న్యూఢిల్లీ: దేశరాజధానిలోని సెంట్రల్ పార్క్ వద్ద శుక్రవారం సాయంత్రం సీజేపీ నిర్వహించనున్న తిరంగా మార్చ్‌ను విరమించుకోవాలని ఢిల్లీ పోలీసులు ఆల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో ఉన్న ఎన్సీపీ నేత అనిశ్ గవండే ఇంట్లో బసచేసిన సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కేకు నోటీసులు అందజేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మార్చ్‌ను విరమించుకోవాలని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యువతను రెచ్చగొట్టడం సరికాదని సూచించారు. సెంట్రల్ పార్క్ పరిసరాల్లో సెక్షన్ 163(బీఎన్ఎస్) అమల్లో ఉంటుందని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. జాతీయ జెండా ఎగురవేయడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో నిర్వహించిన సర్ ప్రక్రియలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ కొన్ని రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు నిర్వహిస్తున్నది. దీంతో పాటు జంతర్ మంతర్ వద్ద గత మంగళవారం జాతీయ జెండా ఎగురవేశారనే కారణంతో సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్ట్ చేసి, ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీజేపీ తిరంగా మార్చ్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు శుక్ర, శనివారాల్లో పరిపాలనా కారణాలతో సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింది.