Abhijeet Dipke Calls For Tiranga Rally at Connaught Place 
జాతీయ వార్తలు

16న తిరంగాలతో ఢిల్లీకి తరలిరండి

మువ్వన్నెల జెండా ఎగురవేసినందుకు సీజేపీ నేతలను జైల్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిజీత్ దీప్కే, అక్టోబరు 16న ఢిల్లీలో తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చారు.

Haji Pasha

న్యూఢిల్లీ: తమ మద్దతుదారులంతా జాతీయ జెండాలతో శుక్రవారం (అక్టోబరు 16న) సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌కు తరలి రావాలని కాక్రోచ్​ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్​ దీప్కే పిలుపునిచ్చారు. మువ్వన్నెల భారత జెండాను ఎగురవేసినందుకే సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్​, అశుతోష్ రన్కాలను జైల్లో వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జాతీయ జెండాను ప్రేమించే దేశభక్తులంతా త్రివర్ణ పతాకాలను చేతపట్టి అక్టోబరు 16న కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు తరలిరావాలి. మువ్వన్నెల జెండాను ఊపడం నేరం కాదని మనం నిరూపిద్దాం. ఈ గొప్ప పతాకమే భారతీయులకు గర్వకారణమని చాటి చెబుదాం” అని పేర్కొంటూ అభిజీత్​ దీప్కే బుధవారం ఓ ట్వీట్​ చేశారు. ఢిల్లీ దాకా రాలేని వాళ్లు, తమతమ నగరాల్లోనే తిరంగా ర్యాలీలను నిర్వహించాలని కోరారు.

నన్ను కూడా జైల్లో వేస్తారేమో

తిరంగా ర్యాలీ తర్వాత తనను కూడా జైల్లో వేసే అవకాశం ఉందని దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. ఏదిఏమైనా తనకు గర్వకారణమైన మువ్వన్నెల జెండాను ఎగురవేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగింపునకు గురైన జంతర్ మంతర్‌లోకి మంగళవారం (అక్టోబరు 13న) అక్రమంగా ప్రవేశించారనే అభియోగాలతో సౌరవ్ దాస్​, అశుతోష్ రన్కాలకు ఐదు రోజుల జ్యుడీషియల్​ కస్టడీని విధించారు. బుధవారం ఉదయం వారిద్దరిని తిహార్ జైలుకు తరలించారు. ఆ వెంటనే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్​ దీప్కే తిరంగాలతో నిరసనలకు పిలుపునిచ్చారు.