న్యూఢిల్లీ: దేశ ఆర్థిక భద్రతను దెబ్బతీసే కుట్రను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. పాకిస్తాన్ నుంచి జరుగుతున్న భారీ రాతి ఉప్పు అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు. సుమారు 73 లక్షల కిలోల పాకిస్తాన్ రాక్ సాల్ట్ ( రూ. 36.5 కోట్ల విలువైన) అక్రమ దిగుమతిని గుర్తించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. శ్రీలంక, దుబాయ్ మార్గాల ద్వారా ఈ అక్రమ దందా సాగినట్లు విచారణలో తేలింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి నేరుగా వస్తువులను దిగుమతి చేసుకోవడంపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిబంధనలను తప్పించుకోవడానికి కేటుగాళ్లు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పారిశ్రామిక వినియోగం కోసమని 295 కంటైనర్లలో 7,300 మెట్రిక్ టన్నుల పారిశ్రామిక ఉప్పును దేశంలోకి రప్పించారు. ఈ మొత్తం సరుకు విలువ సుమారు రూ. 36.5 కోట్లకు పైగా విలువ చేస్తుందని అధికారులు అంచనా వేశారు.
నకిలీ పత్రాలతో దొంగదారి
శ్రీలంకలోని కొలంబో పోర్టు మీదుగా ఈ కంటైనర్లు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించాయి. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సంస్థల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. పంపించింది పాకిస్తాన్ అయినప్పటికీ, తప్పుడు పత్రాలను సమర్పించి మోసానికి పాల్పడ్డారు. ఈ ఏడాది మార్చి నుంచి ముంద్రా, కాండ్లా ఓడరేవుల ద్వారా ఈ దిగుమతులు నిరంతరంగా కొనసాగాయి. ఖచ్చితమైన సమాచారం అందుకున్న అధికారులు 15 రోజుల పాటు పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించారు. గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గాంధీధామ్, పానిపట్, పుణె, ముంబై నగరాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితుల బ్యాంకు ఖాతాలలో ఉన్న 20 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
జాతీయ భద్రతకు పెద్దపీట
ఈ అక్రమ నెట్‌వర్క్‌లో పాకిస్తాన్, శ్రీలంక, దుబాయ్ దేశాలకు చెందిన వ్యక్తులతో పాటు కొందరు భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు తేలింది. దిగుమతి చేసుకున్న ఇద్దరు వ్యాపారులు, కస్టమ్స్ బ్రోకర్‌తో పాటు దుబాయ్ సరఫరాదారుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలోనూ ఇదే రీతిలో ముంబైకి వస్తున్న ఖర్జూరాల కంటైనర్లను కూడా మన అధికారులు పట్టుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న భద్రతాపరమైన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ నుంచి ఏ వస్తువు కూడా దేశంలోకి రాకుండా పూర్తి నిషేధం విధించింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న క్రమంలోనే ఈ భారీ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.