జైపూర్: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ఆలయ దర్శనానికి వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి 8 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా ఘట్బిరోలి గ్రామానికి చెందిన 23 మంది రాజస్థాన్లోని ఖాతుశ్యామ్ ఆలయానికి బస్సులో బయల్దేరారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కోట జిల్లాలోని ఢిల్లీ–ముంబయి హైవేపై ఉన్న ఓ బ్రిడ్జిపై నుంచి 15 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఎమర్జెన్సీ బృందం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ 15 మందిని కోటా జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ పీయూశ్ సమారియా తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎ మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.