న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఎన్నికల సంఘం (ఈసీ) ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. మణిపుర్ (60), గోవా (40), పంజాబ్ (117), ఉత్తరాఖండ్ (70), ఉత్తరప్రదేశ్ (403) రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ సీనియర్ అధికారులు పరిశీలిస్తున్నారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల నేతృత్వంలోని అధికారుల బృందం ప్రస్తుతం ఉత్తరాఖండ్లో పర్యటిస్తోంది. త్వరలో మణిపుర్, పంజాబ్లలోనూ పర్యటించనుంది. గోవా పర్యటన ఖరారు కాగా.. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో అధికారుల పర్యటన ఎప్పుడన్నది ఇంకా స్పష్టత రాలేదు.
సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లు లేదా వారి నేతృత్వంలోని బృందాలు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటించి ఏర్పాట్లను సమీక్షిస్తాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు 2027 మే 22తో ముగియనుండగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం అసెంబ్లీ గడువు ముగియడానికి ఆరు నెలల ముందే ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.
ఈవీఎంల తనిఖీలు షురూ
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల తొలి దశ తనిఖీలు (ఎఫ్ఎల్సీ) ప్రారంభమయ్యాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థలకు చెందిన ఇంజనీర్లు యంత్రాల్లో సాంకేతిక లోపాలున్నాయో లేదో పరిశీలిస్తారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షిస్తారు. తనిఖీల్లో సరిగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయిన యంత్రాలపై ‘ఎఫ్ఎల్సీ ఓకే’ అనే గుర్తు వేస్తారు.