Cyclone Arnab 
జాతీయ వార్తలు

‘అర్నబ్‌’తో అలజడి.. తుపాన్ల నామకరణం వెనుక ఆసక్తికర కథ ఇదే!

తుపాన్లకు పేర్లు పెట్టడం వెనుక కీలక ఉద్దేశం ఏమిటి? పేర్ల ఎంపిక నిబంధనలు, 13 దేశాల భాగస్వామ్యం, 169 పేర్ల జాబితా గురించి తెలుసుకుందాం.

Phaneendra

ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు ‘అర్నబ్‌’ తుపాను దూసుకొస్తోంది. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది అక్టోబర్‌ 28న బాపట్ల – విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటే సమయాల్లో గంటకు 115–125 కి.మీ., గరిష్ఠంగా 140 కి.మీ. వేగంతో పెనుగాలి వీచే ప్రమాదముందని హెచ్చరించింది. గతంలో తిత్లీ, హుద్‌హుద్‌, అంఫన్‌, మాండూస్‌, యాస్‌ వంటి తుపాన్లు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అయితే, ఇలా విరుచుకుపడే విపత్తులకు పేర్లు పెట్టడం వెనుక బలమైన ఉద్దేశం ఏమిటి? ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది? తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు (RSMCs), నాలుగు ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరిక కేంద్రాలు (TCWCs) పనిచేస్తున్నాయి. ఇవి తమ పరిధిలో ఏర్పడే తుపాన్లపై పర్యవేక్షణ చేపట్టి, హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తుంటాయి. ప్రాంతాన్ని బట్టి తుపాన్లకు పేర్లు కేటాయించే బాధ్యత కూడా కొన్ని కేంద్రాలకు ఉంటుంది. భారత వాతావరణ శాఖ (IMD) ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాల్లో ఒకటి. ఇది బంగాళాఖాతం, అరేబియా సముద్రంతో కూడిన ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడే తుపాన్లకు పేర్లు కేటాయిస్తుంది.

బంగ్లాదేశ్‌ సూచించిన పేరు

ప్రస్తుతం ఏర్పడిన తుపానుకు ‘అర్నబ్‌’ అనే పేరును బంగ్లాదేశ్‌ సూచించింది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), ఐక్యరాజ్యసమితి ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక, సామాజిక కమిషన్‌ (ESCAP) ఆధ్వర్యంలోని ప్రాంతీయ కమిటీ రూపొందించిన జాబితాలో ఈ పేరు ఉంది. బెంగాలీ భాషలో ‘అర్నబ్‌’ అంటే సముద్రం లేదా మహాసముద్రం అని అర్థం. అయితే ఈ పేరు సూచించిన దేశంలోనే తుపాను తీరం దాటాలనే నిబంధన లేదు. అందుకే బంగ్లాదేశ్‌ సూచించిన ‘అర్నబ్‌’ పేరును ప్రస్తుతం మన దేశంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు కేటాయించారు.

 2004లో ప్రారంభమైన విధానం

బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టాలని WMO/ESCAP ప్రాంతీయ కమిటీ 2000లో నిర్ణయించింది. 2004 సెప్టెంబరు నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో బంగ్లాదేశ్‌, భారత్‌ సహా ఎనిమిది దేశాలు సూచించిన 64 పేర్లతో జాబితా రూపొందించారు. 2020 మేలో వచ్చిన ‘అంఫన్‌’ ఆ జాబితాలో చివరి పేరు. అనంతరం మరో ఐదు దేశాలను చేర్చి మొత్తం 13 దేశాలు సూచించిన 169 పేర్లతో కొత్త జాబితాను రూపొందించారు.  ఈ ప్రాంతంలో తుపాన్లకు పేర్లు కేటాయించే బాధ్యత న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ (IMD) ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రానిది.

 13 దేశాలు.. 169 పేర్లు!

భారత్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యెమెన్‌.. ఈ 13 దేశాలు తుపాన్ల పేర్ల కేటాయింపు ప్రక్రియలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒక్కో దేశం 13 పేర్ల చొప్పున మొత్తం 169 పేర్లను సూచించింది. 2020లో ఈ కొత్త జాబితా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత 169 పేర్ల జాబితాలో ‘అర్నబ్‌’ (Arnab) 27వ పేరు. ఈ క్రమంలో తదుపరి ఏర్పడే  తుపానుకు  భారతదేశం సూచించిన ‘మురసు (Murasu)’, తర్వాతి దానికి ఇరాన్‌ సూచించిన ‘అక్వన్‌ (Akvan)’, అటుపై మాల్దీవులు సూచించిన ‘కాని (Kaani)’ పేర్లను కేటాయిస్తారు. గతంలో భారత్ 'గతి' (Gati), 'తేజ్' (Tej) వంటి పేర్లను సూచించింది.

అల్పపీడనం ఏర్పడగానే పేరు పెడతారా?

అల్పపీడనం వాయుగుండం ఏర్పడిన ప్రతిసారీ తుపాను పేరు కేటాయించరు. వాతావరణ వ్యవస్థ బలపడి, గరిష్ఠంగా నిలకడగా వీచే గాలుల వేగం గంటకు 62 కిలోమీటర్లు (34 నాట్స్‌) లేదా అంతకంటే ఎక్కువకు చేరినప్పుడు, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే పేరు కేటాయిస్తారు.

 పేర్ల ఎంపికకు నిబంధనలేంటి?

దేశాల పేర్లను ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చి, ఆయా దేశాలు సూచించిన పేర్లను నిలువు వరుసల క్రమంలో ఉపయోగిస్తారు. తుపాన్లకు సూచించే పేర్లు చిన్నవిగా, సులభంగా పలికేలా ఉండాలి. గరిష్ఠంగా ఎనిమిది అక్షరాలు ఉండాలి. రాజకీయ, మత, సాంస్కృతిక వివాదాలకు తావివ్వకూడదు. ఏ వర్గం మనోభావాలనూ దెబ్బతీయకూడదు. ఒకసారి ఉపయోగించిన పేరును మరో తుపానుకు తిరిగి కేటాయించరు.

 ఏమిటీ ఉపయోగం?

తుపాన్లకు పేర్లు పెట్టడం వల్ల వాటిని సులభంగా గుర్తించడంతోపాటు, వాటి కదలికలు, తీవ్రతపై హెచ్చరికలను ప్రజలకు వేగంగా చేరవేయవచ్చు. తుపాను వల్ల జరిగిన నష్టం, దాని ప్రభావాన్ని భవిష్యత్తులో గుర్తుచేసుకోవడానికి కూడా పేర్లు ఉపయోగపడతాయి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ తుపాన్లు ఏర్పడినప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా వాటిని వేర్వేరుగా గుర్తించేందుకు పేర్లు ఉపయోగపడతాయి. వాతావరణ శాఖలు, ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థలు, మీడియా మధ్య సమాచార మార్పిడి సులభమవుతుంది. ముఖ్యంగా తుపాను ఎక్కడ తీరం దాటనుంది? ఏయే ప్రాంతాలపై ప్రభావం చూపనుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను ప్రజలకు స్పష్టంగా చేరవేయవచ్చు. అంతేకాకుండా తుపాను హెచ్చరికలను ప్రజలు సులభంగా గుర్తుంచుకోవడానికి, అధికారిక ప్రకటనలను వెంటనే గుర్తించి అప్రమత్తం కావడానికి ఈ పేర్లు దోహదపడతాయి.