German diplomat Marius Osswald visits an Indian village 
జాతీయ వార్తలు

ఆవు పేడ ఎత్తిన జర్మన్ దౌత్యవేత్త

భారత గ్రామీణ జీవనశైలిని తెలుసుకునేందుకు జర్మన్ దౌత్యవేత్త మారియస్ ఓస్వాల్డ్ స్వయంగా వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Satya

న్యూఢిల్లీ: భారతదేశంలో వ్యవసాయం జీవితం అంత సులభం కాదని జర్మన్ దౌత్యవేత్త మారయస్ ఓస్వాల్డ్ అన్నారు. దేశంలోని గ్రామీణ జీవనశైలిని తెలుసుకొనేందుకు స్వయంగా వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జర్మన్ రాయబార కార్యాలయంలో మినిస్టర్ కౌన్సిలర్‌, రాజకీయ వ్యవహారాల విభాగాధిపతిగా పనిచేస్తున్న మారియస్ ఓస్వాల్డ్ ఓ గ్రామంలోని రైతు ప్రమోద్‌శర్మను కలుసుకొని గ్రామీణ జీవితాన్ని దగ్గరగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మెడలో గమ్ఛా ధరించి పశువులకు మేత వేయడం, చాఫ్ కట్టర్‌ (పశువుల మేతను చిన్న ముక్కలుగా కోసే యంత్రం)ను ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆవు పేడ ఎత్తేందుకు మురికిగా ఉందని సంకోచించగా, రైతు సూచన మేరకు చేతులతో పేడను ఎత్తి ఓ పాత్రలో వేశారు. ఓస్వాల్డ్ వ్యవసాయం జీవితం అనుభవానికి సంబంధించిన వీడియోను న్యూఢిల్లీలోని జర్మన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. ‘మారియస్‌లా పనిలో ఇంతగా చేతులు మురికి చేసుకున్న దౌత్యవేత్తలు చాలా తక్కువ మందే ఉంటారు. భారతీయులు జర్మనీలో రాణించాలని మనం కోరుకుంటే, మనం కూడా భారత్‌లోని పరిస్థితులకు తగ్గట్టుగా జీవించగలమని నిరూపించుకోవాలి. ఈసారి సవాలు సంప్రదాయబద్ధమైన వ్యవసాయం. మరి మారియస్ ఈ సవాలులో విజయం సాధించారా?’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విదేశీ దౌత్యవేత్త స్వయంగా వ్యవసాయ పనుల్లో పాల్గొనడాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు.