జాతీయ వార్తలు

ఆంక్షలు..అరెస్టులు

జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో ఆంక్షలు విధించారు. విమానంలోనే సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

S. Pavan

న్యూఢిల్లీ : విపక్షాలు, సీజేపీ నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అరెస్టులు, ఆంక్షల పర్వం కొనసాగుతున్నది. ఢిల్లీ పోలీసులు నిరసనకారుల్ని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. నిరసనలకు మద్దతు తెలుపుతున్న వారిని శుక్రవారం రాత్రి నుంచే అరెస్టు చేయటం మొదలైంది. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్ దాస్, అశుతోశ్‌లను విమానంలోనే అరెస్టు చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు, సీజేపీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శనివారం నిరసనలకు పిలుపునిచ్చాయి.  అయితే, జంతర్ మంతర్ 2.0 నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో నిరసనకారులు న్యూఢిల్లీలోకి ప్రవేశించకుండా అధికారులు పెద్ద ఎత్తున నిర్భంధాలు, ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి  దాదాపు 400 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వందలాది రైళ్లను రద్దు చేయడంతో పాటు, పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. ప్రజా రవాణాను పూర్తిగా స్తంభింపజేయరాదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించానా, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) 45 మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేసింది. రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, కశ్మీర్ గేట్ సహా 45 చోట్ల ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేశారు. దీంతో డీఎంఆర్‌సీకు వ్యతిరేకంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు రావాల్సిన 250కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు. జనపథ్-కర్తవ్య పథ్ కూడలి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

విమానంలో ఉండగానే దీప్కే అరెస్ట్‌

శనివారం ఢిల్లీకి చేరుకున్న సీజేపీ నేత అభిజీత్ దీప్కే సహా సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్‌లను విమానంలో ఉండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కే పార్టీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్‌లను అరెస్టు చేసిన తీరు సంచలనంగా మారింది. వీళ్లందర్నీ గుర్తు తెలియని ప్రాంతంలోకి పోలీసులు తీసుకెళ్లినట్టు వార్తలు వెలువడ్డాయి. పోలీసులు తనను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అభిజీత్ దీప్కే వెనక్కి తగ్గలేదు. ‘రండి అరెస్టు చేయండి. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. కానివ్వండి. నేను మీకు భయపడను’ అంటూ పోలీసులతో విమానం నుంచి కిందికి దిగారు. తమను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని ఆ తర్వాత ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఆంక్షలు విధించినప్పటికీ జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహిస్తామని దీప్కే తెలిపారు. నిరసనల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్న ప్రభుత్వం, మరోవైపు మెట్రో, రైళ్లను నిలిపివేసి, రోడ్లను మూసివేయడం ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టడం లేదా? అని ప్రశ్నించారు.

1.5 కిలోమీటర్ల పరిధిలో బారికెడ్లు..వాటికి వెల్డింగ్

జంతర్ మంతర్, జనపథ్, ఎన్నికల సంఘం కార్యాలయం, ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వంటి కీలక ప్రాంతాలను కలుపుకుని 1.5 కిలోమీటర్ల పరిధిని అత్యంత సున్నిత ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. నిరసనకారులు ఎవ్వరూ దీని పరిధిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డంకులు ఏర్పాటుచేశారు. కేవలం ఈ ప్రాంతంలోనే 6,500 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆడియో రికార్డింగ్ సదుపాయమున్న 300కుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్‌కు వెళ్లే దారిలో 7 అంచెల బారికెడ్స్ ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల బారికేడ్లను వెల్డింగ్ చేయడంతో వాటిని సులభంగా దాటేందుకు వీలు లేకుండా చేశారు. నిరసనలు నిర్వహించవద్దని, నినాదాలు చేస్తే అరెస్టు, చట్టపరమైన చర్యలు ఉంటాయని లౌడ్ స్పీకర్లతో పోలీసులు హెచ్చరిస్తున్నారు. హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు చేస్తున్నారు.