Goldman Sachs RBI Repo Rate Hike Forecast 
జాతీయ వార్తలు

మరో మూడుసార్లు రెపోరేట్ల పెంపు ?

2027లో మరో మూడు విడతల్లో ఆర్బీఐ రెపోరేటును పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. అయినప్పటికీ భారత్‌ ఆర్థిక వృద్ధి 7 శాతంగా కొనసాగవచ్చని పేర్కొంది.

Haji Pasha

2027 చివరికల్లా ఇంకో 75 బేసిస్ పాయింట్లను ఆర్​బీఐ పెంచే అవకాశం

అయినా భారత్​లో 7 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యమే

వచ్చే ఏడాది ద్రవ్యోల్బణ గండం : గోల్డ్‌మన్ సాక్స్

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపోరేట్లపై అతిపెద్ద అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ సంచలన అంచనాలను విడుదల చేసింది. 2026 డిసెంబరు, 2027 ఫిబ్రవరి, ఏప్రిల్/జూన్​లలో మరో మూడుసార్లు రెపోరేట్లను ఆర్బీఐ పెంచాల్సి రావచ్చని గోల్డ్‌మన్ సాక్స్కు చెందిన ప్రధాన భారతీయ ఆర్థికవేత్త శంతనుసేన్ గుప్తా తెలిపారు. ఇటీవలే (అక్టోబరు 7న) ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచి 5.50 శాతానికి చేర్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఈ విధానపరమైన మార్పుతో భారత కరెన్సీ (రూపాయి) మారకం విలువ ప్రభావితమయ్యే అవకాశాలున్నాయని శంతనుసేన్ గుప్తా చెప్పారు. దీని పర్యవసానంగా ఈ ఏడాది డిసెంబరులో మరో 50 బేసిస్ పాయింట్లు మేర రెపోరేటును ఆర్బీఐ పెంచాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయన్నారు. తదుపరిగా 2027 ఫిబ్రవరిలోనూ రెపోరేటును పెంచాల్సి రావచ్చని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మాత్రం ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు ఆర్బీఐ కొంత సమయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని శంతనుసేన్ గుప్తా తెలిపారు. వచ్చే ఏడాది చివరగా ఏప్రిల్ లేదా జూన్లో ఇంకోసారి రెపోరేటును ఆర్బీఐ పెంచే సూచనలు ఉంటాయన్నారు.

భారత్ ఆర్థిక వృద్ధికి ఢోకా లేదు

మొత్తం మీద 2027 చివరికల్లా దాదాపు మూడు విడతల్లో సగటున 75 బేసిస్ పాయింట్లు మేర రెపోరేటు పెంపు జరగొచ్చని శంతనుసేన్ గుప్తా విశ్లేషించారు. అయినప్పటికీ భారత ఆర్థిక వృద్ధిరేటు 7 శాతం మేర కొనసాగొచ్చన్నారు. అమెరికా – ఇరాన్, రష్యా – ఉక్రెయిన్, సౌదీ అరేబియా – హౌతీ (యెమన్) సైనిక సంక్షోభాల ప్రభావంతో 1 బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల రేంజ్​లో కొనసాగినా భారత ఆర్థిక వృద్ధి పయనానికి పెద్దగా ఆటంకం ఏర్పడకపోవచ్చని శంతనుసేన్ గుప్తా అంచనా వేశారు. కానీ ఎల్ నినో కరువు ఛాయలు అనేవి 2027 సంవత్సరంలో భారత్లో ద్రవ్యోల్బణం మంటలను పెంచే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే రాబోయే రోజుల్లో (ముఖ్యంగా డిసెంబర్ ద్రవ్య విధాన సమీక్షలో) వడ్డీరేట్లను ఆర్‌బీఐ మరికొంత పెంచే అవకాశం ఉందన్నారు.

అమెరికా వడ్డీరేట్లతో ఆర్బీఐకి పరిమితులు

‘‘అమెరికా ప్రభుత్వ 10 సంవత్సరాల బాండ్లపై ఇచ్చే వడ్డీరేట్లు ప్రస్తుతం 20 ఏళ్ల గరిష్ఠస్థాయిలో ఉన్నాయి. అమెరికాలోని ఇంత భారీ వడ్డీరేట్ల వల్ల ఆర్‌బీఐ నిర్ణయాలకు పరిమితులు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆర్బీఐ తన ఆర్థిక విధానాలను, ముఖ్యంగా వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలను తీసుకోలేకపోతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్ (యూఎస్ ఫెడ్) తన వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయిలో ఉంచినందు వల్ల, భారత్ ఒకవేళ ఇక్కడ వడ్డీ రేట్లను తగ్గిస్తే విదేశీ పెట్టుబడిదారులు భారతదేశ మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకునే ముప్పు ఉంటుంది. అదే జరిగితే రూపాయి విలువ పడిపోతుంది. అందుకే ఆర్బీఐకి వడ్డీరేట్లు తగ్గించే ఆప్షన్ లేకుండా పోయింది” అని శంతనుసేన్ గుప్తా వివరించారు.