బల్క్ చక్కెర కొనుగోలుదారుల వివరాలను అక్టోబర్‌ 30లోగా సమర్పించాలని చక్కెర మిల్లులకు కేంద్రం ఆదేశాలు. 
జాతీయ వార్తలు

చక్కెర భారీగా కొంటున్నదెవరు..?

పెద్ద మొత్తంలో చక్కెర కొనుగోలు చేసిన సంస్థల పూర్తి వివరాలను అందించాలని చక్కెర మిల్లులకు ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Srinivas Rao

న్యూఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరంలో 500 టన్నులు, అంతకుమించి చక్కెర కొనుగోలు చేస్తున్న వారి సమాచారాన్ని ఈ నెల 30లోగా  తప్పనిసరిగా సమర్పించాలని దేశంలోని అన్ని చక్కెర మిల్లులకు భారత ఆహార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై గతంలో ఆయా మిల్లులు అందించిన సమాచారం అసంపూర్తిగా ఉండటంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. శీతల పానీయాల తయారీదార్లు వంటి పెద్ద సంస్థలు విరివిగా చక్కెర కొనుగోలు చేస్తుంటాయి. దేశంలో చక్కెర రిటైల్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో అక్రమ నిల్వలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం గట్టి నిఘా పెట్టింది. పెద్ద వినియోగదారులకు నేరుగా కాకుండా ఏజెంట్లు లేదా డీలర్ల ద్వారా చక్కెర విక్రయించినా అసలు బిల్లు ఎవరి పేరుతో జారీ అయిందో వారి పూర్తి వివరాలను మిల్లులు సేకరించాల్సి ఉంటుంది. బల్క్ కొనుగోలుదారుల కచ్చితమైన సమాచారం సేకరించడం ద్వారా దేశంలో కృత్రిమ కొరతను అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా చక్కెర సరఫరా పంపిణీని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు బల్క్ విక్రయాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావడమే మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యంగా ఉంది.