Cisco CEO Chuck Robbins  
జాతీయ వార్తలు

ఏఐ అభివృద్ధిని ఆపలేం : సిస్కో చైర్మన్ రాబిన్స్

ఏఐ అభివృద్ధిని ఆపడం సాధ్యం కాదని సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ పేర్కొంటూ, సైబర్ భద్రతను బలోపేతం చేయాలని సూచించారు.

S. Pavan

న్యూఢిల్లీ : కృత్రిమ మేథస్సు (ఏఐ) అభివృద్ధిలో నెలకొన్న పోటీపై టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నవేళ ‘సిస్కో’ చైర్మన్, సీఈవో రాబిన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ అభివృద్ధిని నియంత్రించటం సాధ్యం కాదని అన్నారు. దానిని ఆపేందుకు ప్రయత్నించడం కంటే, సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘సిస్కో’ ప్రధానంగా నెట్ వర్కింగ్ పరికరాలు, సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను తయారుచేస్తున్నది. ఏఐ వల్ల మానవాళికి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు నిపుణుల, టెక్ సంస్థల అధినేతలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఏఐ టెక్నాలజీ అభివృద్ధిని నియంత్రించాలన్న వాదనలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాబిన్స్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించడం సాధ్యం కాదు. మనం ఆ దిశగా ప్రయత్నించినా అది ఆగదు. దానివల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు భారీగా దెబ్బతింటాయని భావించడం లేదని రాబిన్స్ తెలిపారు. ఏఐని సమర్థంగా ఉపయోగిస్తే ఉద్యోగుల పని సామర్థ్యం పెరుగుతుందని, మరింత మెరుగైన పనులపై వారు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఏఐ వేగానికి దీటుగా భద్రత

ఏఐ వల్ల తలెత్తే సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు భద్రతా చర్యలను ముందుగానే బలోపేతం చేయాలని రాబిన్స్ సూచించారు. ఏఐ మోడళ్లను విడుదల చేసే విధానంలో స్పష్టమైన నియమాలు ఉండాలని, వాటి పనితీరుపై తగిన నియంత్రణలు విధించాలని చెప్పారు. ప్రభుత్వాలు, కంపెనీలు ఏఐ వ్యవస్థల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేలా పారదర్శకత ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఏఐ వాడకం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలూ ఉంటాయని తెలిపారు. ఆ నష్టాలను తగ్గించే మార్గాలను కనుగొనడం అత్యంత ముఖ్యమని, ఈ సవాల్‌ను భారత్‌ సహా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఏఐపై అతిగా నియంత్రణలు విధిస్తే నూతన ఆవిష్కరణలు ఆగిపోయి, దేశం వెనుకబడే ప్రమాదం ఉందని రాబిన్స్ హెచ్చరించారు.