Central Government Proposes Stricter Rules On Drug Advertisements 
జాతీయ వార్తలు

ప్రిస్క్రిప్షన్ మందుల ప్రకటనలపై మరిన్ని ఆంక్షలు

Sathyam

-ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ సవరణలు

-కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదన

-30రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలు

తెలుపాలని ప్రజలకు విన్నపం

న్యూఢిల్లీ: వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే విక్రయించాల్సిన మందుల ప్రకటనలపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం ఔషధ చట్టం, 1945కు సవరణలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ద్వారా మందుల కంపెనీలతో పాటు రిటైల్, హోల్‌సేల్ విక్రయదారులు, పంపిణీదారుల ప్రకటనలపై నియంత్రణను మరింత బలోపేతం చేయనున్నారు.  కాగా, ఔషధ సాంకేతిక సలహా బోర్డు(డీటీఏబీ)తో సంప్రదింపుల అనంతరం గతనెల 28న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సవరణ ముసాయిదాను ప్రకటించారు.  ఇక షెడ్యూల్ H, H1, X కిందకు వచ్చే ప్రిస్క్రిప్షన్ మందుల ప్రకటనలకు కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి కానున్నది. మందులను విక్రయించడానికి, నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతి పొందిన సంస్థలను కూడా ఈ నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.  కొన్ని యాంటీబయాటిక్స్, ప్రిస్క్రిప్షన్ ఔషధాల వినియోగంలో వైద్యుల పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, తద్వారా ప్రజల ఆరోగ్యానికి భద్రత ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నది.

ఇందుకోసం ఔషధాల నియంత్రణ చట్టం 1945లోని నిబంధన65కు సబ్‌ రూల్ 22ను చేర్చాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఔషధాల తయారీదారులకు ఉన్న ప్రకటనల ఆంక్షలను ఇకపై మందుల విక్రయ, పంపిణీ లైసెన్స్‌దారులకు కూడా వర్తింపజేసేందుకే ఈ చట్టం తేనున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ముసాయిదా పత్రాలు బయటకు వచ్చిన 30 రోజుల్లో తమ సూచనలు, అభ్యంతరాలు తెలుపాలని కోరింది. ఆ తర్వాత సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేయనున్నది.