న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్.. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సోమవారం రాహుల్ గాంధీ వేలాది మంది కార్యకర్తలు, నేతలతో ర్యాలీ నిర్వహించడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జంతర్ మంతర్‌లో నిరసనలకు ఏ రోజు కేటాయిస్తారో 24 గంటల్లోగా తెలియజేయాలని సీజేపీ నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రఖ్యాత జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించింది. దీనికి బదులుగా మరో మూడు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ నిర్ణయంపై నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ.. జంతర్ మంతర్ వద్దే నిరసనలకు అనుమతివ్వాల్సిందేనని పట్టుబడుతుండటంతో సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, అజింక్యా షిందే సహా పలువురిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలోనూ నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న ఇద్దరు నేతలను.. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించబోమన్న షరతుతో సుప్రీంకోర్టు విడుదల చేసినట్లు సమాచారం. తాజాగా ఆ ఇద్దరు నేతలతో పాటు మరో కొత్త నేత కూడా నిరసనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు ఆందోళనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రతా వలయాలను దాటి లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.
అభిజీత్ దీప్కే తీవ్ర ఆరోపణలు
పోలీసుల తీరుపై సీజేపీ వ్యవస్థాపక నేత అభిజీత్ దీప్కే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ గొంతును అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నాయకులను అకారణంగా మళ్లీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఈ నిర్బంధాలను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. రాజధానిలో వరుస అరెస్టులు, ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.