Mallikarjun Kharge Writes Letter To PM Modi For All-Party Meet To Discuss Delimitation Proposal 
జాతీయ వార్తలు

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మోదీకి ఖర్గే లేఖ

నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఏకపక్షంగా ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేయొద్దని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.

Haji Pasha

న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును బలవంతంగా, ఏకపక్షంగా ఆమోదింపజేసుకోవడానికి మరోసారి ప్రయత్నించొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. గతంలో ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు తగిన శాస్తి జరిగిందని ఆయన విమర్శించారు. ఈ మేరకు ప్రధానికి ఖర్గే శుక్రవారం ఓ లేఖ రాశారు. దీన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాం రమేశ్​ ఎక్స్  వేదికగా షేర్​ చేశారు.

ఉభయ సభలను ప్రొరోగ్​ చేయడంలో తీవ్ర జాప్యం

ఈ ఏడాది ఆగస్టులోనే ముగిసిన పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించడంలో (ప్రొరోగ్‌ చేయడంలో) తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి పార్లమెంట్ చరిత్రలో మునుపెన్నడూ లేదని ఖర్గే పేర్కొన్నారు. దీర్ఘకాలంలో దేశంపై పెను ప్రభావాన్ని చూపే కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దన్నారు. దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందే, అఖిలపక్ష భేటీని నిర్వహించి సమగ్రంగా చర్చించాలనే డిమాండ్​ను ఆయన పునరుద్ఘాటించారు. ‘‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదాపడ్డాయి. అది జరిగి 64 రోజులు గడిచిపోయినా, ఉభయ సభలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించలేదు. పార్లమెంట్​ను ప్రొరోగ్​ చేయడంలో ఇలాంటి వ్యూహాత్మక జాప్యం పార్లమెంటరీ చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు” అని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్​ చీఫ్​ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ బిల్లు దారుణంగా వీగిపోయింది

గతంలో లోక్​సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చే ముందే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని తాను ఏప్రిల్ 11న ప్రధానికి లేఖ రాశానని ఖర్గే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘మీరు అప్పుడు అఖిలపక్షాన్ని పిలవలేదు. ఏప్రిల్ 14న అర్ధరాత్రి వేళ బిల్లులను ప్రజల ముందుకు తెచ్చి, ఏప్రిల్ 16న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఏప్రిల్ 17న లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల (2/3) ప్రత్యేక మెజారిటీ దక్కక ఆ రాజ్యాంగ సవరణ బిల్లు దారుణంగా వీగిపోయింది” అని లేఖలో ఖర్గే పేర్కొన్నారు.

“నేను ఈ ఏడాది జూలై 16, ఆగస్టు 27 తేదీల్లోనూ మీకు (ప్రధానికి) లేఖలు రాశాను. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మళ్లీ కోరాను. ఇప్పుడు నేను నాలుగోసారి కూడా మీకు అదే అభ్యర్థన చేస్తున్నాను. దేశానికి ఎంతో కీలకమైన ఇలాంటి చట్టాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించడానికి  తగినంత సమయాన్ని ఇవ్వాలి. గతంలో పార్లమెంటులో ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొనైనా, మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును బలవంతంగా ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నించకండి” అని ప్రధానికి ఖర్గే హితవు పలికారు.

వివాదాల నడుమ సాగిన వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై, షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13న ముగిశాయి. అయితే, అయోధ్య రామాలయంలో కానుకల దొంగతనం ఆరోపణలు, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, ఢిల్లీలో నీట్ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ ఈ సమావేశాలు పదే పదే వాయిదా పడుతూ సాగాయి.