ముంబై నగరంలో వాయుకాలుష్యం దృష్టిలో పెట్టుకుని దీపావళి టపాసులు కాల్చవద్దంటూ ముంబై మహానగర పాలక సంస్థ తయారుచేసిన వీడియో వివాదానికి కారణమైంది. అందులో పలువురు సెలబ్రిటీలలో నటి దియా మీర్జా కూడా ఉంది. దీనిపై భాజపా ముంబై అధ్యక్షుడు అమిత్ సతమ్ అభ్యంతరం తెలపడంతో అధికారులు ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. బీఎంసీ ఆ వీడియోను తొలగించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. ఇదే సమయంలో మాధురి దీక్షిత్, అజింక్య రహానే వంటి ఇతర ప్రముఖుల వీడియోలు అలాగే కొనసాగుతుండటం గమనార్హం. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే దియా మీర్జా ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యంత్రాగం వెనక్కి తగ్గింది.
మిగిలిన సెలబ్రిటీల వీడియోలు తొలగించలేదు
మరికొన్ని సెలబ్రిటీల వీడియోలు అలాగే ఉన్నప్పటికీ, దియా మీర్జా వీడియోను మాత్రమే తొలగించడంపై ముంబై మేయర్ రుతు తావడే స్పందించారు. నటి మతం ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకోలేదని ఆమె వెల్లడించారు. "ఆమె ఎప్పుడూ హిందూ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. అందుకే ఆమెను వ్యతిరేకిస్తున్నాము. అంతే తప్ప మతం కాదు" అని మేయర్ పేర్కొన్నారు. ఈ వివాదంపై అధికార యంత్రాంగం నుంచి తప్పుల తడకల ప్రచారం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా కమిషనర్‌తో చర్చిస్తానని ఆమె తెలిపారు. మరోవైపు ఈ అంశం ఏ మతానికి సంబంధించినది కాదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. మన రాజ్యాంగం ప్రతి మతానికి పండుగలు జరుపుకునే హక్కును కల్పించిందని ఆయన అభిప్రాయపడ్డారు.