Eknath Shinde and Devendra Fadnavis in the spotlight following a recent audio controversy within Maharashtra’s Mahayuti alliance 
జాతీయ వార్తలు

మహాయుతిలో షిండే ఉండేనా?

చిన్న ఆడియో క్లిప్ మహారాష్ట్రలో ఒక్కసారిగా తీవ్ర రాజకీయ దుమారం రేపింది. దీంతో షిండే రాజకీయ భవిష్యత్తు, కూటమిలో ఆయన స్థానం తదితర అంశాలపై చర్చ కొనసాగుతోంది.

Madhu

ముంబై: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరాఠా రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రభావితం చేసేందుకు తనకు షిండే రూ.500 కోట్లు చెల్లించినట్లు పలువురు చర్చించుకున్న ఆడియో క్లిప్‌ను మనోజ్ జరాంగే పాటిల్ ఈ నెల 22న విడుదల చేశారు. అదంతా అవాస్తావమంటూ కొట్టిపారేశారు. ఈ ఆడియో క్లిప్ మహారాష్ట్రలో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేపింది. దీంతో షిండే రాజకీయ భవిష్యత్తు, కూటమిలో ఆయన స్థానం తదితర అంశాలపై చర్చ కొనసాగుతోంది.

 ఖండించిన షిండే

తనకు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ద్వారా రూ. 500 కోట్లు అందించారనే అంశం ఆ ఆడియో క్లిప్‌లో ప్రస్తావనకు వచ్చినట్లు జరాంగే పాటిల్ పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఖండించారు. తాను ఎవరికీ రూ.500 కోట్లు ఇవ్వలేదని, ఎవరి నుంచి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించారు. ఆడియో క్లిప్ ప్రామాణికతను నిర్ధారించడంతోపాటు, రెండున్నరేళ్ల తర్వాత ఈ రికార్డింగ్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందనే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. ఇటు శివసేన నాయకులు కూడా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

 బీజేపీపై షిండే వర్గం నేతల ఆరోపణలు

శివసేన సీనియర్ నాయకుడు రాందాస్ కదమ్ ఈ వివాదంపై స్పందిస్తూ, బీజేపీలోని కొందరు నాయకులు ఏక్‌నాథ్ షిండే రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. షిండేను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నవారి వివరాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. కదమ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దరేకర్ తీవ్రంగా స్పందించారు. ఆధారాలు లేకుండా బీజేపీ నాయకులపై ఆరోపణలు చేయడాన్ని సహించబోమని హెచ్చరించారు.

 అనుమానాలకు మరింత బలం

2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి విడిపోయిన షిండే, బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ 132 స్థానాలు గెలుచుకోగా, షిండే శివసేన 57 స్థానాలకే పరిమితమైంది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాగా, షిండే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వంలో పదవులు, మంత్రిత్వ శాఖలు, స్థానిక సంస్థల్లో ఆధిపత్యం, ఇతర పార్టీల నాయకుల చేరిక వంటి అంశాలపై రెండు పార్టీల మధ్య అప్పుడప్పుడు విభేదాలు బయటపడుతున్నాయి. తాజా ఆడియో వివాదం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయ్యింది.

 షిండే సీఎం పదవిపై గురి పెట్టారా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బలాన్ని పెంచి, ఏక్‌నాథ్ షిండేను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని తమ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ ఈ నెల 20న పేర్కొన్నారు. ‘ప్రతాప్ వ్యాఖ్యలు మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై పోటీకి సంకేతంగా కనిపిస్తున్నాయి. అయితే, బీజేపీకి మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కీలకంగా మారింది. మరోవైపు షిండే శివసేన తన రాజకీయ బలాన్ని పెంచుకుని ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యం పొందాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.500 కోట్ల ఆడియో వివాదం రెండు పార్టీల మధ్య నమ్మకాన్ని పరీక్షించే అంశంగా మారింది’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.