దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జంతర్ మంతర్ అంటే అందరికీ గుర్తొచ్చేది రాజకీయ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు. ప్రస్తుతం జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన నిరసనలు, నీట్ పరీక్ష పేపర్ లీక్ నేపథ్యంలో అప్పటి విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జెన్ జీ చేపట్టిన ఉద్యమం, రైతుల ఉద్యమాలు, అవినీతి వ్యతిరేక పోరాటాలు, ఉద్యోగ సంఘాల నిరసనలు, మహిళా రెజ్లర్ల ఆందోళనలు.. ఇలా ఎన్నో సంచలన ఉద్యమాలకు ఈ ప్రాంతం వేదికైంది. అయితే జంతర్ మంతర్‌ను అధికారిక నిరసనల వేదికల జాబితా నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు అక్టోబర్ 12న ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జంతర్ మంతర్ ప్రాంతాన్ని డినోటిఫై చేసినట్లు వెల్లడించారు. జంతర్ మంతర్‌కు బదులుగా రామ్ లీలా మైదానం, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్ల (Central Business District Ground) ను నిరసనలకు వేదికగా వినియోగించుకోవచ్చని ఢిల్లీ పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశం, ఈ ప్రదేశం.. ప్రజా ఉద్యమాలకు చిరునామాగా ఎలా మారింది? ఏ ప్రభుత్వం దీన్ని నిరసనల వేదికగా గుర్తించింది? సంబంధిత విషయాలను తెలుసుకుందాం..
జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా తొలగించడం వెనుక ప్రధానంగా ట్రాఫిక్ నిర్వహణ, స్థానికుల ఇబ్బందులు, భద్రతాపరమైన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, పటేల్ చౌక్, వాటి పరిసర ప్రాంతాల్లో నిరసనల కారణంగా రాకపోకలకు అంతరాయం కలగడంతోపాటు నిరసనకారులు వినియోగించే మైకులు, సౌండ్ సిస్టమ్‌లతో శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని స్థానిక నివాసితులు, వ్యాపార సంస్థల నుంచి గత కొన్నేళ్లుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కీలక కార్యాలయాలకు సమీపంలో ఉండటంతో నిరసనల సమయంలో జనసమూహాల నియంత్రణతోపాటు వీఐపీల భద్రతపైనా దృష్టి సారించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా డీనోటిఫై చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
నిరసనల కోసం కాదు.. ఖగోళ పరిశోధనల కోసం!
జంతర్ మంతర్‌ను మొదట నిరసనల కోసం నిర్మించలేదు. ఇది ఖగోళ పరిశీలనల కోసం రూపొందించిన చారిత్రక కట్టడం. 'జంతర్ మంతర్' అనే పేరు సంస్కృత పదాలైన 'యంత్ర' (పరికరము లేదా సాధనము), 'మంత్ర' (మంత్రణ/గణన లేదా లెక్కింపు) అనే పదాల నుండి రూపాంతరం చెంది ఉత్పన్నమైంది. 'జంతర్ మంతర్' అంటే నికరమైన శాస్త్రీయ అర్థంలో "ఖగోళ సమయాన్ని, గ్రహాల స్థానాలను లెక్కించే సాధనము" (Calculating Instrument) అని అర్థం. జంతర్ మంతర్‌ను 1724లో జైపూర్ మహారాజా సవాయి జైసింగ్-II నిర్మించారు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాల స్థానాలను పరిశీలించడం, ఖగోళ గణనలను మరింత కచ్చితంగా నిర్వహించడం దీని అసలు ఉద్దేశం. ఢిల్లీతోపాటు జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మథురల్లోనూ ఆయన ఇలాంటి పరిశీలనా కేంద్రాలను నిర్మించారు.
మహారాజా సవాయి జైసింగ్-II నిర్మించిన జంతర్ మంతర్‌ను కేవలం కట్టడంగానే కాకుండా, ఖగోళ సమయాన్ని మరియు గ్రహాల స్థానాలను లెక్కిస్తూ సుదీర్ఘకాలం పాటు ప్రత్యక్షంగా ఉపయోగించినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయి. అప్పటివరకు లోహంతో చేసిన చిన్న పరికరాల ద్వారా కొలిచే సమయంలో చిన్నచిన్న పొరపాట్లు వస్తున్నాయని గ్రహించిన ఆయన భారీ ఖాగోళ పరికరాలతో జంతర్ మంతర్ నిర్మించారు. వీటి సాయంతో సూర్యుడి స్థానం, సమయం, గ్రహాల కదలికలను పరిశీలించేవారు. ఇందుకు నిదర్శనంగా 1732–1735 ప్రాంతంలో ‘జీజ్-ఇ-మహమ్మద్ షాహీ’ పేరిట రూపొందించిన సమగ్ర ఖగోళ పట్టికల గ్రంథంలో నక్షత్రాల స్థానాలు, గ్రహణాల సమయాలను పొందుపరచగా, ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్త ఫాదర్ క్లాడ్ బౌడీర్ 1734లో ఇక్కడ పరిశీలనలు జరిపి తన డైరీలో నమోదు చేశారు. అలాగే ఇక్కడి 'సమ్రాట్ యంత్ర' నీడ ద్వారా ఢిల్లీ స్థానిక సమయాన్ని రెండు సెకన్ల కచ్చితత్వంతో రోజువారీగా కొలిచేవారని, 18వ శతాబ్దంలో పంచాంగాలు మరియు క్యాలెండర్లలో పండగలు, ముహూర్తాల లెక్కింపునకు ఈ సమాచారమే ప్రామాణికంగా నిలిచిందని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
రైతుల ఉద్యమం..బోట్ క్లబ్ నుంచి మంతర్‌కు మారిన నిరసన!
1947 స్వాతంత్ర్యానంతరం చాలా కాలం పాటు ఢిల్లీలో ప్రధాన నిరసనలన్నీ ఇండియా గేట్ సమీపంలోని "బోట్ క్లబ్ లాన్స్" (Boat Club) వద్దే జరిగేవి. అయితే 1988లో అక్కడ జరిగిన ఒక భారీ రైతు ఆందోళన తర్వాత భద్రతా కారణాల రీత్యా పార్లమెంట్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడంపై ఆంక్షలు వచ్చాయి.
వ్యవసాయ విద్యుత్ ఛార్జీలు, నీటి పన్నులను విపరీతంగా పెంచడం, చెరుకుతో సహా వివిధ పంటలకు సరైన మద్దతు ధర (MSP) కల్పించాలని, చక్కెర మిల్లుల నుంచి రైతులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలనే తదితర డిమాండ్లతో ప్రముఖ రైతు నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ నేతృత్వంలో రైతులు పెద్ద సంఖ్యలో ఉద్యమించారు. 1988, అక్టోబర్ 25న ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమం నవంబర్ 1 వరకు సాగింది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, గుడారాలతో బోట్ క్లబ్ లాన్స్ (Boat Club) వద్దకు భారీగా తరలివచ్చారు.
పార్లమెంట్ భవనం, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు, విజయ్ చౌక్, రాజ్‌పథ్ పరిసరాలు పూర్తిగా స్తంభించించిపోవడం, అంతరాయం కలగడం జరిగింది. దీంతో నిరసన కార్యక్రమాలను పార్లమెంట్‌కు దూరంగా ఉండే ప్రాంతాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే 1993లో బోట్ క్లబ్ లాన్స్‌లో ఎలాంటి బహిరంగ సభలు, ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించకూడదని నిషేధం విధించారు. ఆ తర్వాత పార్లమెంట్ సమీపంలో భద్రతకు ముప్పు లేకుండా నిరసన తెలుపుకునేందుకు "జంతర్ మంతర్ రోడ్డు"ను ప్రత్యామ్నాయ అధికారిక ప్రదేశంగా (Designated Protest Site) ప్రతిపాదించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ద్వారా జారీ చేసిన పబ్లిక్ నోటిఫికేషన్ (Public Notification / Executive Order) ఆధారంగా ఈ మార్పు జరిగింది. పార్లమెంటుకు సమీపంలో ఉన్నప్పటికీ, బోట్ క్లబ్‌తో పోలిస్తే జంతర్ మంతర్ ప్రాంతం పరిమిత స్థలంలో ఉండటం, ప్రవేశ మార్గాలను నియంత్రించడం సులభంగా ఉండటం వంటి అంశాలు దాని ఎంపికకు అనుకూలంగా మారాయి.
2017లో నిషేధం.. 2018లో సుప్రీంకోర్టు జోక్యం!
జంతర్ మంతర్ వద్ద నిరసనల నిర్వహణపై వివాదం 2017లో మరో మలుపు తిరిగింది. శబ్ద కాలుష్యం, చెత్త, తాత్కాలిక నిర్మాణాల వల్ల స్థానిక నివాసితులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే పిటిషన్ల నేపథ్యంలో, 2017 అక్టోబర్ 5న జంతర్ మంతర్ రోడ్డుపై ధర్నాలు, నిరసనలను నిలిపివేయాలని NGT ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా రాంలీలా మైదానాన్ని సూచించింది. ఈ సందర్భంగా జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా గుర్తిస్తూ ప్రత్యేక అధికారిక ఉత్తర్వు లేదనే అంశం కూడా చర్చకు వచ్చింది. ఆ తర్వాత 2018 జులైలో సుప్రీంకోర్టు జోక్యంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. శాంతియుతంగా సమావేశమై నిరసన తెలిపే హక్కును పూర్తిగా నిరాకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ప్రజా శాంతి, భద్రత, ఇతరుల హక్కులను దృష్టిలో ఉంచుకుని నిరసనల నిర్వహణపై నిబంధనలు విధించవచ్చని పేర్కొంది.
చరిత్రలో చెరగని ముద్ర
దాదాపు మూడు శతాబ్దాల క్రితం ఆకాశ గమనాన్ని లెక్కించేందుకు నిర్మించిన జంతర్ మంతర్.. కాలక్రమంలో ప్రజల ఆవేదనను, అసంతృప్తిని వినిపించే ఉద్యమాల వేదికగా మారింది. రైతుల పోరు నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమాల వరకు, మహిళా రెజ్లర్ల ఆందోళనల నుంచి విద్యార్థుల నిరసనల వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. 1988 రైతు ఉద్యమం తర్వాత బోట్ క్లబ్ నుంచి జంతర్ మంతర్‌కు మారిన నిరసనల ప్రయాణం.. ఇప్పుడు అక్కడి నుంచి రామ్‌లీలా మైదానం, బురారీ, సీబీడీ గ్రౌండ్ల వైపు మళ్లుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఖగోళ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన జంతర్ మంతర్.. దశాబ్దాల పాటు అనేక ప్రజా పోరాటాలకు గొంతుకగా మారి భారత ప్రజాస్వామ్య చరిత్రలో చెరగని ముద్ర వేసింది.