జాతీయ వార్తలు

ఆఫర్‌ లెటర్‌ ఇచ్చి.. ఉద్యోగం ఇవ్వలేదు! ఐఐటీ ఆఫర్ల కథ

Phaneendra

చేతిలో ఆఫర్‌ లెటర్‌.. కళ్ల ముందు మంచి జీతం.. ఇక కెరీర్‌ సెట్‌ అనుకున్నారు. కానీ.. జాయినింగ్‌ డేట్‌ దగ్గరపడే కొద్దీ ఎదురుచూపులే మిగిలాయి. చివరకు ఉద్యోగమే లేదని తెలిసింది!  ఆఫర్‌ ఇచ్చి.. విద్యార్థులను నెలల తరబడి వెయిట్‌ చేయించి చివరకు ఉద్యోగంలోకి తీసుకోని రెండు కంపెనీలను ఐఐటీ హైదరాబాద్‌ రెండేళ్ల పాటు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నుంచి దూరం చేసిందనే వార్త.. ఐఐటీలో సీటు వస్తే భవిష్యత్‌ భద్రమేనని కలలు కనే విద్యార్థులు, తల్లిదండ్రులకు గట్టి షాక్‌ లాంటిదే. ఈ వ్యవహారం ఒక్క ఐఐటీ హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. దేశంలోని 23 ఐఐటీల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆఫర్లు ఇచ్చిన తర్వాత కంపెనీలు ఎందుకు వెనక్కి తగ్గాయి? ఒక్క ఆఫర్‌ అమలు కాకపోవడంతో విద్యార్థులు ఎలాంటి అవకాశాలు కోల్పోయారు? ఈ వ్యవహారంపై IITలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? తెలుసుకుందాం..

23 ఐఐటీల్లో  ‘ఆఫర్‌’ షాక్‌

2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే విద్యార్థుల కోసం 2025 డిసెంబర్ నెలలో దేశంలోని ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 2026 మే 13–14 తేదీల్లో ఐఐటీయన్లకు ఇచ్చిన ఆఫర్లను కొన్ని కంపెనీలు ఉపసంహరించుకున్నాయి అనే ఈ వ్యవహారం తొలిసారిగా జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. Oracle సంస్థ 2026 బ్యాచ్ విద్యార్థులకు ఇచ్చిన 50కిపైగా ఉద్యోగ ఆఫర్లను ఉపసంహరించుకున్నట్లు విద్యార్థులు, ప్లేస్‌మెంట్ వర్గాల ద్వారా సమాచారం వెలుగులోకి వచ్చింది.  2026 జూన్ 23,24 తేదీల్లో All IITs Placement Committee (AIPC) తొలిసారి ఈ వ్యవహారాన్ని 23 IITలలో నెలకొన్న సమస్యగా అధికారికంగా ప్రకటించింది. 10 కిపైగా కంపెనీలను ఇచ్చిన ఆఫర్లు అమలు చేయకపోవడంతో 100 మందికి పైగా విద్యార్ధులు ప్రభావితమయ్యారని, వారికి మూడు నెలల జీతం పరిహారంగా చెల్లించాలని AIPC కోరింది. అయితే 2026 సెప్టెంబర్ నాటికి ప్రభావిత విద్యార్ధుల సంఖ్య 150పైగా ఉన్నట్లు AIPC ప్రకటించింది.

22 కంపెనీలపై చర్యలు

ఈ నేపథ్యంలో ఐఐటీయన్లకు ఇచ్చిన ఆఫర్లను కంపెనీలు ఉపసంహరించుకున్న 22 కంపెనీలతో 2027, 2028 ప్లేస్‌మెంట్  సీజన్లలో సహకరించకూడదని AIPC నిర్ణయించింది. ITలు దీనిని అధికారికంగా “blacklisting” అని కాకుండా “non-cooperation”గా పేర్కొంటున్నాయి. అంటే ప్లే ఆ 22 కంపెనీలకు  2027, 2028 ప్లేస్‌మెంట్  సీజన్లలో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ జాబితాలో Oracle, Interview Kickstart, SuperAGI, Rapidue / Recykal వంటి సంస్థలు ఉన్నాయి.  ప్రభావిత 23 ఐఐటీల్లో ఖరగపూర్, ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్, కాన్పూర్, రూర్కీ, గౌహతి తదితర సంస్థలు ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లోనే 15 ఆఫర్లు అమలు కాలేదు. ఇందులో Oracleకు చెందినవి 5 కాగా.. Rapidue Technologiesకు చెందినవి 10. దీంతో ఈ రెండు కంపెనీలను కూడా ఐఐటీ హైదరాబాద్‌ వచ్చే రెండేళ్ల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల నుంచి తప్పించింది.

ఒక ఆఫర్‌.. మిగతా అవకాశాలకు బ్రేక్‌

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో సాధారణంగా అమలయ్యే ‘One Student, One Offer’ విధానం విద్యార్థులకు ఊహించని చిక్కులు తెచ్చి పెట్టింది. ఒక కంపెనీ విద్యార్థిని ఎంపిక చేసి ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన తర్వాత.. ప్లేస్‌మెంట్‌ నిబంధనల ప్రకారం అతడు ఇతర కంపెనీల నియామక ప్రక్రియకు దూరమవుతాడు. దీంతో చేతిలో ఉన్న ఆఫర్‌నే నమ్ముకుని భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకుంటాడు. కానీ.. అదే కంపెనీ తర్వాత ఆఫర్‌ను అమలు చేయకపోతే పరిస్థితి ఒక్కసారిగా తారుమారవుతుంది. ఒక ఉద్యోగం దక్కకపోవడమే కాదు.. అప్పటికే చేజారిపోయిన ఇతర ఉద్యోగ అవకాశాలను కూడా తిరిగి అందుకునే అవకాశం ఉండదు. 2026 బ్యాచ్‌ విషయంలో కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లను అమలు చేయకపోవడంతో ఈ సమస్య మరింత స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. ఆఫర్లు అమలు కావన్న విషయం 2026 మేలో విద్యార్థులకు తెలిసే సమయానికి ప్లేస్‌మెంట్‌ సీజన్‌ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత ప్రభావిత విద్యార్థులను తిరిగి ప్లేస్‌మెంట్‌ ప్రక్రియలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. అప్పటికే అనేక ప్రముఖ కంపెనీల నియామకాలు, అధిక ప్యాకేజీల అవకాశాలు పూర్తయ్యాయి. దీంతో ఆఫర్‌ లెటర్‌ ఉన్నా ఉద్యోగం రాక.. మరో అవకాశం వెతుక్కునే సమయమూ లేకుండా పోయిన పరిస్థితి పలువురు విద్యార్థులకు ఎదురైంది.

లక్షల ప్యాకేజీలు.. చివరకు ఆఫర్లకే బ్రేక్‌!

ఉపసంహరించుకున్న ఆఫర్లకు సంబంధించి ఒక అంచనా ప్రకారం..అత్యధిక ఆఫర్లు ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షలకు పైగా CTC పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ఓరాకిల్ (Oracle) వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థలు సగటున రూ.35 లక్షలకుపై CTC ఆఫర్ చేసినట్లు తెలిసింది. AI, స్టార్టప్ సంస్థలు రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల పరిధిలోని వేతనాలను ఆఫర్ చేశాయి. సాధారణంగా ఐఐటీలలో సగటు (Average/Median) వేతనం రూ. 17 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉండగా, కంప్యూటర్ సైన్స్ (CSE), ఇతర ప్రత్యేక టెక్ విభాగార్థులకు ఈ సగటు రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు ఉంటుంది.

కంపెనీలు ఎందుకు ఇలా చేశాయి?

ఆఫర్లను వెనక్కి తీసుకోవడానికి కంపెనీలన్నింటికీ కారణాలు ఒకేలా లేవు. కొన్ని సంస్థలు అంతర్గత పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల సంఖ్యపై నిర్ణయాలు, మారుతున్న నియామక అవసరాలను కారణాలుగా చూపించగా.. మరికొన్ని సంస్థల విషయంలో పూర్తి వివరాలు బహిరంగం కాలేదు. Oracle విషయంలో మాత్రం 2026లో జరిగిన restructuring, layoffs, headcount సమస్యలు ఆఫర్ల ఉపసంహరణకు కారణాలుగా నివేదికలు పేర్కొన్నాయి. కొన్ని స్టార్టప్‌లు నిధుల కొరత (Funding Crunch) వల్ల వెనకడుగు వేశాయి.

జూన్‌లోనే ఐఐటీలు హెచ్చరించాయి

సమస్య తీవ్రత బయటపడటంతో జూన్‌ 2026లోనే AIPC రంగంలోకి దిగింది. అప్పటికి 10కిపైగా కంపెనీల వల్ల సుమారు 100 మంది విద్యార్థులు ప్రభావితమైనట్లు కమిటీ గుర్తించింది. Oracle, Interview Kickstart, SuperAGI తదితర కంపెనీలకు AIPC స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆఫర్లు అమలు చేయండి.. లేకపోతే ప్రభావిత విద్యార్థులకు మూడు నెలల జీతానికి సమానమైన పరిహారం ఇవ్వాలని  మొదట ఆగస్టు 15, 2026 వరకు గడువు ఇచ్చింది. స్పందించకపోతే 2027, 2028 బ్యాచ్‌ల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కంపెనీలకు అవకాశం ఉండదని హెచ్చరించింది. ఆగస్టు 15 గడువు తర్వాత కూడా వ్యవహారం పూర్తిగా కొలిక్కిరాలేదు. దీంతో కంపెనీలకు  సెప్టెంబర్ 15, 2026 వరకు తుది అవకాశం ఇచ్చింది. ఆ గడువు తర్వాత కూడా కంపెనీల నుంచి స్పందన లేదు. IIT గువాహటి వేదికగా జరిగిన AIPC సమావేశంలో 2026 బ్యాచ్‌కు ఇచ్చిన ఆఫర్లను గౌరవించని 22 కంపెనీలతో వచ్చే రెండు ప్లేస్‌మెంట్‌ సీజన్లలో సహకరించకూడదని నిర్ణయించారు. కంపెనీలకు ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్‌ 30లోగా అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించారు.

ఐఐటీలు ఏం చేస్తున్నాయి?

ఆఫర్లు కోల్పోయిన విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించేందుకు ఐఐటీల ప్లేస్‌మెంట్‌ విభాగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న రిక్రూటర్లకు ప్రభావిత విద్యార్థుల రెజ్యూమేలను పంపడం, ఇతర కంపెనీల్లో అవకాశాలు కల్పించేందుకు క్రాస్‌-రెఫరల్స్‌ చేయడం వంటి చర్యలు చేపట్టాయి. సుమారు 20–30 శాతం మంది ప్రభావిత విద్యార్థులు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉద్యోగాలు పొందినట్లు సమాచారం.

మొదటిసారి కాదు.. గతంలోనూ పలు కంపెనీలపై చర్యలు

2026 బ్యాచ్‌ విషయంలో వెలుగుచూసిన ఈ వ్యవహారం పూర్తిగా కొత్తది కాదు. గతంలోనూ క్యాంపస్‌లో ఆఫర్లు ఇచ్చి తర్వాత వాటిని ఉపసంహరించుకున్న కంపెనీలపై IITలు చర్యలు తీసుకున్నాయి. 2025 ప్లేస్‌మెంట్‌ సీజన్‌లో అంతకుముందు ఆఫర్లు ఉపసంహరించిన 20కిపైగా కంపెనీలను IITలు క్యాంపస్‌ నియామకాల నుంచి దూరం పెట్టాయి. అయితే ఈసారి పరిస్థితి మరింత విస్తరించింది. గత ఏడాది సుమారు 10–11 కంపెనీలు ఆఫర్లను గౌరవించలేదని AIPC తెలిపితే.. 2026 బ్యాచ్‌ విషయంలో 23 IITల పరిధిలో 150కిపైగా ఆఫర్లు అమలు కాలేదు.

ఆఫర్ లెటర్‌కు చట్టభద్రత కావాలి

క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో దశాబ్దాలుగా అమలవుతున్న ‘One Student, One Offer’ నిబంధన విద్యార్థుల భవిష్యత్తుకు భద్రత కల్పించడం కంటే రిక్రూటింగ్ కంపెనీల లబ్ధికే ఎక్కువ తోడ్పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక కంపెనీలో ఆఫర్ రాగానే విద్యార్థి తదుపరి ఇంటర్వ్యూలకు దూరమవ్వాల్సి రావడం, ఆ తర్వాత సదరు కంపెనీ ఆఫర్‌ను రద్దు చేసుకుంటే విద్యార్థికి వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోవడం తీవ్ర లోపంగా మారింది. ఈ నేపథ్యంలో విధానపరమైన మార్పులు అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ అధికారికంగా జాయినింగ్ తేదీని ఖరారు చేసి ఉద్యోగాన్ని నిశ్చయం చేసే వరకు విద్యార్థులకు మరొక 'బ్యాకప్ ఆఫర్' పొందే వెసులుబాటు ఇవ్వాలని లేదా 'సెకండరీ ప్లేస్‌మెంట్' పూల్‌లో పాల్గొనే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. మరోవైపు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కంపెనీలు ఇచ్చే ఆఫర్ లెటర్లకు ఎలాంటి ‘చట్టబద్ధత’ (Legal Binding) లేకపోవడం వల్లనే సంస్థలు సులభంగా వెనక్కి తగ్గుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక మందగమనం లేదా అంతర్గత కారణాలను సాకుగా చూపి ఆఫర్లను రద్దు చేసినప్పుడు కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ప్రస్తుత నిబంధనల్లో లేదు. దీనివల్ల విద్యార్థులు సాధించిన అర్హత, కేటాయించిన సమయం వృథా కావడమే కాకుండా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అందుకే మున్ముందు క్యాంపస్ ఎంపికల్లో కేవలం ఆఫర్ లెటర్ ఇచ్చి ఊరుకోకుండా, కంపెనీలు బాండ్ లేదా చట్టబద్ధమైన ఒప్పందాలు (Legal Agreements) కుదుర్చుకునేలా నిబంధనలు కఠినతరం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.