special training to 60,000 volunteers in 12 states 
జాతీయ వార్తలు

జనాలే ఫైటర్లు

దేశవ్యాప్తంగా 60 వేల మంది వాలంటీర్లకు పౌర రక్షణపై శిక్షణ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

Srinivas Rao

న్యూఢిల్లీ: పౌర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైనిక దళాల ఆధ్వర్యంలో సాధారణ ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా 60 వేల మందికి శిక్షణ ఇవ్వాలని కేంద్రం ప్రకటించింది. పౌర రక్షణ దళాలు యుద్ధ సమయాల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.

పన్నెండు రాష్ట్రాల్లో అమలు

మొదటి దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, మేఘాలయ, సిక్కిం, అసోం, ఉత్తరప్రదేశ్, కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ముందుగా 600 మంది మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీరు ఒక్కొక్కరు 100 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తారని ప్రభుత్వం వెల్లడించింది.

నవంబర్ నాటికి శిక్షణ

నవంబర్ రెండో వారం నాటికి ప్రతి రాష్ట్రం నుంచి 50 మందికి శిక్షణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక యుద్ధ తంత్రాలు, డ్రోన్ల దాడుల ముప్పు, రక్షణ చర్యలపై ఈ శిక్షణ ఉండనుంది. అణు, రసాయన ముప్పుల నుంచి రక్షణ పొందడంపై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. "దేశ రక్షణ రంగంలో పౌరుల భాగస్వామ్యం ఎంతో అవసరం" అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

భద్రతా విన్యాసాల నిర్వహణ

గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులను అప్రమత్తం చేసేందుకు ఈ విన్యాసాలు ఉపయోగపడుతున్నాయి. స్థానిక యంత్రాంగాలు, హోంగార్డులు, ఎన్సీసీ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నారు. యుద్ధ పరిస్థితులతో పాటు అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించే కమ్యూనికేషన్ వ్యవస్థలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. సైనిక దళాల సమన్వయంతో పౌర రక్షణ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచేలా ఈ శిక్షణా కార్యక్రమాలను రూపొందించారు.